ఎమ్బీయస్‌ : రెండు రాష్ట్రాల భవిష్యత్తు ఏమిటి? – 1

రాష్ట్రం విడిపోయింది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అత్యంత అపసవ్యంగా జరిగిన విభజన ప్రక్రియ గురించి మరో వ్యాసంలో బాధపడతాను కానీ యిది భవిష్యత్తు గురించి రాస్తున్నాను – ఎందుకంటే నాకు మెయిల్స్‌ రాసిన చాలామంది…

రాష్ట్రం విడిపోయింది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అత్యంత అపసవ్యంగా జరిగిన విభజన ప్రక్రియ గురించి మరో వ్యాసంలో బాధపడతాను కానీ యిది భవిష్యత్తు గురించి రాస్తున్నాను – ఎందుకంటే నాకు మెయిల్స్‌ రాసిన చాలామంది దీని గురించే ఆందోళన చెందుతున్నారు. ఇరు రాష్ట్రాలలో కొట్లాటలు జరుగుతాయా? ప్రజలు సురక్షితంగా వుంటారా? విడిపోయి లాభపడతారా? నష్టపోతారా? ఎవరు లాభపడతారు? ఎవరు నష్టపోతారు? ఈ రాష్ట్రాలలో యిన్వెస్ట్‌ చేయవచ్చా? వేరే చోటకు తరలిపోతే మంచిదా? – ఇలా అనేక సందేహాలు. వీటన్నిటికి కలిపి ఒకే ఒక్క సులభమైన సమాధానం చెప్పేసి వూరుకోవచ్చు – 'అంథా వచ్చే ప్రభుత్వాలపై ఆధారపడి వుంటుంది' అని. అఫ్‌కోర్స్‌, అదెలాగూ వుంది. కానీ దానికి తోడు మిగతా అంశాలు కూడా వుంటాయి. అవి చేర్చి సావకాశంగా ఆలోచించాలి. 

దీనిలో జ్యోతిష్కం పనికిరాదు. మనుష్యుల విషయంలో జాతకచక్రం వేసి జోస్యం చెప్పవచ్చు – మనుష్యులకు ఒక పుట్టుక వుంటుంది కాబట్టి. దేశాలు, రాష్ట్రాల విషయంలో ఎలా చెప్పగలం? భారతదేశ చక్రం అంటూ గీసేసి యిలా యిలా జరుగుతుందని జోస్యాలు చెప్తారు. పుట్టుక తేదీ తెలియకుండా చక్రం ఎలా వేశారు? అంటే 1947 ఆగస్టు 15 కదా అంటారు. ఆ రోజున మన దేశం పుట్టలేదు. అధికారం చేతులు మారిందంతే. పుట్టినది కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఆ తేదీ నీ దగ్గర లేదు. వాస్తు కూడా చెప్పేస్తారు. దేశపు ఎల్లలు మారుతూ వుంటాయి. ఒకప్పుడు ఆఫ్గనిస్తాన్‌, నేపాల్‌ కూడా భారత ఉపఖండంలో భాగాలే. ప్రాంతాలన్నిటినీ దేశాలు అనేవారు. పోనుపోను కొన్ని దేశాలు విడిగా వెళ్లిపోయాయి. మిగిలిన దేశాలను పేరు మార్చి రాష్ట్రాలన్నారు. వాటన్నిటినీ కలిపి దేశం అన్నారు. ఇలాటి దానికి వాస్తు రూల్సు ఎలా అప్లయి చేయగలరు? అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంటూ ఏదైనా తేదీ నిర్ణయిస్తే ఆ రోజు తెలంగాణ పుట్టినట్లు కాదు, ఎప్పణ్నుంచో వున్న ప్రాంతానికి అవేళ ఆ పేరుతో రాష్ట్రం అనే హోదా కల్పిస్తున్నారు. అంతే! ఆ తేదీనాటి గ్రహస్థితి చూసి మనం భవిష్యత్తు చెప్పకూడదు. 

కలసి వుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు కానీ యిప్పుడు విడిపోతే కలదు సుఖం అన్నారు వెంకయ్యనాయుడు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఉమ్మడి కుటుంబంలో చాలా సౌలభ్యం వుంది. మాది పెద్ద ఫ్యామిలీ. మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు. ఆయన పోయిన దాదాపు పాతికేళ్లపాటు మేమంతా కలిసే వున్నాం – ఒకరి కొకరు సాయపడుతూ! ఉద్యోగరీత్యా బయటకు వెళ్లినా ఫ్యామిలీతో బంధం తెగిపోయేది కాదు. ఏదైనా పని వస్తే ఎవరికి వీలుపడితే, ఎవరికి చాతనైతే వాళ్లు చేసేవాళ్లం. ఆ విధంగా ఎంతో టైము ఆదా అయ్యేది. ఉదాహరణకి నాకు ప్రమోషన్‌పై కలకత్తా వేసినపుడు హైదరాబాదులో ఉమ్మడి కుటుంబాన్ని విడిచి వెళ్లాను. అప్పట్లో కలకత్తాలో పవర్‌ కట్స్‌ విపరీతంగా వుండేవి. కిరోసిన్‌ దీపాలు వాడవలసి వచ్చేది. నేను వెళ్లి రేషన్‌ షాపు క్యూలో నిలబడి కిరోసిన్‌ తేవలసి వచ్చేది. నాకు మహా మంటగా వుండేది. హైదరాబాదులో యీ పని నేనెన్నడూ చేయలేదు. మా ఆఖరి తమ్ముడు చేసే పని యిది. అలాగే కూరలు యింకో తమ్ముడు తెచ్చేవాడు. కలకత్తాలో యివన్నీ నేనే చేయడం అనేది నాకు దుస్సహంగా వుండేది. హైదరాబాదులో నా పని – అజమాయిషీ చేయడం, బయటి పెద్దలతో కుటుంబ వ్యవహారాలు మాట్లాడడం యిలాటి గంభీరమైన విషయాలు. నేను విడిగా వచ్చేయడంతో చిల్లరమల్లర పనులతో నా క్వాలిటీ టైమ్‌ వృథా అయి పుస్తకాలు చదవడం బాగా తగ్గిపోయింది. 

గ్రూపు సినర్జీ అంటారు కదా, అది జాయింటు ఫ్యామిలీలో బాగా తెలుస్తుంది. గతంలో కుటుంబం భర్తను పోగొట్టుకున్న కూతుళ్లు/కోడళ్లు, భార్యను పోగొట్టుకున్న కొడుకులు, ఆర్థికంగా బలహీనంగా వుండే బంధువులు, ముసలివాళ్లు, పిల్లలు – అందరికీ ఉమ్మడి కుటుంబం మఱ్ఱిచెట్టులా వుండి ఆశ్రయం యిచ్చేది. ఇప్పుడది పోయింది. అన్నీ న్యూక్లియస్‌ ఫ్యామిలీలు. భార్యా, భర్త, యిద్దరు పిల్లలు – బస్‌! పిల్లలు పెందరాళే స్కూలు నుండి వచ్చేస్తే వాళ్లకు టిఫెను తినిపించడానికి ఎవరూ వుండరు. విద్యాసంవత్సరం మధ్యలో భర్తకు వేరే చోటకు బదిలీ అయితే భార్య ఒక్కత్తీ అవస్థలు పడాల్సిందే. భార్యకు అనారోగ్యం వస్తే భర్త చేయి కాల్చుకోవలసినదే. ఇద్దరూ ఉద్యోగస్తులైతే టీనేజికి వచ్చిన పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించే తీరిక వుండదు. తలిదండ్రులకు గాని, అత్తమామలకు గాని అనారోగ్యం వస్తే తీసుకుని వచ్చి పెట్టుకునే స్తోమత చాలదు. మేనల్లుడు 'మీ యింట్లో వుంటూ యీ వూళ్లో కాలేజీలో చదువుకుంటా'నంటే సారీ చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే విడివిడిగా ఏ కుటుంబానికీ ఆ శక్తి వుండదు. అదే నాలుగైదు కుటుంబాలు కలిసి ఆ భారాన్ని పంచుకుంటే శ్రమ తెలియదు. కుటుంబం మరీ పెద్దదయినపుడు వ్యక్తుల స్థాయిల్లో హెచ్చుతగ్గులు వచ్చి విడిపోవలసి వస్తుంది. అలా విడిపోయినపుడు బయటకు వచ్చిన ప్రతీవాడూ తన కాళ్లమీద తాను నిలబడే సత్తా వచ్చాకనే విడిపోవాలి. మా అన్నదమ్ములం అదే చేశాం. విడివిడి కాపురాలు వున్నా యిప్పటికీ జాయింటు ఫ్యామిలీ స్పిరిట్‌ పోలేదు. పండగలు కలిసి చేసుకోవడం, పెద్ద పెద్ద ఫంక్షన్‌లు అందరం కలిసి చేయడం వుంది. జాయింటు ఫ్యామిలీలో అహంకారాన్ని, స్వార్థాన్ని అదుపులో పెట్టుకోవాలి.  ఆ పని చేయకపోతే ఉమ్మడి కుటుంబమే కాదు, భార్యాభర్తలు మాత్రమే వున్న కుటుంబం సైతం విచ్ఛిన్నమౌతుంది.

తెలుగువాళ్లు విడిపోవాలి అన్న స్లోగన్‌ బయలుదేరినపుడు నాకు బాధ వేసింది. జనాభా 10 కోట్లు దాటినపుడు రెండు 5 కోట్ల రాష్ట్రాలుగా  విడిపోతే మంచిదనే అనుకున్నాను. అయితే విడిపోయేముందు పదేళ్లపాటు కసరత్తు చేయాలి. రెండు ప్రాంతాలలో అభివృద్ధి చేపట్టి, స్వయంపోషకాలుగా నిలబెట్టి అప్పుడు విడదీస్తే – అదీ ప్రాంతాల పేరు పెట్టి కాదు, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ అనే పేర్లతో – బాగుంటుందని సూచించాను. ఆ సలహాను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు జరిగిన విభజనలో సీమాంధ్రప్రాంతం పూర్తిగా అన్యాయమై పోయింది. దాని కాళ్లపై అది నిలబడలేదు. దాని జోలెలో హామీలే తప్ప నిధులు లేవు. భార్యాభర్తలు విడిపోయినపుడు భార్య స్థిరాస్తి అంతా చేతిలో పెట్టుకుని భర్తను రోడ్డుపై వదిలిపెట్టి, కాళ్లూ చేతులూ వున్నాయిగా పని చేసుకో అని చెప్పినట్లు అన్ని సౌకర్యాలు, ఆదాయవనరులు వున్న హైదరాబాదును తెలంగాణ తీసుకుని, సీమాంధ్రకు ఏమీ లేకుండా చేశారు. అందువలన తెలంగాణ రాష్ట్రం యినీషియల్‌ ఎడ్వాంటేజితో ప్రారంభమవుతోందని అనిపిస్తుంది. ఎందుకంటే  దేశమంతానే కాదు, ప్రపంచమంతా ఒక బ్రాండ్‌ తెచ్చుకున్న హైదరాబాదు వంటి మహానగరం అన్ని సౌకర్యాలతో దానిదే.  రెండు థాబ్దాలుగా అది పెరుగుతూ వచ్చి సంతరించుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్కడికీ పోదు. గత ఐదేళ్లలో శాంతిభద్రతల కారణంగా, విభజనోద్యమం కారణంగా ప్రగతి కుంటుపడింది. ఇప్పుడు ఏదో ఒక ఒడ్డుకి చేర్చారు కాబట్టి, యిక్కడ ఆందోళనలు వచ్చే అవసరం లేదు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014)

[email protected]