సినిమా రివ్యూ: ఆహా కళ్యాణం

రివ్యూ: ఆహా కళ్యాణం రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: యష్‌రాజ్‌ ఫిలింస్‌ తారాగణం: నాని, వాణి కపూర్‌, బడవ గోపి, ఎం.జె. శ్రీరామ్‌, సిమ్రన్‌ తదితరులు కథ: మనీష్‌ శర్మ సంగీతం: ధరన్‌ కుమార్‌ కూర్పు:…

రివ్యూ: ఆహా కళ్యాణం
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: యష్‌రాజ్‌ ఫిలింస్‌
తారాగణం: నాని, వాణి కపూర్‌, బడవ గోపి, ఎం.జె. శ్రీరామ్‌, సిమ్రన్‌ తదితరులు
కథ: మనీష్‌ శర్మ
సంగీతం: ధరన్‌ కుమార్‌
కూర్పు: బవన్‌ శ్రీకుమార్‌
ఛాయాగ్రహణం: లోగనాధన్‌ శ్రీనివాసన్‌
నిర్మాత: ఆదిత్య చోప్రా
దర్శకత్వం: గోకుల్‌ కృష్ణ
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2014

హిందీలో విజయవంతమైన ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ని తెలుగు, తమిళంలో రీమేక్‌ చేద్దామని అనుకున్నారు. అయితే ఆ కథని ‘జబర్దస్త్‌’లో కాపీ కొట్టేసే సరికి తెలుగు వెర్షన్‌ని పక్కన పెట్టి పూర్తిగా తమిళంలోనే రీమేక్‌ చేసి తెలుగులో కూడా అనువదించి ‘ఆహా కళ్యాణం’గా విడుదల చేసారు. తెలుగు హీరో నటించిన తమిళ చిత్రం అనువాదమైన ఆహా కళ్యాణం ఎలా ఉందో చూద్దాం.

కథేంటి?

వెడ్డింగ్‌ ప్లానర్‌గా సక్సెస్‌ అయి తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది శృతి సుబ్రమణ్యం (వాణి కపూర్‌). చదువు అబ్బని శక్తి (నాని) ఆమె ప్లాన్స్‌ విని తనని కూడా బిజినెస్‌లో పార్టనర్‌ని చేసుకోమంటాడు. ఇద్దరూ ‘గట్టిమేళం’ అనే వెడ్డింగ్‌ ప్లానింగ్‌ ఆఫీస్‌ స్టార్ట్‌ చేస్తారు. తమకంటూ ఒక టీమ్‌తో అంచెలంచెలుగా ఎదిగి స్టార్‌ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ అవుతారు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఇద్దరూ విడిపోయి గట్టి మేళం అప్పుల్లో కూరుకుపోతుంది. మళ్లీ ఇద్దరూ కలిసి దానిని ఎలా సక్సెస్‌ చేస్తారు, ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేధాలు ఎలా క్లియర్‌ చేసుకుంటారనేది ఆహా కళ్యాణం. 

కళాకారుల పనితీరు!

తన సినిమా ఫలితం ఏమైనా కానీ నాని మాత్రం ప్రతి సినిమాలోను నటుడిగా తన పాత్రకి పూర్తి న్యాయం చేస్తుంటాడు. ఆహా కళ్యాణంలోను నాని చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో విడిగా వినోదం అంటూ ఏమీ లేదు. దానిని అందించే బాధ్యత కూడా తనే తీసుకున్నాడు. చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు. వాణి కపూర్‌కి ఇది ఛాలెంజింగ్‌ రోల్‌. ఒరిజినల్‌లో అనుష్క శర్మ అద్భుతంగా చేసి అందరినీ మెప్పించిన పాత్ర. వాణి కపూర్‌ ఆమెలో సగం కూడా చేయలేకపోయింది. అనుష్కతో కంపేర్‌ చేయకపోతే వాణి నటన ఓకే అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకి వాణి నుంచి ‘ఓకే’ పర్‌ఫార్మెన్స్‌ సరిపోదు. సిమ్రన్‌ అతిథి పాత్రలో కనిపించింది. ఫ్లోరిస్ట్‌ క్యారెక్టర్‌లో బడవ గోపి పర్‌ఫార్మెన్స్‌ బాగుంది. 

సాంకేతిక వర్గం పనితీరు:

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌కి మ్యూజిక్‌ పెద్ద ప్లస్‌ అవ్వాలి. అది రూలు. కానీ ఈ చిత్రంలో ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. అసలే అరవ పాటలు… దానికి తోడు అనువాద సాహిత్యం. పాటలొచ్చినప్పుడు హాల్లోంచి బయటకి పరుగులు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశంతో సంబంధం లేకుండా తెగ చిరాకు పెడుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్రేమ్స్‌ అన్నీ రిచ్‌గా ఉన్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. యష్‌రాజ్‌ ఫిలింస్‌ ప్రొడక్షన్‌ క్వాలిటీ గురించి చెప్పేదేముంది. 

దర్శకుడు గోకుల్‌ కృష్ణ ఒరిజినల్‌కి మార్పు చేర్పులు చేయడానికి సాహసించలేదు. హిందీలో ఎలా ఉందో అలానే తీయడానికి కట్టుబడ్డాడు. సరదా సన్నివేశాల వరకు ఫర్వాలేదనిపించినా, సినిమాలోని కాన్‌ఫ్లిక్ట్‌ని సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయాడు. 

హైలైట్స్‌:

  • నాని పర్‌ఫార్మెన్స్‌
  • సినిమాటోగ్రఫీ

డ్రాబ్యాక్స్‌:

  • మ్యూజిక్‌
  • డల్‌ సెకండ్‌ హాఫ్‌

విశ్లేషణ:

‘ఆహా కళ్యాణం’కి కొన్ని మౌలిక సమస్యలున్నాయి. ఒకటి ఈ చిత్రం టార్గెట్‌ చేసిన ఆడియన్స్‌లో ఎక్కువ మంది ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ చూసేసి ఉంటారు. మరోటి… ఈ చిత్రంలో 70 శాతం కంటెంట్‌ని ‘జబర్దస్త్‌’ చిత్రంలో కాపీ కొట్టారు. ఏ సినిమాతో కంపేరిజన్‌ వచ్చినా కానీ ప్రాబ్లెమ్‌ అయిపోతుంది. జబర్దస్త్‌ చూసిన వాళ్లు దానిలానే ఉందిగా అనేసే ప్రమాదముంది. ‘బిబిబి’ చూసిన వాళ్లు ‘దానంత బాలేదుగా’ అని పెదవి విరిచే అవకాశముంది. ఈ ఇఫ్స్‌ అండ్‌ బట్స్‌ జోలికి పోకుండా ‘ఆహా కళ్యాణం’ గురించి చెప్పుకోవాలంటే ఓవరాల్‌గా ఓకే మూవీ అనిపిస్తుంది. 

సినిమాలో ఎంటర్‌టైన్‌ చేసే కొన్ని సందర్భాలున్నాయి. ‘ఎందుకొచ్చాం బాబూ’ అని బోర్‌ ఫీలయ్యే సన్నివేశాలూ ఉన్నాయి. నాని తాను ఉన్న ప్రతి సీన్‌లోను ఏదోటి చేసి సినిమాని షోల్డర్‌ చేయడానికి చూసాడు. అతడిని అభిమానించే వారు ఈ చిత్రానికి పాస్‌ మార్కులు వేసేయవచ్చు. కానీ టోటల్‌గా కంటెంట్‌ని చూసుకుంటే మాత్రం ఏదో వెలితి వెంటాడుతుంది. కీలకమైన ద్వితీయార్థంలో ఎమోషనల్‌ సీన్స్‌ సరిగా తెరకెక్కించలేదు. వాణి కపూర్‌ తను పడే మానసిక సంఘర్షణని సరిగా ప్రదర్శించలేదు. ఆ సీన్స్‌తో డిస్‌కనెక్ట్‌ అయినట్టయితే ఇక సినిమాలో ఏమీ లేదనిపిస్తుంది. క్లయిమాక్స్‌లో ఏం జరుగుతుందనేది ఇంటర్వెల్‌ సీన్‌లోనే ఊహించేయవచ్చు. అయినా చివరి వరకు కూర్చోగలమంటే అందుకు కారణం నాని పర్‌ఫార్మెన్స్‌. 

పాటలు బాగుండి ఉంటే సినిమా రేంజ్‌ పెరిగి ఉండేది. కనీసం తెలుగులో తీసి ఉన్నా బాగుండేది. తమిళంలో తీసి అనువదించడం వల్ల పరభాషా చిత్రం చూస్తున్నామనే ఫీలింగ్‌ అడుగడుగునా వెంటాడుతుంది. బ్యాండ్‌ బాజా చూడని ప్రేక్షకులు నాని కోసం ఈ చిత్రం ఓసారి చూడవచ్చు. ఒరిజినల్‌ చూసేసిన వారికి దీంతో నిరాశ తప్పకపోవచ్చు.

బోటమ్‌ లైన్‌: ఈ కళ్యాణంలో ఎరేంజ్‌మెంట్స్‌ ఓకే.. భోజనాలు మాత్రం బ్యాడ్‌!

జి.కె.