‘1’వేలో యాక్సిడెంట్‌ ఎందుకయింది?

సాధారణంగా ఒక సినిమా హిట్‌ అయి దానికి ‘బ్యాడ్‌ రివ్యూస్‌’ వస్తే ఆ పొరపాటుని ఎత్తి చూపించేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాగే ఒక ఫ్లాప్‌ సినిమాకి గుడ్‌ రివ్యూ ఇచ్చినా ‘మీకు సినిమా…

సాధారణంగా ఒక సినిమా హిట్‌ అయి దానికి ‘బ్యాడ్‌ రివ్యూస్‌’ వస్తే ఆ పొరపాటుని ఎత్తి చూపించేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాగే ఒక ఫ్లాప్‌ సినిమాకి గుడ్‌ రివ్యూ ఇచ్చినా ‘మీకు సినిమా చూడ్డం రాదంటూ’ విమర్శిస్తారు. కొన్ని హిట్‌ సినిమాలకి బ్యాడ్‌ రివ్యూస్‌ ఇచ్చి కూడా సమీక్షకులు పెద్దగా విమర్శలు ఎదుర్కోకుండా తప్పించేసుకుంటారు. కారణం… ఆ సినిమా హిట్‌ అవడానికి కారణమైన ప్రేక్షకులు మీడియా రిపోర్ట్స్‌ని.. వెబ్‌సైట్స్‌ రివ్యూస్‌ని ఫాలో కారు కనుక. ఫ్లాప్‌ అయిన సినిమాకి బ్యాడ్‌ రివ్యూస్‌ ఇచ్చారని గగ్గోలు పెట్టడం మాత్రం అరుదుగా జరుగుతుంది. దీనికి కారణం సినిమా ఫ్లాప్‌ అవడానికి కారణమైన కామన్‌ సినీ గోయర్స్‌ రివ్యూస్‌తో సంబంధం లేకుండా రిజల్ట్‌ తేల్చేయడం ఒక్కటే కాదు… ఇది నచ్చిన ఆ కొద్ది మంది జనం ఇంటర్నెట్‌లో రివ్యూస్‌ని ఎక్కువగా ఫాలో కావడం కూడా!

‘ఇలాంటి కొత్త ప్రయత్నాన్ని (ప్రయోగాన్ని అని కూడా కొందరంటున్నారు) సగటు సినీ ప్రేక్షకుడు తిప్పి కొట్టవచ్చు కానీ సినీ సమీక్షకులు అయి ఉండీ దీనిని ఎత్తి చూపించడం ఏమిటి? అంత లో రేటింగ్‌ ఇవ్వడమేంటి?’ అనేది ఎక్కువ మంది కంప్లయింట్‌. ‘క్రిష్‌ 3’ అనే చవకబారు సూపర్‌హీరో సినిమాకి తక్కువ రేటింగ్‌ ఇచ్చినపుడు.. ఆ సినిమా వసూళ్లు చూపించి ‘తప్పు చేసారు’ అంటూ ప్రశ్నించిన వాళ్లు… ‘1 నేనొక్కడినే’ విషయంలో కలెక్షన్లు ఎలాగో తమని సపోర్ట్‌ చేయడం లేదని… ‘ఇంటెల్లిజెంట్‌ ఫిలిం’ పేరిట దీనిని ఆకాశానికి ఎత్తేస్తూ… ‘ఇంత గొప్ప సినిమాని విమర్శకులే చంపేసారు’ అని వాపోతున్నారు. ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌… ఇది ఎక్స్‌పెరిమెంట్‌ కాదు. ఇంటిల్లిజెంట్‌ ఫిలిం అంత కంటే కాదు. ఒక సగటు రివెంజ్‌ డ్రామా కథని, ఒక విధమైన సైకలాజికల్‌ డిజార్డర్‌ ఉన్న కథానాయకుడి పాత్రతో, రొటీన్‌కి కాస్త భిన్నమైన ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించిన చిత్రం. సో.. ఈ సినిమా నచ్చింది కనుక తమకి తామే ఇంటలెక్చువల్‌ అని, విదేశాల్లో ఉన్నాం కనుక తమ ఐక్యూ లెవల్‌ ఎక్కువనీ ఫీలవుతున్న సదరు సెల్ఫ్‌ ప్రొక్లెయిమ్డ్‌ ఇంటలెక్చువల్స్‌ అంతా ఆ భ్రమల్లోంచి బయటకి వచ్చేయవచ్చు. 

సాక్షాత్తూ ఈ చిత్ర దర్శకుడు సుకుమార్‌ అన్నట్టు… ఇది హండ్రెడ్‌ పర్సెంట్‌ కమర్షియల్‌ ఫిలిం. చిన్నప్పుడే కొందరు దుష్టుల కారణంగా తన తల్లిదండ్రుల్ని కోల్పోయిన హీరో పెరిగి పెద్దయి వారిపై పగ తీర్చుకోవడమే ఈ చిత్ర కథ. వందల కొద్దీ సినిమాల్లో చూసిందే కదా? ఎంతటి వాడినైనా ఎత్తి కుదేసి, ఎంతటి దూరాన్ని అయినా ఒక్క గంతులో ఎగిరి దూకేసే లక్షణాలున్న ‘సూపర్‌ హీరో’. అతను ఫైటరో, లేదా మరేదైనా శారీరిక శ్రమ అవసరమైన పని చేస్తున్నవాడో కాదు. ఒక పెద్ద రాక్‌ స్టార్‌. అతను ఒక్కసారి గొంతెత్తి పాడితే… తానొక బాధ్యతాయుతమైన టీవీ రిపోర్టర్‌ అయి ఉండీ సర్వం మర్చిపోయి మైకంలో పడిపోయే సగటు హీరోయిన్‌. చిట్టి పొట్టి నిక్కర్లేసుకుని సినిమాకి కావాల్సిన ‘కమర్షియల్‌ ఎలిమెంట్‌’ ఒకటి తనవంతుగా సరఫరా చేస్తుంటుంది. దీనిని ఒక ‘పాత్‌ బ్రేకింగ్‌ ఫిలిం’ అని ప్రచారం చేస్తున్నారు. పెద్ద స్టార్‌ని పెట్టుకుని పాటల్లేకుండా కానిచ్చేసారా అంటే అదీ లేదు. అయిదు పాటలున్నాయి. అకారణంగా, అసందర్భంగా వచ్చి పోతుంటాయి… కమర్షియల్‌ సినిమాకి న్యాయం చేస్తూ! పోనీ అంతటి సూపర్‌స్టార్‌ని పెట్టి ఫైట్స్‌ లేకుండా కేవలం డ్రామా ప్రధానంగా సినిమా తీసారా… ఆ విధంగా పాత్‌ బ్రేకింగ్‌ అనుకుందామా అంటే ఆ ఆస్కారం కూడా లేదు. అంతటా కావాల్సినన్ని ఛేజులు, ఫైట్లు, కాల్పులు, బ్లడ్డూ, డెడ్‌ బాడీసు. ఐటెమ్‌ సాంగ్‌ త్యాగం చేసారేమో అనుకుంటే, దానిని కూడా ఇరికించేసి కమర్షియల్‌ సినిమాని పరిపూర్ణంగా మలిచారు. కామెడీ అని వాళ్లు అనుకున్నది పేలలేదు కానీ దానిని ఇరికించే ప్రయత్నం ‘అప్రయత్నంగానో’, ‘అలవాటుగానో’ జరిగింది. గోవాలో హీరోయిన్‌ పడే పాట్లు, పోసాని కృష్ణమురళి క్యారెక్టరు ఆ బాపతు సరంజామానే. కమర్షియల్‌ సినిమాని రౌండ్‌ ఆఫ్‌ చేయడానికి కావాల్సిన సెంటిమెంట్‌ కోణం ఎలాగో సినిమాలో అతి ముఖ్యమైన అంశం కాబట్టి… సదరు పాత్‌ బ్రేకింగ్‌ సినిమాలో సగటు కమర్షియల్‌ సినిమా హంగులన్నీ ఉన్నట్టే.

‘ఎంటర్‌టైన్‌మెంట్‌’ని సుకుమార్‌ చక్కగా డిఫైన్‌ చేసాడు. ఎమోషనల్‌గా ఇన్‌వాల్వ్‌ చేసిన ఏ సినిమా అయినా ఎంటర్‌టైనరే అని! అయితే అలా ఎంటర్‌టైన్‌ చేయడంలోనే సుకుమార్‌ విఫలమయ్యాడు. సైకలాజికల్‌ డిజార్డర్‌ ఉన్న హీరో పరిచయ సన్నివేశాలతో అతనితో ఎమోషనల్‌గా కనెక్ట్‌ కాగలగాలి. లేనివి ఉన్నట్టు ఊహించుకుంటూ… చిన్నప్పటి తన చేదు జ్ఞాపకాల్ని తనలోనే మోస్తున్న హీరోపై సింపతీ జనరేట్‌ అవ్వాలి. కానీ సుకుమార్‌ అందుకోసం ప్రయత్నించకపోగా… తన క్యారెక్టర్లలతోనే అతడిని కామెడీ చేయిస్తాడు. ఒక పేషెంట్‌ మానసిక స్థితిని అవహేళనగా మాట్లాడే డాక్టర్‌ని బయట ఎక్కడైనా, ఎప్పుడైనా చూసారా? హీరోకి ఉన్న సైకలాజికల్‌ ప్రాబ్లెమ్‌తో హీరోయిన్‌ చాలా సేపు కాలక్షేపం (కామెడీ) చేస్తుంది. ఇలాంటి చేదు గతం ఉన్న హీరోకి ఎవరిపై అయినా ప్రేమ పుట్టుకు రావాలన్నా, వారి కోసం ఏదైనా చేసేయడానికి సిద్ధమైపోవాలన్నా… అందుకు బలమైన కారణం ఉండాలి. కానీ కృతిని మహేష్‌ ఎందుకు ప్రేమిస్తాడో అర్థం కాదు. హీరోయిన్‌ అయినా తన వృత్తి, విచక్షణా మరిచి అతని పాట విని పడిపోయిందని అనుకోవచ్చు కానీ… ఇంత హాంటింగ్‌ పాస్ట్‌ ఉన్న హీరో రీజన్‌ లేకుండా ఆమెని ప్రేమించేస్తాడా? ఆమె కోసమని తనని బాల్యం నుంచీ నిత్యం వెంటాడుతున్న నిజాల్ని కూడా అబద్ధమని అనుకుంటాడా? లాజిక్‌ ఆలోచించకపోతే… ఈ ప్లే అంతటి వల్ల సినిమాకి జరిగిన ఉపయోగం ఒకటి ఉంది. ఇంటర్వెల్‌లో ఒక విలన్‌తో మహేష్‌ కాన్‌ఫ్రంటేషన్‌. అదంతా తన ఊహ అనుకుంటూ… అతడిని నిజంగా చంపేయడం. 

దర్శకుడిగా సుకుమార్‌, నటుడిగా మహేష్‌ వంద శాతం సక్సెస్‌ అయిన సీన్‌ ఇది. అంతవరకు చేసిన తప్పుల్ని, అప్పటివరకు చూపించిన నాన్సెన్స్‌ని కూడా క్షమించేయడానికి, ఫ్రెష్‌గా ఇప్పట్నుంచే సినిమా చూడ్డం స్టార్ట్‌ చేసామని సర్ది చెప్పుకోడానికి అవసరమైనంత బ్రిలియన్స్‌ ఆ సీన్‌లో ఉంది. ‘వన్‌’ గాడిలో పడ్డట్టే అనుకునేంతలోనే ‘తెలివితేటలు’ చూపించే ప్రయత్నంలో భాగంగా అవసరం లేని ట్విస్టులెన్నో కథనంలోకి విసిరారు. నాజర్‌, ప్రదీప్‌ రావత్‌ క్యారెక్టర్స్‌పై నడిపిన డ్రామా ఏదైతే ఉందో అది అబ్బురపరచలేకపోగా గందరగోళానికి గురి చేస్తుంది. ఎన్నో క్వశ్చన్స్‌ కూడా రైజ్‌ చేస్తుంది. విలన్‌ ఇస్తున్న ట్విస్టులు చాలవన్నట్టు ఆ మైండ్‌ గేమ్స్‌లోకి హీరో కూడా దిగుతాడు. ఏమంత ప్రయోజనం లేకుండానే కాసేపు ఓ డ్రామా (పోసాని క్యారెక్టర్‌పై) నడిపిస్తాడు. ఇదంతా దర్శకుడి ఇంటిల్లిజెన్స్‌ అనుకునేవాళ్లు అనుకోవచ్చు. అతి తెలివి చూపిస్తున్నాడని అనుకునేవాళ్లూ ఉండొచ్చు. బట్‌ స్ట్రెయిట్‌గా చెప్పుకోవాలంటే… తన సింపుల్‌ స్టోరీని వీలయినంత కాంప్లెక్స్‌గా మార్చి.. ఏదో కొత్తది చూపించాననే మాయ చేయడానికి దర్శకుడు చూసాడు. ‘నీ ముక్కు ఏదీ’ అని అడిగితే… సూటిగా ముక్కు చూపించే బదులు… ఒక ‘బుక్కు’ రాసాడు! ఈ క్రమంలో ప్రేక్షకుడు ఎప్పుడో లీడ్‌ క్యారెక్టర్‌తో డిస్‌కనెక్ట్‌ అయిపోతాడు. అప్పుడతను అంతిమంగా తన లక్ష్యం చేరుకున్నాడా లేదా అనేది కూడా ప్రేక్షకుడికి అక్కర్లేదు. ఎంతో హృద్యంగా అనిపించాల్సిన పతాక సన్నివేశం సినిమాని అనవసరంగా ఒక పావు గంట పొడిగించినట్టుగా అనిపించిందంటే అందుకు కారణం ఆ డిసకనెక్షనే! 

కనీసం హీరోకి తన తల్లిదండ్రులు ఎవరనే విషయం తెలియకపోవడం లాంటి వెలితి ఏదైనా మిగిలిపోయినట్టయితే ఆ పాత్రని గుర్తుంచుకుని సానుభూతి వ్యక్తం చేయడానికి అవకాశముండేది. అంటే తన తండ్రి లక్ష్యం కోసం అతనెవరో తెలుసుకోకుండా సర్వేజనా సుఖినోభవంతు అని హీరో తన అన్వేషణని అక్కడితోనే ముగించేసినట్టయితే సింపతీ దక్కడానికి ఆస్కారం ఏర్పడేది. డిస్‌కనెక్ట్‌ అయిన క్యారెక్టర్‌తో తిరిగి కనెక్ట్‌ అవడానికి, అంతో ఇంతో సింపతైజ్‌ చేయడానికి, సుకుమార్‌ భాషలో ‘ఎంటర్‌టైన్‌’ అవడానికి డోర్లు తెరుచుకుని ఉండేవి. కానీ తన కథకి ‘కమర్షియల్‌’ ముగింపు ఇవ్వడానికే దర్శకుడు సిద్ధపడ్డాడు. ఒక రైమ్‌తో హీరో తన ఇంటిని కనుగొనడం అనేది పెట్టాడు. అంతవరకు చూపిస్తున్నదానిని ఓపిగ్గా భరించిన వారు తప్ప తన లక్ష్యం దిశగా మహేష్‌ పరుగెడుతుంటే ‘హై’ ఫీలయిన వాళ్లు ఎక్కువమంది ఉండరు. ఆ క్షణంలో సంతృప్తి కలిగిన వారికంటే నిట్టూర్పులు విడిచిన వారే ఎక్కువ. ‘కానియ్‌ బాబూ కానియ్‌ త్వరగా…’ అనేంతగా తన కథని సాగదీసిన దర్శకుడిదే ఆ తప్పంతా. ఇక ఆ పతాక సన్నివేశంలో దర్శకుడి కంటే నటుడు ఎక్కువ కన్వే చేయగలిగాడు. అందుకే అతని అభినయం ఆకట్టుకుంటోంది కానీ ఆ సన్నివేశం రక్తి కట్టలేదు. ఇంటర్వెల్‌ సీన్‌లో మహష్‌తో సమానంగా స్కోర్‌ చేసిన సుకుమార్‌ ఈ సీన్‌లో కేవలం హీరోలో సగమే సక్సెస్‌ అయ్యాడు. దర్శకుడి ముద్ర పడాల్సిన చోట హీరో ఎక్కువ ఇంప్రెస్‌ చేసాడు. దాని వల్ల ఆ సీన్‌ని కళ్లు అప్రీషియేట్‌ చేస్తాయి కానీ మనసు మాత్రం కదలదు. దర్శకుడిగా సుకుమార్‌ సక్సెస్‌ అయి ఉన్నట్టయితే ఆ సన్నివేశంతోనే ఈ సినిమాకి సగం బలం చేకూరి ఉండేది. 

అసలు సుకుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఏ జోనర్‌ కిందకి వస్తుంది. సైకలాజికల్‌ థ్రిల్లరా, యాక్షన్‌ థ్రిల్లరా, ఫ్యామిలీ డ్రామానా…? అన్ని జోనర్స్‌ని మిక్స్‌ చేయడం వల్ల ఈ చిత్రం దేనికీ న్యాయం చేయలేకపోయింది. ప్రతి విషయాన్నీ కాంప్లెక్స్‌గా మలచడం, దేనినీ సింప్లిఫై చేయలేకపోవడం దర్శకుడి పరంగా మరో పొరపాటు. ‘గోల్డెన్‌ రైస్‌…’ చుట్టూ అల్లినదంతా తమ తెలివిని ప్రేక్షకుల నెత్తిన రుద్దే ప్రయత్నమే. ఇదే సినిమా తమిళంలో తీసి ఉన్నట్టయితే ఆహా ఓహో అనేసేవారు… అంటూ పలువురు కామెంట్‌ చేయడం కనిపిస్తోంది. తమిళ దర్శకుల్లో చాలా మంది కొత్తదనం కోసం పరితపిస్తారు కానీ ‘రూట్స్‌’ మర్చిపోరు. నేటివిటీకి అతీతంగా వెళ్లిపోయి, క్యారెక్టర్స్‌కి తగిన స్కెచ్‌లు లేకుండా కథలోకి దిగరు. శంకర్‌ సినిమాల్లో కొత్తదనానికి లోటుండదు. కానీ పండిత, పామరులంతా అతని సినిమాలతో ఎందుకు కనెక్ట్‌ అవుతారు? రొటీన్‌ అనే కంప్లయింట్స్‌ ఎందుకు రావు… కన్‌ఫ్యూజ్‌ చేసాడనే నిందలు ఎందుకు పడవు.. అర్థం కాలేదనే సమస్య ఎందుకు తలెత్తదు? ఒక సాధారణ కథని అసాధారణంగా తీయడానికి ప్రయత్నించినప్పుడే ఇలాంటి కన్‌ఫ్యూజన్లు ఎక్కువవుతాయి. ప్రేక్షకులకి మ్యాథ్స్‌ పజిల్‌ ఇద్దామని చూసినప్పుడే ఇటువంటి డిజాస్టర్లు ఎదురవుతాయి. తాను ఎంచుకున్న కథతో, తన కథానాయకుడితో ఆడియన్స్‌ సింపతైజ్‌ చేయలేనపుడు, దానితో ఎమోషనల్‌గా కనెక్ట్‌ కాలేనపుడు ఇక దర్శకుడు పైపైన ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని పజిల్స్‌ పెట్టినా, ఎన్ని తెలివితేటలు చూపించినా వృధా ప్రయాస. ఇదొక కొత్త ప్రయత్నమని, దీనిని ఎంకరేజ్‌ చేసి తీరాలని ‘1’ని సమర్ధిస్తున్న వాళ్లు వాదిస్తున్నారు. ఇది తెలివైన వాళ్ల కోసం తీసిన సినిమా అని, అందుకే మాస్‌ ప్రేక్షకులు దీనిని రిజెక్ట్‌ చేసారని కూడా కొందరు అంటున్నారు. ఈ సినిమా నచ్చిందని చెప్తే తెలివైనవాడు అనే సర్టిఫికెట్‌ గెల్చుకున్నట్టే అని కూడా ఫీలవుతున్నారు. ప్రపంచంలో వచ్చే అనేకానేక సినిమాలు చూస్తే ఇది నచ్చుతుందని తప్పుడు స్టేట్‌మెంట్స్‌ ఇచ్చి తమ వర్డిక్ట్‌ని జస్టిఫై చేసుకోవాలనీ చూస్తున్నారు. 

రాజమౌళి అన్నట్టు… కొత్తగా ఏదైనా చేసేటప్పుడు పర్‌ఫెక్ట్‌గా చేయాలి. సినిమాపై మీరు పెట్టే అన్నేళ్ల శ్రమ, అన్ని కోట్ల డబ్బు కంటే… దానిని చూడ్డానికి ప్రేక్షకుడు వెచ్చించే మూడు గంటల సమయం, వంద రూపాయలు ఎక్కువ విలువైనవని గుర్తించాలి. అల్టిమేట్‌గా అతనే న్యాయ నిర్ణేత. కొత్తదనం ఉన్న సినిమాలు ఆదరణకి నోచుకోలేదంటే తప్పు మనలో ఉన్నట్టే కానీ ప్రేక్షకుడిలో కాదు. ఇంత మంది రిజెక్ట్‌ చేసారంటే లోపం సినిమాలో ఉన్నట్టే తప్ప చూసే వాడిలో కాదు. రాజమౌళి డైరెక్ట్‌గా సుకుమార్‌కి గీత బోధించాడు… ‘ప్రేక్షకుడు ఎప్పుడూ తప్పు కాదు’ అని. అతని ప్రశంసలనే స్వీట్‌ కోటింగ్‌ లోపలో ‘మేలుకొలుపు మాత్ర’ కూడా పెట్టి సుకుమార్‌కి అందించాడు. సుకుమార్‌ తెలివైనవాడే కాబట్టి దానిని గ్రహించాడని, తదుపరి సినిమాల్లో బేసిక్స్‌ విడిచిపెట్టి మ్యాజిక్స్‌ని నమ్ముకోడనీ ఆశిద్దాం.

– గణేష్‌ రావూరి

[email protected]

twitter.com/ganeshravuri