ఎమ్బీయస్‌ : సూది కోసం సోది కెళితే…

దేవయానిపై రాసిన వ్యాసం చాలామందికి నచ్చినా కొందరికి నచ్చలేదు. అమెరికన్‌ చట్టాలు సవ్యంగా లేవని, ఒక రాష్ట్రంలో మత్తుమందుల అమ్మకం చట్టబద్ధమైతే, మరొక రాష్ట్రంలో చట్టవిరుద్ధమనీ, అలాటివాళ్లు దేవయాని యింతలా శిక్షించడమేమిటని వాపోయారు. ఎంత…

దేవయానిపై రాసిన వ్యాసం చాలామందికి నచ్చినా కొందరికి నచ్చలేదు. అమెరికన్‌ చట్టాలు సవ్యంగా లేవని, ఒక రాష్ట్రంలో మత్తుమందుల అమ్మకం చట్టబద్ధమైతే, మరొక రాష్ట్రంలో చట్టవిరుద్ధమనీ, అలాటివాళ్లు దేవయాని యింతలా శిక్షించడమేమిటని వాపోయారు. ఎంత వింతగా వున్నా రూల్సు రూల్సే అని, వాటిని పాటించి తీరాలని మనం ముందుగా గ్రహించాలి. చర్చి ప్రార్థనాలయమే, కానీ చెప్పులు విప్పనక్కరలేదు. మన గుడి కూడా ప్రార్థనాలయమే, చెప్పులు విప్పాలి, చొక్కా విప్పనక్కరలేదు. దక్షిణ తమిళనాడుకి వెళితే చొక్కా విప్పాలి. అట్నుంచి కేరళకు వెళితే ప్యాంటు కూడా విప్పి లుంగీ కట్టుకోవాలి. కట్టుకోకపోతే దేవుడు కరుణించడా? అని వాదించి ప్రయోజనం లేదు. ఆ గుడిలో నియమాలు అలా వున్నాయి. పాటించదలచకుంటేనే అక్కడకు వెళ్లాలి. లేకపోతే దూరం నుంచే దణ్ణం పెట్టుకుని వదిలేయాలి. మనదేశంలో కారా కిళ్లీ నమిలి రోడ్డు మీద ఉమ్మేసినా ఎవడూ పట్టుకోడు. సింగపూరులో అయితే జైల్లో పెడతారు. ఉమ్మకుండా వుండలేను అంటే సింగపూరు మొగం చూడకుండా వుంటే సరి. అమెరికా వెళ్లి అక్కడి చట్టాలు – ఎంత ఫన్నీగా వున్నా – పాటించకుండా వుండకూడదు. 

కొంతమంది దృష్టిలో – ఆవిడ రూల్సు ప్రకారం పనిమనిషికి జీతం కూడా యిచ్చుకోలేనంత మధ్యతరగతి యిల్లాలు, ఆమె భర్త అమెరికాలో ప్రొఫెసరయినా కూడా ఆవిడ పేదదే. 'వారికి తగినంత జీతం యివ్వని మన ప్రభుత్వానిదే తప్పు' అంటున్నారు వారు. మరి తక్కిన రాయబారుల విషయంలో యీ పేచీ రాలేదేం? ఈషణ్మాత్రం వివాదానికి చోటున్నా అమెరికా వాళ్లు యింకో అరడజను మందిని రంధ్రాన్వేషణ చేసి వదిలేవారు. మరి అవతలివాళ్లు జీతాలు సవ్యంగా యిస్తున్నారంటే దేవయాని కంటె డబ్బున్నవాళ్లనా? అసలు దేవయానికి వున్న ఆస్తిపాస్తులెన్ని? అని జర్నలిస్టులు ఆ దిశగా దృష్టి సారించారు. 2012లో తన స్థిరాస్తుల గురించి దేవయాని ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం ఆవిడకు భారతదేశంలో 11 ఆస్తులున్నాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో 25 ఎకరాల పొలం, రత్నగిరి జిల్లాలో 8 ఎకరాలు, రాయగఢ్‌ జిల్లాలో 2 ఎకరాలు వున్నాయి. ఇవన్నీ ఆమెకు తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించాయిట. ఇక ఫ్లాట్ల విషయానికి వస్తే – లోణావాలా హిల్‌ స్టేషన్‌ సమీపంలో 800 చ.అ.ల ఫ్లాట్‌, ఔరంగాబాద్‌ జిల్లాలో 500 చ.అ.ల ఫ్లాట్‌, ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో 200 చ.మీ.ల స్థలం, కేరళలోని ఎర్నాకులమ్‌ జిల్లాలో మూడు ప్లాట్లు (మూడిటి విస్తీర్ణం కలిపి దాదాపు 22 సెంట్లు) వున్నాయి. వాళ్ల నాన్నగారైన ఉత్తమ్‌ ఖోబర్‌గాడేగారు ఎమ్‌ఎచ్‌ఎడిఏ (మహారాష్ట్ర హౌసింగ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ)కి చైర్మన్‌గా వుండగా ఆయన 2006లో ఆలీబాగ్‌లో 5000 చ.అ.ల ప్లాట్‌ 2006లో 10 లక్షల రూ.లకు ఎలాట్‌ చేస్తే అదీ కొనుక్కుంది పాపం. 
ఇప్పుడు దాని మార్కెట్‌ విలువ కోట్లలో వుంటుంది. తన 50,350 రూ.ల నెలసరి జీతంతో యివన్నీ ఎలా కొనగలిగింది అని జర్నలిస్టులకు సందేహాలు పట్టుకున్నాయి.
ఇవన్నీ చాలనట్టు ఆవిడ ఆదర్శ్‌ కుంభకోణంలో కూడా చిక్కుకుంది. ఆ కుంభకోణాన్ని విచారించిన కమిషన్‌వారు 25 మంది అనర్హులకు ఫ్లాట్లు కేటాయించారని అనడం, వారిని తప్పిస్తామని మహారాష్ట్రప్రభుత్వం ఒప్పుకోవడం విదితమే. ఆ పాతికమందిలో దేవయాని కూడా ఒకరు. వేరే చోట ఫ్లాట్‌ లేకపోతేనే ఆదర్శ్‌లో ఫ్లాట్‌కై దరఖాస్తు వేసుకోవాలి. కానీ ఆమెకు అప్పటికే జోగేశ్వరి ప్రాంతంలోని మీరా కోఆపరేటివ్‌ సొసైటీలో ఒక ఫ్లాట్‌ వుంది. కమిషన్‌ నిలదీసినపుడు దేవయాని 'అబ్బే అది నేను 2005లో, యీ దరఖాస్తు వేసిన తర్వాత కొన్నాను' అని చెప్పింది. కానీ 2004లోనే ఆమె మీరా సొసయిటీలో సభ్యురాలైనట్లు రికార్డులో వుంది. 'ఆదర్శ్‌లో ఫ్లాట్‌ ఎలాటయితే యీ సభ్యత్వం వదులుకుంటాను' అని సొసైటీకి స్వయంగా రాసి యిచ్చింది. 2008 మేలో తనకు ఆదర్శ్‌ ఫ్లాట్‌ కేటాయించాక, 2008 సెప్టెంబరులో ఆ ఫ్లాట్‌ను సిద్దార్థ బసు అనే అతనికి రూ 1.90 కోట్లకు బదిలీ చేసినపుడు ఆ ఒప్పందంలో దేవయాని తనకు ఆ ఫ్లాట్‌ 2004 జులై 5 న దక్కినట్టు పేర్కొంది. అంటే దేవయాని అబద్ధమాడిందన్నమాట. దేవయాని పట్ల ఆదర్శ్‌ వారు ఎందుకింత ఔదార్యం చూపారు అన్నదానికి ఒక కారణం కనబడుతోంది. ఎక్కువ అంతస్తులు కట్టాలన్న వూహతో ఆదర్శ్‌ సొసైటీ తన ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ పెంచుకోవడానికై పక్కనున్న ప్లాటు కొనాలని ప్రయత్నించింది. అది బృహత్‌ ముంబయి ఎలక్ట్రిక్‌ సప్లయి అండ్‌ ట్రాన్స్‌పోర్టు వారి స్థలం. దానికి చైర్మన్‌గా దేవయాని తండ్రి ఉత్తమ్‌ వున్నారు. 'ఇస్తినమ్మ వాయినం-పుచ్చుకుంటినమ్మ వాయినం' (క్విడ్‌ ప్రో కో) పథకం కింద ఆయన ఆ ప్లాట్‌ను ఆదర్శ్‌ పరం చేశాడు. ఆదర్శ్‌ వారు ఆయన కుమార్తెకు ఫ్లాట్‌ దయచేశారు. ఈ ఫ్లాట్‌ కొనుగోలు సొమ్ము ఎంత అనేదానిలో కూడా మోసం జరిగినట్టు కమిషన్‌ గుర్తించింది. తను ఆ ఫ్లాట్‌ను రూ.90 లక్షలకు కొన్నానని దేవయాని ప్రభుత్వానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొనగా, ఆదర్శ్‌ సొసయిటీ ఖాతాల్లో ఆమె నుండి రూ. 1.10 కోట్లు ముట్టినట్లు వుంది. ఇవన్నీ ఎప్పటికి తేలతాయో ఏమో!

మన దేశంలో చాలామంది దేవయానిలు వుండవచ్చు. పనిమనిషి జీతం దగ్గర కక్కుర్తి పడిన కారణంగా దేవయాని కథ రచ్చకెక్కింది. అందుకే మనవాళ్లు సూది పోతే సోదికి వెళ్లద్దంటారు – పాత విహారాలు బయటపడతాయని ! కేసు విచారణలో యింకెన్ని బయటపడతాయోనని భయపడిన భారతప్రభుత్వం వారు ఆమె పట్ల దయతో ఓ పక్క కేసు నడుస్తూండగానే డిప్లోమాటిక్‌ యిమ్యూనిటీ యిచ్చి ఢిల్లీకి రప్పించేస్తున్నారు. ఈ ఉదంతం ధర్మమాని మన దేశం అమెరికన్‌ రాయబారుల ఆగడాల పట్ల ఎంత ఉదాసీనంగా యిప్పటిదాకా వ్యవహరించిందో తెలిసింది. వాళ్ల కార్యాలయాలలో నియమాలకు విరుద్ధంగా వైన్‌ షాపులు, సినిమా హాలు, బ్యూటీ పార్లర్‌ నడిపేస్తున్నా, వాళ్ల వాహనాలకు నెంబర్లు లేకున్నా, తాగి నడిపినా, వేగంగా నడిపినా, పార్కింగ్‌ ఫీజు కట్టకపోయినా కళ్లు మూసుకుని కూర్చోవడమే కాదు, ఆ ఆఫీసులకు నీళ్లు సరఫరా చేసే వాహనాలకు సైతం డిప్లోమాటిక్‌ యిమ్యూనిటీ యిచ్చేశారట. అవసరమా!? అదే మనం చేస్తే వూరుకుంటారా? పరాయిగడ్డపై పరాయిప్రభుత్వం కాదు, మనదేశంలో మన ప్రభుత్వమే మన పట్ల వివక్షత చూపిస్తోంది. ఇలాటి ఉల్లంఘనలు అమెరికా రాయబార కార్యాలయాలు మాత్రమే చేస్తున్నాయా, బ్రిటన్‌ వంటి దేశాలు పత్తిత్తుల్లా వున్నాయా? పనిలో పనిగా వాళ్ల సంగతీ తేల్చేస్తే మంచిది – ఇంకో దేవయాని తరహా సంఘటన జరగకముందే! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014)

[email protected]