రా..రా..రారా బంగారం.!

పవన్‌కళ్యాణ్‌.. ఆ పేరులో ఏదో వైబ్రేషన్‌ వుంది.. అందులో ఏదో మ్యాజిక్‌ వుంది. చాలా వివాదాలు.. చాలా గొడవలు.. ఎన్ని వున్నా, పవన్‌ అంటే ఓ మేనియా.. పవన్‌ అంటే ఓ మతం.. పవన్‌…

పవన్‌కళ్యాణ్‌.. ఆ పేరులో ఏదో వైబ్రేషన్‌ వుంది.. అందులో ఏదో మ్యాజిక్‌ వుంది. చాలా వివాదాలు.. చాలా గొడవలు.. ఎన్ని వున్నా, పవన్‌ అంటే ఓ మేనియా.. పవన్‌ అంటే ఓ మతం.. పవన్‌ అంటే ఇంకేదో.. అన్నంతగా పవన్‌ అభిమానులు ఊగిపోతారు. దటీజ్‌ పవనిజం. పవనిజం.. అంటే ఏంటో పవన్‌కళ్యాణ్‌ కూడా చెప్పలేడు. పవన్‌ అభిమానులు మాత్రం.. గంటల తరబడి మాట్లాడారు. పవన్‌ని అభిమానించేవారు కోకొల్లలు.. అందులోనూ పవన్‌ మేనియాలో కొట్టుమిట్టాడేవారు మరీ ప్రత్యేకం.

ఇప్పుడిదంతా ఎందుకంటే, పవన్‌కళ్యాణ్‌ని మళ్ళీ రాజకీయాల్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నయ్యకోసం రాజకీయాల్లోకొచ్చిన పవన్‌కళ్యాణ్‌, రాజకీయాల్లో ప్రభంజనమేమీ సృష్టించలేకపోయాడుగానీ.. అన్నయ్య పార్టీకి ఎన్నికలకు ముందు మైలేజీ తీసుకురావడంలో తనవంతు పాత్ర పోషించాడు.

ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా వుంటున్నా, పవన్‌ చుట్టూ రాజకీయాలకు సంబంధించిన గాసిప్స్‌ పూటకొకటి వెలుగు చూస్తూనే వున్నాయి. కారణం పవన్‌ ఇమేజ్‌. పవన్‌కి వున్న పాపులారిటీ. టీడీపీలోకి పవన్‌ వెళ్తారంటూ ఆ మధ్య జరిగిన ప్రచారం అందరికీ తెల్సిందే. ఆ తర్వాత అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలిపోయింది.

ఇప్పుడేమో కొత్తగా ఆమ్‌ ఆద్మీ పార్టీలోకి పవన్‌ వెళ్తారంటూ గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి పవన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారనేది ఆ గాసిప్స్‌ సారాంశం. పవన్‌ మాత్రం ఇప్పటిదాకా ఈ గాసిప్స్‌పై స్పందించలేదు. ఆ మాటకొస్తే వ్యక్తిగత జీవితంపైనే ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని గాసిప్స్‌ ప్రచారంలోకి వచ్చినా పవన్‌ స్పందించిన దాఖలాల్లేవు. ఇప్పుడూ స్పందిస్తాడని అనుకోలేం.

అయితే, పవన్‌ మాటల్లో సమాజానికి ఏదో చేయాలన్న తపన కన్పిస్తుంది. కానీ, దానికి తగ్గట్టుగా ఆయన కార్యాచరణ, వ్యవహార శైలి వుండదు. చేయగలిగినంత సేవ, తెరవెనుక చేయడం తప్ప, దానికి ప్రచారం కల్పించుకోవడం పవన్‌కి ఇష్టం వుండదని ఆయన సన్నిహితులంటారు. ఆయనతో సాన్నిహిత్యం పెంచుకున్నవారూ పవన్‌ గురించి గొప్పగా చెప్తారు.

మరి, రాజకీయాల్లోకి వచ్చి పవన్‌ ఎందుకు సేవ చేయకూడదు.? అంటే, ఓ సారి వచ్చి అన్నయ్యకు సమాయం చేయడంతోనే రాజకీయాలపై వెగటు అతనికి పుట్టేసిందని చెప్పొచ్చు. పైగా, ప్రజలు రమ్మంటున్నారు.. అంటూ రాజకీయాల్లోకొచ్చి, రాజకీయాల్లో ఏమీ సాధించలేక చేతులెత్తేసిన చిరంజీవిలా పవన్‌ మారిపోకూడదన్నది పవన్‌ని అమితంగా అభిమానించేవారి వాదన.

ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కాదు, ప్రజలకు ఏదో చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి రావాలి ఎవరైనా. అదే సమయంలో, రాజకీయాల్ని తట్టుకునేంత మానసిక ధృఢత్వం వుండాలి నాయకుడనేవాడికి. పవన్‌కి అవి వున్నాయా.? లేవా.? అన్నది అంచనా వేయడం కష్టం. ఎందుకంటే, ఎప్పుడూ పవన్‌ తన అంతరంగాన్ని బయటపెట్టడు. మీడియా ముందుకు విరివిగా రాడు. తన అభిప్రాయాల్ని అభిమానులతో కూడా పంచుకోడు. ‘నాకు సిగ్గెక్కువ..’ అని అంటుంటాడు పవన్‌.

మొత్తమ్మీద, పవన్‌ రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాడో రాడోగానీ, పవన్‌ పేరుతో గాసిప్స్‌ మాత్రం విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పవన్‌ రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారు ఎక్కువమందే వుండి వుండొచ్చుగాక.. కానీ, పవన్‌ నాయకుడిగా రాణించగలడా.? అసలంటూ పవన్‌కి రాజకీయాలపై ఆసక్తిగా వుందా.? ఇలాంటి విషయాల్లో మౌనం వీడగలిగితే.. పవన్‌ గురించి ఓ అంచనాకి రావొచ్చు. అప్పటిదాకా.. గాసిప్స్‌ కేవలం గాసిప్స్‌గానే మిగిలిపోతాయి.