ఇంతకంటె ఘనమైన వీడ్కోలు ఉంటుందా?

క్రికెట్‌ దేవుడు అంటూ కేవలం అభిమానులు మాత్రమే కాదు.. సహచరులు, విదేశాలకు చెందిన సహక్రీడాకారులు కూడా అభిమానంగా పిలుచుకునే సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ ఇన్నింగ్స్‌ ఇప్పుడు చివరి అధ్యాయానికి చేరుకుంది. ఇప్పటికే టీ20 మరియు…

క్రికెట్‌ దేవుడు అంటూ కేవలం అభిమానులు మాత్రమే కాదు.. సహచరులు, విదేశాలకు చెందిన సహక్రీడాకారులు కూడా అభిమానంగా పిలుచుకునే సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ ఇన్నింగ్స్‌ ఇప్పుడు చివరి అధ్యాయానికి చేరుకుంది. ఇప్పటికే టీ20 మరియు వన్డే ఫార్మాట్లనుంచి రిటైరైన సచిన్‌ టెస్టులనుంచి కూడా రిటైర్మెంట్‌ను ప్రకటించేశారు. తన సొంతగడ్డ ముంబాయిలో వాంఖెడేలో ఆయన తన క్రికెట్‌ జీవితంలో చివరిదైన 200వ టెస్టు మ్యాచ్‌ను ఆడబోతున్నారు. అయితే 199వ మ్యాచ్‌ కోల్‌కతలో ఆడిన సచిన్‌ టెండూల్కర్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం ఓ అత్యద్భుతమైన వీడ్కోలును అందించింది. 

ఎలా? అని ఆశ్చర్యపోకండి. ఈ మ్యాచ్‌లో సచిన్‌ చేసింది కేవలం పది పరుగులే కదా! అనుకోకండి. కనీసం సెకండిన్నింగ్స్‌ ఆడే అవకాశం కూడా రాలేదు కదా అనుకోకండి. నిజానికి చివరి మ్యాచ్‌ఖ అయినా.. తొలి మ్యాచ్‌ అయినా తక్కువ పరుగులు చేసినందుకు బాధపడే స్థితి నుంచి చాలా ఎదిగిపోయిన వాడు సచిన్‌. తను కేవలం ఆటను మాత్రమే ఎంజాయి చేస్తాడు. ఫలితాన్ని కాదు. అయితే ఈడెన్‌ గార్డెన్స్‌ ఇచ్చిన అత్యద్భుతమైన వీడ్కోలు ఏమిటి? అని ఇంకా సందేహంగానే ఉన్నది కదా!

ముఖ్యమంత్రి మమతా దీదీ ఇచ్చిన పెయింటింగ్‌, సుదీర్ఘకాలం తన సహచరుడుగా ఉన్న  సౌరవ్‌గంగూలీ సాంప్రదాయ బెంగాలీ తలపాగాను ధరింపజేసి ఆలింగనం చేసుకున్న మధుర క్షణాలు వీటన్నిటి కంటె మించి గొప్ప వీడ్కోలు ఆయనకు లభించింది.  అదేంటంటే.. తను జట్టునుంచి వీడ్కోలు తీసుకుంటున్న వేళ.. తను ఇన్నాళ్లు సేవలందించిన జట్టు మరింత పరిపుష్టంగా బలోపేతంగా తయారైన సంగతి నిరూపణ కావడం. తన పరోక్షంలో కూడా తన జట్టు గొప్ప ప్రతిభను కనబరచడం కంటె మించిన ఆనందం.. సుమనస్కుడైన ఏ వ్యక్తికీ ఉండదు గాక ఉండదు. 

ఎందుకంటే అభినవ సచిన్‌గా గుర్తింపు అందుకుంటున్న  రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తూ ఏకంగా 177 పరుగులుచేసి.. సచిన్‌ స్థానాన్ని తాను భర్తీ చేయగలననే ఆశలు కల్పిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసిన బౌలర్‌ షమీ.. రెండు ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసి.. జట్టు స్పిన్‌ బౌలింగ్‌ లో పూర్వవైభవానికి చేరువగా ఉన్నదని నిరూపిస్తున్నాడు. ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ కూడా.. చాలా కాలం గ్యాప్‌ తర్వాత.. కపిల్‌దేవ్‌ లాంటి మరో ఆల్‌రౌండర్‌ జట్టుకు లభించాడనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. 

క్రికెట్‌ను ఎంతో ప్రేమించే, తన దేశాన్ని ప్రేమించే తన జట్టును ప్రేమించే.. తన దేశపు జట్టు కోసం క్రికెట్‌ ఆడడాన్ని ఆద్యంతమూ ఆస్వాదించే క్రికెట్‌ దేవుడికి ఇంతకంటె ఘనమైన వీడ్కోలు ఇంకేం ఉంటుంది.