రాజ్యాంగంలో ఆర్టికల్ 3 గురించి యిన్నాళ్లూ మనం ఎప్పుడూ పట్టించుకోలేదు. రాష్ట్రవిభజన పుణ్యమాని ప్రతీవారూ దాని గురించి మాట్లాడి మనకు తెలియచెప్పినదేమిటంటే – ఆ ఆర్టికల్ ప్రకారం ఏదైనా రాష్ట్రం యొక్క సరిహద్దులు పెంచడానికి గాని, తుంచడానికి గాని, పేరు మార్చిపారేయడానికి గాని.. వేయేల, రాష్ట్రంతో ఫుట్‌బాల్ ఆడుకోవడానికి కేంద్రానికి సర్వహక్కులు వున్నాయి. ఈ ఆటలో సదరు రాష్ట్రానికి నోరెత్తడానికి కూడా వీల్లేదు. ‘అదేమిటండీ బాబూ మా రాష్ట్రాన్ని అలా విడదీసేస్తున్నారు?’ అని మొత్తుకుని అడ్డుపడడానికి కుదరదు. అంతా పైవారే నిర్ణయించేసి, మేం యిలా అనుకున్నాం అని బిల్లు అసెంబ్లీకి పంపిస్తారు. దాన్ని నువ్వు ఔనను, కాదను, అబ్బే అను, కాస్త నిదానించి చూడండి అను – వినవలసిన విధాయకం వారికి ఏమీ లేదు. ‘నిన్ను అడిగాం, నువ్వేదో చెప్పావు, అది మేము వినలేదు, వినదలచుకోలేదు, అసలు నీ అభిప్రాయం ఏదో ఫార్మాలిటీకి అడిగాం తప్ప దాన్ని పట్టించుకోం, నీది అరణ్యరోదనే అని గ్రహించి నోరు మూసుకుంటే మంచిది. కాదూ కూడదు అరుస్తానంటావా, అరుచుకో. మేం చేసేదేదో మేం చేస్తాం.’ అని ఢంకా బజాయించి చెప్పే అధికారం వారికి దఖలు పడింది.
ఓ పాత సినిమాలో రేలంగి తన కొడుక్కి భార్యగా ఓ అమ్మాయిని ముందే నిశ్చయించేసి ఆమె ఫోటో పట్టుకుని వచ్చి కొడుక్కి యిచ్చి ‘‘ఇదిగో నువ్వు చేసుకోబోయే అమ్మాయి. బాగా ఆలోచించి ఔనను.’’ అంటాడు. అంటే కొడుకు ఎంతైనా ఆలోచించవచ్చు, ఏం ఫర్వాలేదు. ఫైనల్‌గా మాత్రం తండ్రి నిర్ణయానికి సరేననాలి. ఇప్పుడు ఆర్టికల్ 3 వ్యవహారమూ అదే. అసెంబ్లీలో గంభీర ఉపన్యాసాలు యిచ్చుకోవచ్చు, బల్లలు మైకులు బద్దలు కొట్టుకోవచ్చు. ఫైనల్‌గా మాత్రం కేంద్రం పంపిన బిల్లుకు చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు, అక్కడ పని ఎలాగూ జరిగిపోతూనే వుంటుంది. అసెంబ్లీలో ప్రజాప్రతినిథులు వుండుగాక, వారి ప్రాంత ప్రజలను వారు చెప్పుకోవచ్చు గాక, కానీ ఆ బిల్లుపై ఓటింగు పెట్టరు. అంటే మెజారిటీ సభ్యులు ఏమనుకుంటున్నారో లోకానికి తెలియదు. తెలియాల్సిన అవసరం ఏముంది? అన్నీ తెలిసిన కేంద్రంవారు దేశానికి ఏది క్షేమదాయకమో నిర్ణయించడానికి అక్కడుండగా! వారికి అన్నీ తెలుసు. ఏదైనా అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు మేం విడిపోతాం మహాప్రభో అని మొరపెట్టుకుని తీర్మానం చేసి పంపినా అది విని, ఆ ప్రకారం చేయవలసిన బాధ్యత కేంద్రంపై లేదు. ఇలా చేయడానికి, చేయకపోవడానికి కేంద్రంలో మూడింట రెండువంతుల మెజారిటీ కూడా అక్కరలేదు. సింపుల్ మెజారిటీ వుంటే చాలు.
ఇంతకంటె ఘోరం ఎక్కడైనా వుందా? మన రాజ్యాంగ నిర్మాతలు యిలా ఎలా చేశారు? అంటే దానికి తెలంగాణ ఉద్యమకారులు సమాధానం చెప్తున్నారు – ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రం నుండి చిన్న ప్రాంతం విడిపోదామనుకుంటే పెద్దప్రాంతం అడ్డుపడుతుంది. చిన్నవాళ్ల చేతిలో వుండే సీట్ల సంఖ్య తక్కువ కాబట్టి వాళ్ల మాట ఎప్పటికీ చెల్లదు, వాళ్లకు రక్షణ కల్పించడానికోసం ఆంబేడ్కర్గారు దీర్ఘంగా ఆలోచించి యావదధికారాలు పట్టుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టారు – అని. ఇది నిజమే కావచ్చు. ఎందుకంటే అప్పటివరకు వున్న సినారియో ఏమిటంటే – రాష్ట్రాలలో వున్న సంస్థానాధీశుల ప్రభుత్వాలు సామంతరాజ్యాల వంటివి, కేంద్రంలో పాలన ఆంగ్లేయులది. సంస్థానాధీశులు ఒక్కొక్కరు ఒక్కో దృక్పథంతో వుండేవారు. ప్రాంతీయభావాలు, సంకుచితత్వం, పొరుగువారితో పడకపోవడం – యిలా అనేక అవలక్షణాలుండేవి. కేంద్రంలో వున్న ఆంగ్లేయులు తమకు విశాలదృక్పథం వుంది అనుకుంటూ వీరిని అదుపు చేసేవారు. మన భారతీయ జాతీయనాయకులు, పుట్టుక చేత భారతీయులైనా ఆంగ్లేయుల ఆలోచనాధోరణిలోనే తర్ఫీదు అయినవారు. వారి వద్దనే ఉద్యోగాలు చేసి, వారు నేర్పించిన చదువులే చదివి, వారితో సన్నిహితంగా మెలగి, వారిలాగే ఆలోచించేవారు. ‘దేశాన్ని ఒక యూనిట్‌గా చూడాలి, మనమంతా ఒక్కరమే అనే భావనతో వుండాలి తప్ప భాష పేర రాష్ట్రాలుగా విడిపోవడం ఏమిటి చీపుగా…’ అని భావించేవారు. స్థానిక పరిస్థితులపై అవగాహన వుండేది కాదు. తమ ఉదారవాదాన్ని ప్రజలపై రుద్దుదామని చూసేవారు.
నెహ్రూ యిలాటి భావాల్లో ప్రథముడు. మహానగరాలలో కాస్మోపోలిటన్ సంస్కృతి చెదిరిపోకుండా కాపాడాలి, వాటి కింద వున్న రాష్ట్రాలను చీల్చకూడదు అనుకుని హైదరాబాదు, మద్రాసు, బంబాయి రాష్ట్రాల విభజనను నిరసించాడు. సాధ్యమైనంత అడ్డుకున్నాడు. ఆంబేడ్కర్‌కు చాలావాటిల్లో స్వతంత్ర భావాలున్నాయి కానీ కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని, రాష్ట్రాలు సంకుచితంగా ఆలోచిస్తాయని అనుకునేవారిలో ఆయనా ఒకడు. అందుకే ఆర్టికల్ 3 అలా తయారైంది. అయితే తను తయారుచేసిన ఔషధం ఎంత చేదుగా వుందో ఆంబేడ్కర్గారికి తనదాకా వచ్చేసరికి తెలిసింది. దాంతో 1955లో ఫజల్ అలీ కమిషన్ (మొదటి ఎస్సార్సీ) వేశాక నెహ్రూ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం ‘మూడు రాష్ట్రాలుండాలి – 1. విదర్భ, మరాఠ్వాడాలతో కూడిన సంయుక్త మహారాష్ట్ర, 2. కచ్, సౌరాష్ట్రలతో కూడిన మహా గుజరాత్, 3. బంబాయి రాష్ట్రం. మూడోది కేంద్రం అజమాయిషీలో వుండాలి. ఎందుకంటే అన్ని ప్రాంతాలవారూ అక్కడికి నిర్భయంగా వస్తూ పోతూ వుండాలి అన్నాడు. ఇది ఆంబేడ్కర్‌ను మండించింది. కేంద్రం మాట శిరోధార్యం అని తను ప్రవచించినది మర్చిపోయి కేంద్రనిర్ణయానికి వ్యతిరేకంగా అనేక ప్రతిపాదనలు చేశారు. వివరాలు http://www.ambedkar.org/ambcd/05C.%20Thoughts%20on%20Linguistic%20States%20PART%20III.htm లో వున్నాయి. ఈనాడు తెలంగాణ గురించి కేంద్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని హడావుడిగా అమలు చేసేస్తోంది కదా. అప్పటి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ కూడా నెహ్రూ చేసిన ప్రతిపాదన భేషుగ్గా వుందంది. ఆంబేడ్కర్ మండిపడ్డాడు – ‘యుపి, బిహార్, ఎంపీలను విడగొట్టాలన్న ఆలోచన వర్కింగ్ కమిటీకి ఎందుకు రాలేదు’ అని ప్రశ్నించాడు.
బంబాయిని కేంద్రపాలితం చేయాలనడం ఆయనకు పట్టరాని కోపం తెప్పించింది. ‘‘బంబాయిలో మహారాష్ట్రుల సంఖ్య 50% కంటె తక్కువ కదా అంటున్నారు. కానీ అలా జరగడానికి కారణం – జీవికకోసం యితర ప్రాంతాల నుండి అన్ని జాతుల వాళ్లు వచ్చి బంబాయిలో వుండడమే. వారందరూ బంబాయిని తమ సొంత యిల్లుగా భావించరు. కేవలం మహారాష్ట్రులే అలా అనుకుంటారు. ఎవరేమన్నా సరే బంబాయి మహారాష్ట్రులదే. కలకత్తా బెంగాల్లో భాగం అయినప్పుడు, మద్రాసు మద్రాసు రాష్ట్రంలో భాగం అయినపుడు బంబాయి మహారాష్ట్రులది కాకుండా ఎలా పోతుంది? అసలు బంబాయి పేరు మార్చి ‘మహారాష్ట్ర’ ముద్ర దానిపై కొడితే యీ చిక్కులు వచ్చేవి కావు. బంబాయిని పాలించడానికి మహారాష్ట్రులు పనికిరారు (అన్‌ఫిట్) అని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయం కాబోలు. ఇది మహారాష్ట్రులు సహించకూడదు.’’ అంటూ విరుచుకుపడ్డారు.
అంతేకాదు, ఆయన చెప్పిన యితర విషయాలు చూస్తే ఆయనలో ఒక తీవ్ర మరాఠీ ప్రాంతీయవాది కనబడతాడు – ‘‘…ఉమ్మడి రాష్ట్రంలో మహారాష్ట్రులు తీవ్రంగా నష్టపోయారు. 315 మంది సభ్యులున్న అసెంబ్లీలో 149 మంది మరాఠీ ఎమ్మెల్యేలున్నారు. గుజరాతీవారు 106 మందే. కానీ మంత్రుల సంఖ్య చూడబోతే యిద్దరూ సమానమే. డిప్యూటీ మినిస్టర్ల దగ్గరకు వస్తే మాత్రం మరాఠీవాళ్లు 5గురు, గుజరాతీవాళ్లు 2, కన్నడవాళ్లు 2. ఇక్కడ సంఖ్య ఎక్కువుంది కదా అనుకోకూడదు. ఒక్కో డిప్యూటీ మినిస్టర్ కింద వున్న శాఖల సంఖ్య చూడాలి (..అంటూ ఆయన శాఖలు లెక్కపెట్టారు. వాటిలో ఏవి ముఖ్యమైనవో, ఏవి కావో వివరాలు యివ్వలేదు). సంఖ్యాబలం వుంది కాబట్టి మరాఠీవారే ముఖ్యమంత్రి కావాలి. హీరే గారు ముఖ్యమంత్రి అవుదామనుకున్నారు. కానీ ఆయనను కాంగ్రెస్ హై కమాండ్ పక్కన పడేసి, గుజరాతీ అయిన మొరార్జీ దేశాయ్‌ను ముఖ్యమంత్రి చేసింది. ఒక మరాఠీ నాయకుడికి ఎంత అవమానం! (హ్యుమిలియేషన్) మహారాష్ట్రుల రాజకీయపరిజ్ఞానానికి కాంగ్రెసు అధిష్టానం యిచ్చిన విలువ యిదా?..’’ ఇలా ఆయన కేంద్ర నిర్ణయాన్ని అడుగడుగునా దుయ్యబట్టారు.
కేంద్ర నిర్ణయాన్ని సంపూర్ణ మహారాష్ట్ర ఉద్యమకారులూ తప్పుపట్టారు. వారు మరాఠీ మాట్లాడే ప్రాంతాలన్నిటినీ కలిపి బంబాయి రాజధానిగా మహారాష్ట్ర ఏర్పడాలని ఉద్యమించారు. ఆంబేడ్కర్ వారితో ఏకీభవించలేదు. ఉమ్మడి రాష్ట్రంలోంచి గుజరాత్‌ను విడగొట్టి పంపేయాలన్నారు. తక్కిన మహారాష్ట్రను 1) సిటీ 2) పశ్చిమ 3) మధ్య 4) తూర్పు భాగాలుగా విడగొట్టాలన్నారు. పొరుగున వున్న రాష్ట్రాలలో వున్న (ఆయన దృష్టిలో) మరాఠీ ప్రాంతాలను తిరిగి తీసుకోవాలన్నారు. వాటి లిస్టు (9 వున్నాయి) ఆ వ్యాసంలో చూడవచ్చు. కర్ణాటకలోని బెళగాం మాత్రమే కాదు, ఆదిలాబాదు జిల్లాలోని రాజగిర్ తాలూకా కూడా వుంది. ఆంబేడ్కర్ ఏం రాసినా, ఏం చెప్పినా కేంద్రం మహారాష్ట్రను నాలుగు ముక్కలు చేయలేదు. అలాగని బంబాయిని యుటి చేయాలన్న కేంద్రం ఐడియా కూడా చెల్లుబాటు కాలేదు. గమనించవలసిన దేమిటంటే – కేంద్రం చేతిలో అధికారాలన్నీ పెట్టిన ఆంబేడ్కరే దానికి వ్యతిరేకంగా పోట్లాడారు.
ఈ రోజు ఆంధ్ర కాంగ్రెసు వాదులను, తెలంగాణ కాంగ్రెసువారు తప్పుపడుతున్నారు. కాంగ్రెసు హై కమాండ్ మాట ధిక్కరిస్తారా? తప్పు కదా! అంటున్నారు. ఈ నేతలు మొన్నటిదాకా అధిష్టానానికి వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రదర్శనలు చేసినవారే! ఎదిరించినవారే. ఉపయెన్నికలలో కాంగ్రెసు తరఫున ప్రచారానికి వెళ్లమంటే వెళ్లకుండా మొరాయించి, కాంగ్రెసు నాశనమై పోతుంది అంటూ శాపనార్థాలు పెట్టి, మా అభ్యర్థి ఓడిపోతాడంటూ ప్రకటనలు యిచ్చినవారే. పార్టీ అధిష్టానం చెప్పిన మాట శిరోధార్యం అని అప్పుడు వాళ్లనుకోలేదు, యిప్పుడు వీళ్లనుకోవడం లేదు. కేంద్రం ఎవర్నీ లక్ష్యపెట్టకుండా, తమ చిత్తం వచ్చినట్టు చేస్తోందని ముఖ్యమంత్రి ఉత్తరం రాసినా, సమైక్యవాదులు అభ్యంతరాలు తెలిపినా తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఆర్టికల్ 3 గురించి తెలియదా? కేంద్రానికి అధికారం వుందని తెలియదా? దాన్ని ధిక్కరించడం తప్పు. వాళ్లేం చేసినా పడి వుండాలి అని నీతులు చెప్తున్నారు. ఈ రోజు తెలంగాణ వస్తుందన్న ఉబలాటంతో వీళ్లు యిలా మాట్లాడుతున్నారు కానీ రేపు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం లేదు. కేంద్రం, రాష్ట్రం మధ్య సమీకరణాలలో సమతౌల్యం పాటించకపోతే అనర్థం వాటిల్లుతుందని వీళ్లకు బోధపడదా? తెలంగాణ సాధించుకోవడానికి కేంద్రానికి బానిసలైతే రేపు దాన్ని వాళ్లు అడ్వాంటేజిగా తీసుకోరా?
ఈసప్ నీతికథల్లో ఓ కథ వుంది. ఓ గుఱ్ఱానికి, లేడిపై కోపం వచ్చింది. తనేం చేయలేక మనిషి వద్దకు వచ్చి ‘నువ్వు లేడి భరతం పట్టు’ అని కోరింది. ‘అది చాలా వేగంగా పరిగెడుతుంది. నేను దాని పరుగు అందుకోలేను.’ అన్నాడు మనిషి. ‘నామీద ఎక్కు, నేను వేగంగా పరిగెడతాను. నువ్వు దాన్ని వేటాడు.’ అని ఆఫర్ యిచ్చింది. మనిషి సరేనని అలాగే చేసి, లేడిని వేటాడాడు. వేట తర్వాత గుఱ్ఱం థాంక్స్ చెప్పి ‘ఇక దిగు’ అంది. మనిషి ‘అబ్బే, నాకీ గుఱ్ఱం సవారీ బాగుంది. ఓసారి ఎక్కిన తర్వాత మళ్లీ దిగే అలవాటు లేదు. నువ్వు జన్మంతా నాకు ఊడిగం చేయాల్సిందే’ అన్నాడు. గుఱ్ఱం మొత్తుకుంది కానీ ఏమీ చేయలేకపోయింది. అప్పణ్నుంచి గుఱ్ఱం మనిషికి మచ్చిక అయిందిట.
ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంపై కోపంతో తెలంగాణ వారు కేంద్రాన్ని తమ నెత్తి కెక్కనిస్తే, కేంద్రం యిక కిందకు దిగదు. ఈ రోజు ఆర్టికల్ 3 ఉపయోగించి ఆంధ్రను బయటకు పంపించినట్లే, రేపు తెలంగాణ నుండి హైదరాబాదును విడగొట్టి విడిగా పడేయవచ్చు. ‘అలా ఎలా చేస్తారు? ప్రజల ఆకాంక్షో..?’ అంటారా? ఏదైనా ఉద్యమాన్ని పుట్టించడం అంత కష్టమా? వందమందితో పది రోజులు చేయించి, మీడియా చేత దాన్ని హైలైట్ చేయిస్తే చాలు. హైదరాబాదు వాసులు ఆత్మగౌరవం, స్వయంపాలన యిత్యాది విషయాలపై చాలా సెన్సిటివ్‌గా వున్నారని, యితర ప్రాంతాల ప్రజలు వచ్చి తమపై సవారీ చేస్తున్నారన్న బాధతో వున్నారనీ వ్యాసాలు రాయిస్తే చాలు. వాటి ఆధారంగా హైదరాబాదును తెలంగాణ నుండి విడగొట్టవచ్చు. అప్పుడు తెలంగాణలోని మెజారిటీ ప్రజలు – యీనాటి సీమాంధ్రుల ఏడుపు అరువుతెచ్చుకుని- మొత్తుకున్నా ఏమీ లాభం వుండదు. రాష్ట్రం పేరు కూడా మార్చివేసే అధికారం కేంద్రానికి వుంది కాబట్టి, వి హనుమంతరావు వంటి సీనియర్ నాయకులు కోరారంటూ తెలంగాణ పేరు సోనియాస్తాన్ అని మార్చేసినా ఏమీ చేయలేరు. తక్కిన పేచీలు ఎలా వున్నా కేంద్రం తన హద్దులు దాటకుండా చూడవలసిన బాధ్యత దేశంలోని అన్ని ప్రాంతాలదీ!
– ఎమ్బీయస్ ప్రసాద్