కపిలముని : జగన్‌… ఒక్క అడుగు!

ఒక్క అడుగు కీలకం.. మడమ తిప్పకుండా ముందుకెళ్లి ఆయన ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాలి! ఒక్క అడుగు కీలకం.. అదేదో ప్రజలనే అడిగి ఆయన తన పట్ల విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి!! ఒక్క అడుగు కీలకం..…

ఒక్క అడుగు కీలకం.. మడమ తిప్పకుండా ముందుకెళ్లి ఆయన ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాలి!
ఒక్క అడుగు కీలకం.. అదేదో ప్రజలనే అడిగి ఆయన తన పట్ల విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి!!
ఒక్క అడుగు కీలకం.. ప్రస్థానం చెల్లిపోయిందని ప్రపంచం గేలిచేస్తున్న వేళ.. తెలంగాణ బరిలో తన విధానంలోని నిజాయితీని చాటుకోవడానికి వేసే ప్రతి ఒక్క అడుగూ కీలకం!!!
తొలి అడుగులు ఎలా పడతాయో అదే కీలకం అని అదే ముచ్చట అని అనుకుంటాం మనం. కానీ మలి అడుగులు కీలకం అవుతున్నాయిప్పుడు. ఇంతకాలం పార్టీని నడిపిన తర్వాత.. జగన్మోహనరెడ్డి ఇప్పుడు ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. ‘తెలంగాణ కూడా నాక్కావాలి..’ అని జగన్‌ అంటుండవచ్చు గాక కానీ తెలంగాణ వారు కూడా ‘జగన్‌ మాక్కావాలి’ అనుకోవాలి. అలాంటి వారు అనల్పంగా ఉన్నారని జగన్‌ నమ్మిక. తన తండ్రి వైఎస్సార్‌ వేసిన ప్రగతి పునాదులు ప్రజలప్రేమను పటిష్టంగా నిర్మించాయని ఆయన విశ్వాసం. 
అయితే.. విజయమ్మ కారు మీదకు విసరబడిన కోడిగుడ్లు జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయగలిగేవి కాదు! అల్లరిని ఉద్యమం అనుకుని జడిసే స్థితిలో జగన్‌ ఉండకపోతే గనుక.. ఆయన తాను కూడా తన సమైక్య సిద్ధాంతాన్ని నిరూపించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో తాను స్వయంగా ఆయన పర్యటనకు పూనుకోవచ్చు. జగన్‌ తెలంగాణలో అడుగుపెట్టడానికి యాత్రకు సిద్ధమవుతున్నాడంటేనే.. జడుస్తున్న వారో.. పోరాడుతున్న వారో… ఆయనకు పదేపదే ‘మానుకోట’ను గుర్తుచేస్తుండవచ్చు! భయపెట్టగలమని ప్రయత్నిస్తుండవచ్చు. కానీ వేచిచూడాలి… ఆయన రాళ్లకు వెరచి ఆగుతారో.. ఎదురు నిలిచి పోరుతారో.. ఒడుపుగా వాటిని పట్టుకుని.. తనకంటూ ఓ దుర్గం నిర్మించుకుంటారో…!!

==============================

తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాలనే వాంఛ  ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధమైన అభివృద్ధి కలలు వారి కనుల ముందు సాక్షాత్కరిస్తాయనే విషయంలో ‘కోరుకుంటున్న ప్రజల్లో’ ఎందరికి స్పష్టమైన అవగాహన ఉన్నదనే సంగతి లెక్కవెయ్యలేం. ఏం జరుగుతుందో తెలియదు గానీ, అందరూ రాష్ట్రం వస్తే మంచి జరుగుతుందని అంటున్నారు గనుక.. ఆ మాటలు నమ్ముతూ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారు అనేకులు. ‘అందరూ’ కొందరిని విలన్లుగా చిత్రీకరిస్తూ పదేపదే ప్రచారం చేస్తున్నారు గనుక.. తాము కూడా విలన్లుగా భావిస్తున్న వారు అనేకులు. తెలంగాణకు జరిగిన అన్యాయాలు, దోపిడీలు, కబ్జాలు ఇత్యాది విషయాలలో ఎన్ని అవాస్తవాలైనా ప్రచారం అవుతుండవచ్చు గాక.. కానీ, పైన చెప్పుకున్న వీరందరిలోనూ నిజంగానే తెలంగాణ రాష్ట్రం కావాలనే కోరిక ఉన్నది. కానీ యావత్తు తెలంగాణ ప్రాంతంలో ‘వీరు’ ఎందరున్నారు? అదే ఇప్పుడు పెద్ద చిక్కుముడి. తెలంగాణలోని మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ‘వీరి’ వాటా ఎంత? మిగిలిన వాటా ఎంత? ఆ మిగిలిన వాటాలో ఎందరున్నారు? వారు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకుంటున్నారు? తమ ఆశలను తీర్చగల చుక్కానిగా ఎవరిని ఎంచుకుంటున్నారు? వేరే ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు? సమైక్యాంధ్ర ఉద్యమానికి, సమైక్యాంధ్ర భావజాలానికి బయటకు కనపడని మూలాలు అనేకం తెలంగాణలోనే ఉన్నాయనడానికి వారికి తమ అవ్యక్త ఆశలను నెరవేర్చగల రాజకీయ ఆశాదీపంగా సమైక్య శంఖారావం పూరించి.. సోనియాను హెచ్చరించిన జగన్మోహన్‌రెడ్డి కనిపిస్తున్నారని వాస్తవమూలాల్ని వివరించేందుకు గ్రేట్‌ఆంధ్ర ప్రయత్నం.. ఈ వ్యాసం.

అవ్యక్త బాధాసర్పదష్టులు అనేకులు

‘తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వచ్చి ఒదిగిపోయారు. కానీ తెలుగువాళ్లు కలవడం లేదు. అందుకే ఇప్పుడీ విభజన తగాదాలు వస్తున్నాయి’ అని ఈ మధ్య కొందరు పెద్దలు వాక్రుచ్చారు. కానీ వారు అయితే మూలాలు తెలియకుండా మాట్లాడి ఉండాలి. లేదా, ఉద్దేశపూర్వకంగా విద్వేషాలను ప్రచారంచేసేందుకు అలా మాట్లాడి ఉండాలి. తెలంగాణలో ఎన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలైన వచ్చి కలిసిపోయి ఉండవచ్చు గాక.. కానీ వారి మాటల్లో ‘తెలుగువారు’ వాస్తవానికి సీమాంధ్రకు చెందిన వ్యక్తులు ఇక్కడి జనజీవితంలో మిళితం అయినట్లుగా మరొకరు మనకు కనిపించరు. సోకాల్డ్‌ తె-వాదపు పెద్దలు  చెబుతున్న మాటల్లో ‘ఇక్కడ కలిసిపోయిన ఇతర రాష్ట్రాల వారు’ ప్రధానంగా హైదరాబాదు నగరంలో కేంద్రీకృతం అయిన వారు. అంటే వ్యాపార అవకాశాలు ఎక్కడ విస్తారంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే వారు వచ్చి స్థిరపడ్డారు.. కలిశారు. కానీ సీమాంధ్రులు అలా కాదు. వారు తాము మరో ప్రాంతానికి వెళుతున్నాం అనే భావన లేకుండానే ఇది మనదే అనే ఉద్దేశంతోనే ఇక్కడి సామాన్య జనజీవితంలో తామూ ఒక భాగంగా కలిశారు. వీరు కేవలం హైదరాబాదు నగరం మీది మోజుతో వచ్చి స్థిరపడిన వారు కాదు. ఇరుగుపొరుగు భావనలతో యావత్తు తెలంగాణ ప్రాంతంలోని అనేక కుగ్రామాలలో సైతం సేద్యం పనులు చేసుకుంటూ సొంతానికి కొంత  వ్యవసాయం ఏర్పాటు చేసుకుని స్థిరపడిన వారు. వారికి సీమాంధ్ర తెలంగాణ పేరుకు రెండు ప్రాంతాలే తప్ప వేరువేరు అనే భావన ఉండదు. ఆ మాటకొస్తే సీమాంధ్ర ప్రాంతంనుంచి వచ్చి స్థిరపడిన రైతు, వృత్తిపనివాడు లేని పల్లె మనకు యావత్తు తెలంగాణలో దుర్భిణి వేసి వెతికినా దొరకదన్నది వాస్తవం. 

ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ బాగా కలిసిపోయారంటూ చిలకపలుకులు పలికే మేధావులు గమనించాల్సిన మరో వాస్తవం కూడా ఉంది. హైదరాబాదులో వారి దామాషా ఎంత? తెలంగాణ పల్లెపట్టుల్లో స్థిరపడిన సీమాంధ్రుల దామాషా ఎంత? చూస్తే తెలిసిపోతుంది. సీమాంధ్ర ప్రాంతీయులు కేవలం ఇక్కడి వ్యాపారపరమైన ఆకర్షణకు ఎగిరి వచ్చారో.. లేదా, తెలంగాణ ప్రాంతపు జనజీవన మూలాల్లో తాము కూడా ఒక భాగంగా బతకడానికి వచ్చారో తేలిపోతుంది. 

వారికి తమ జన్మమూలాలు ఎక్కడున్నాయో తెలుసు. సదరు సీమాంధ్ర ప్రాంతంతో తమ అనుబంధం ఏమిటో తెలుసు. శ్రీకాకుళంనుంచి వలస వచ్చిన కుటుంబ వారసుడు కేసీఆర్‌కు ఆ మూలాల మీది అనుబంధం లేదని అనలేం. ఆ అనుబంధాన్ని తోసిరాజని.. సీమాంధ్రులందరినీ దోపిడీ దొంగలుగా చిత్రించేయడానికి, కేసీఆర్‌కు కనిపించినట్లుగా కనులముందు ఈ ప్రజలందరికీ అధికార పీఠాలు కనిపిస్తూ ఉండకపోవచ్చు. అందుకే వారు తమ మూలాలున్న ప్రాంతంతో బంధం తెగిపోవడం అంటే.. మనస్సు ఎక్కడో చివుక్కు మంటున్నదని బాధపడుతున్నారు. తల్లిపేగు కత్తిరించినట్లుగా ఉన్నదని వేదన చెందుతున్నారు. 

అలాంటి జనం యావత్‌ తెలంగాణలో ఏ కులం కంటె, ఏ మతం కంటె, ఏ వర్గం కంటె కూడా అధిక సంఖ్యలో ఉన్నారన్న మాట ఇవాళ కఠోరమైన వాస్తవం. పెద్దసమస్య తలెత్తినప్పుడు, ఉన్న సమస్య చిన్నదైపోయినట్లుగా.. విభజన అనే అంశం తెరమీదకు వచ్చినప్పుడు కులమతాలకు అతీతంగా వారంతా ఇప్పుడు ఒక్కటే జాతి అనుకుంటున్నారు. మరి వారి వేదన పరిమార్చే ప్రత్యామ్నాయం ఏంటి? తెలంగాణ ప్రాంతంలో స్థిరపడి బతుకుతున్నందుకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వాంఛను వ్యక్తం చేయలేని బతుకులు ఈ ప్రాంతంలో కొన్ని లక్షలున్నాయి. వారి చుక్కాని ఎవ్వరు? 

ఉద్యమవేళల్లో తమ కోరికను చెప్పలేకపోవచ్చు గానీ.. ఓటు పర్వం అంటూ వస్తే.. రహస్యబ్యాలెట్‌ రాజ్యం చేసే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సమైక్యవాదానికి దన్నుగా నిలవగలమని వారు భావిస్తున్నారు. అలాంటి వారందరికీ ప్రస్తుతానికి సమైక్య వాదాన్ని వినిపిస్తున్న ఏకైక నాయకుడిగా వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఒక్కరే కనిపిస్తుండడం గమనార్హం. ఎన్నికల పర్వం వరకు ఈ రాష్ట్రం ముక్కలైపోకుండా ఉంటే గనుక.. జగన్‌ దిశగా తామంతా కలసి కట్టుగా ఒక్క అడుగు వేయాలనే ఉద్దేశంతోనే పైన పేర్కొన్న నిర్దిష్టమైన జనవాహిని ఉన్నది. సరిగ్గా వారి ఆశ ఆలోచినస్తున్న దిశగానే.. వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రయత్నం కూడా నడుస్తున్నది.

తెలంగాణలో అస్తిత్వం అవశ్యం…

వైఎస్‌ జగన్మోహనరెడ్డి తను సమైక్యవాదాన్ని స్పష్టంగా స్వీకరించిన రోజున దాని నిర్వచనాన్ని కూడా వివరించారు. అవకాశవాద మీడియాల విశృంఖల రూపాల్లో అది మరుగున పడిపోయి ఉండొచ్చు గానీ.. ‘సమైక్యాంధ్ర అంటే కేవలం రాయలసీమ, కోస్తాంధ్ర కాదు. తెలంగాణ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే నేను రాష్ట్రం కలిసిఉండాలని కోరుతున్నాను’ అంటూ ఆయన స్పష్టీకరించారు. కానీ వైకాపా తన ధోరణిని నిర్ణయించుకున్న రోజున క్షేత్రస్థాయిలోని వాస్తవాల్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేక మంది నాయకులు కంగారు పడ్డారు. వారు పార్టీని వీడి వెళ్లిపోయారు. కానీ జగన్మోహనరెడ్డి మాత్రం ఏమాత్రం తొణకలేదు. బెణకలేదు. తాము సంకల్పించిన విధానానికే కట్టుబడ్డారు. 

తెలంగాణలో తమ పార్టీ అస్తిత్వం అవశ్యం ఉండాల్సిందేనంటూ ఆయన పట్టుపట్టారు. ఈ వ్యాసం తొలిభాగంలో చెప్పుకున్న లక్షలాది మంది జనానికి కనీసం తమలోని కోరికను ఓటు రూపంలో వ్యక్తం చేయాలనుకున్నా కూడా వారికి ఒక మార్గం లేకుండా పోతున్నదని జగన్‌ గుర్తించారు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా.. ప్రజల్ని ఓట్లుగా మాత్రమే చూస్తున్నాయి తప్ప.. వారిలోని అసలైన ఆకాంక్షలను గుర్తించి వాటికి న్యాయం చేసే దిశగా ఆలోచన చేయడంలేదనే.. వైఖరిని కూడా జగన్‌ అర్థం చేసుకున్నారు.  ఆ శూన్యాన్ని తాను భర్తీ చేయాలని అనుకున్నారు. 

‘పోగా మిగిలింది ఆస్తి’ అనే సామెత తరహాలో.. పోయినవారు పోగా మిగిలిందే పార్టీ అనే సిద్ధాంతానికి కట్టుబడ్డారు జగన్‌. ఎవరు మిగిలారో వారే ఎన్నికల్లో తలపడతారు. ప్రజల ఆశలకు దన్నుగా నిలుస్తారు అనే వాదనతో ఆయన పార్టీ నిర్మాణానికి సిద్ధ పడ్డారు. ఇవాళ మళ్లీ తెలంగాణ ప్రాంతంలో కూడా వైకాపా రాజకీయ పునాదులు నేల పొరల్లోంచి పొడుచుకు వస్తున్నాయి. అవి తె-వాదులకు కంటినలుసులా తయారవుతున్నాయి. వాటిని వారు చూడలేకపోతున్నారు. ఎలా ‘డీల్‌’ చేయాలో బోధపడని కంగారులో తప్పుడు దారులు తొక్కుతున్నారు. 

అల్లరి అభాసుపాలు కావాల్సిందే.. 

వైఎస్‌ విజయమ్మ వరద బాధిత రైతుల పరామర్శకు ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు జరిగిన అల్లరి ద్వారా ఏం సాధించామని తె-ఉద్యమకారులు సంతసిస్తూ ఉంటారో గానీ.. నిజానికి మనం తొలుత చెప్పుకున్న వర్గానికి చెందిన ప్రజల్లో ఈ అల్లరి ఐక్య భావనను హెచ్చించి ఉంటుందని అనుకోవచ్చు. నిజానికి రైతుల కన్నీటిని తుడవడానికి ఒక రాజకీయ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ రాకను వ్యతిరేకించడాన్ని వారు ఎలా సమర్థించుకుంటారు. వైకాపా తెలంగాణ రాష్ట్రం కావాలనే రాజకీయ డిమాండును వ్యతిరేకిస్తుంది తప్ప తెలంగాణ ప్రాంతాన్ని కాదు. ప్రజల్ని కాదు. తెలంగాణ ప్రజల్లో విజయమ్మ పట్ల వ్యతిరేకత ఉన్నదనడానికి వీల్లేదు. తె-నాయకులు టముకు  వేస్తున్నట్లుగా ‘మీ సమైక్యవాదుల సానుభూతి మాకు అక్కర్లేదు’ అంటోంది ఎవరు? రాజకీయ ముసుగులో పోరుతున్న వారు మాత్రమే. ప్రజల్లోనే నిజమైన భావన అదే అయితే గనుక.. విజయమ్మ యాత్ర కోడిగుడ్లు విసిరిన వారి అల్లరి వలన కాదు… జనస్పందన లేక అర్థంతరంగా వెనుతిరిగి ఉండాలి. ఆర్తిలో ఉన్న జనంలో నిజమైన వైకాపా వ్యతిరేకత ఉంటే.. విజయమ్మ తమ పల్లెకు వచ్చినప్పుడు.. ఆమె చెంతకు రావడానికి వారు విముఖత ప్రదర్శించి ఉండాలి. అలాంటిది ప్రజల్లో ఉండే భావనను చెబుతుంది. అలాకాకుండా.. మధ్యలో కార్లను అడ్డుకుని కొంత అల్లరి చేస్తే ఏం జరుగుతుంది. అంతా  ఉత్తిదే. 

ఐక్యంగా ఉండే జాతిలో సమైక్యవాదం ఆవశ్యకత మరింత స్పష్టంగా అర్థం కావడానికి ఇలాంటి అల్లరి ఉపకరిస్తుంది. 

మరింత జాగ్రత్తగా మలి అడుగులు

తెలంగాణ ప్రాంతంలో కూడా దూసుకెళ్లడానికి అక్కడి జనస్పందనను- ధిక్కార తిరస్కారాదులను బేరీజు వేయడానికి విజయమ్మ యాత్ర రూపంలో జగన్‌ చేసిన ట్రయల్‌ రన్‌ ఇది అని పలువురు విమర్శించవచ్చు గాక! దాన్ని కాదనడానికి వీల్లేదు. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆమాత్రం అప్రమత్తత ఉండదనలేం. 

సమైక్యవాదానికి కట్టుబడిన తర్వాత.. తెలంగాణ ప్రాంతంలో తొలి అడుగుల్లో విజయమ్మకు ఎదురైన స్పందనను బట్టి.. వైఎస్‌ జగన్‌ ఇప్పుడు మలి అడుగులను మరింత పటిష్టంగా ప్లాన్‌ చేసుకుంటారు. ఎవరు కాదనగలరు? మానుకోటలాగా రాళ్లు విసురుతాం అని.. పైనపల్లిలాగా కోడిగుడ్లు చెప్పులు విసురుతాం అని ఎన్నాళ్లు బెదరగొడతారు. ప్రజాస్వామిక ప్రపంచంలో ఇలాంటి చర్యలు ఎలా సాధ్యం?

మన వ్యాసంలో తొలినుంచి ప్రస్తావిస్తున్న తెలంగాణలోని ప్రత్యేక జాతికి ఇప్పుడు జగన్‌ ఒక్కడే ఆశాదీపం కనిపించడం నిస్సంశయం. ఇతర పార్టీలు రాజకీయంగా ప్రజలతో గేమ్‌ ఆడుతున్నాయని ప్రజలందరూ గుర్తించారు. వీరి ఆకాంక్ష వైపుగానే జగన్‌ నడుస్తున్నారు. అది తనకు రాజకీయంగా కూడా లబ్ధి చేకూరుస్తుందని ఆయనకు తెలుసు. సరిగ్గా అక్కడే తె-పార్టీలకు కంగారు పుడుతోంది. జగన్‌ తెలంగాణలో తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటే  గనుక యావత్‌ తెలంగాణ వాదం పేరిట తాము చేస్తున్న ప్రచారం… నిర్మించిన అభూత కల్పనలన్నీ కుప్పకూలిపోతాయని వారు భయపడుతున్నారు. అందుకే జగన్‌ పర్యటనల పట్ల దాడులు ప్లాన్‌చేస్తున్నారు.

కానీ  ఇప్పుడే కోర్టు అనుమతులు పొందిన తరువాత.. పర్యటనలకు సిద్ధం అవుతున్న జగన్‌ యావత్‌ తెలంగాణ మీద కూడా తన దృష్టి సారించడం మాత్రం తథ్యం. ఎన్నికల లోగా చీల్చేసి.. ఓట్లు సీట్ల రాజకీయ యావ ముందు మరే ప్రజాకాంక్షలూ నిలవలేని కాంగ్రెసు నిస్సిగ్గుగా నిరూపించుకుంటే తప్ప.. ఎన్నికల బరిలో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో ఎవరు చెప్పగలరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా పడే ఓటును పార్టీలు పంచుకుంటాయి గానీ.. జగన్‌కు పడే ప్రతి ఒక్క ఓటు.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నదే అవుతుంది. 
తెలంగాణ ప్రాంతంలో జగన్‌.. 2014 ఎన్నికలు పూర్తయ్యే సరికి తానొక అనధికార ప్లెబిసైట్‌ ఫలితంలాగా ఆవిర్భవిస్తారనడంలో సందేహం లేదు. 

దుర్భేద్యమైన రాతిదుర్గం తయారవుతోంది…

తెలంగాణప్రజల్లో వైఎస్‌ జగన్‌కు ఒక దుర్భేద్యమైన సానుకూలాంశం ఉంది. అది వైఎస్సార్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన పట్ల సామాన్యుల్లో ఉన్న ప్రేమ. ఇవాళ రోడ్ల మీద వైఎస్‌ విగ్రహాల్ని కాలబెట్టి ఉండవచ్చు. కానీ పూర్తిగా వైఎస్‌ ఆనవాళ్లను తుడిచేయాలనుకుంటే.. కొన్ని లక్షల మంది హృదయాలను తగలబెట్టాల్సి ఉంటుందని అల్లరి మూకలుగుర్తించాలి. ఆ వైఎస్‌ అభిమానం..  ప్రాంతీయ వైషమ్యామలకు, దురభిమానాలకు అతీతమైనది. ఇవాళ ప్రతికూల వాతావరణంలోనూ జగన్‌ను స్వాగతిస్తున్నది కూడా అదే! 

స్వానుభవాల్లోని చేదును విస్మరించి, అవకాశవాద ఆత్మవంచనతో వెర్రెత్తిపోయే నేత కాదు జగన్‌. మానుకోటలో పడిన రాళ్లు ఆయనకు గుర్తుంటాయి. ఇప్పుడు తమ పార్టీ గౌరవాధ్యక్షురాలి మీద పడిన కోడిగుడ్లు, చెప్పులు కూడా ఆయనకు గుర్తుంటాయి. 

తత్వరీత్యా జగన్‌ ఎలాంటి వారంటే.. అప్పుడు పడిన రాళ్లతో ఓ దుర్గం నిర్మించుకుంటారు. దుర్భేద్యమైన ఆ రాతి దుర్గంలో జనాభిమానాన్ని ఆయన పదిలం చేసుకుంటారు.  ఇప్పుడు పడిన చెప్పుల స్థానే పూలను కూడా కురిపించుకునే రోజుకోసం ఆయన పరిశ్రమిస్తారు. 

ఈ రాష్ట్రం చీలిపోబోతున్నదని మనం అనుకుంటున్నాం-
కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటుంది-
చీలిక ఇప్పటికే జరిగిపోయింది-
ఆ చీలిక, నిజానికి తెలంగాణలోని జనంలోనే ఉంది-
ఒక వర్గం- రాళ్లు, గుడ్లు పోగేసుకుని అల్లరిచేస్తోంది-
ఒక వర్గం- ఓటును పదిలంగా పట్టుకుని నిరీక్షిస్తోంది-
అంతిమవిజయం- నిజాయతీగల జనకాంక్షనే వరిస్తుంది!

– కపిలముని

[email protected]