టీమిండియాలో వున్న అతి కొద్దిమంది కళాత్మక ఆటగాళ్ళలో రోహిత్ శర్మ ఖచ్చితంగా వుంటాడు. అడపా దడపా బౌలింగ్ చేయగలడు, ఫీల్డింగ్ విషయంలోనూ దిట్ట. బ్యాటింగ్ దుమ్ము దులిపేస్తాడు. అయినా నిలకడలేని బ్యాటింగ్‌తో ఎప్పుడూ అతనికి జట్టులో చోటు అనుమానమే.
ఇక, ఆ అనుమానాలు అక్కర్లేదు. మొత్తంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. అలా ఇలా కాదు, ఏకంగా డబుల్ సెంచరీతో క్రికెట్ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరుగుతున్న చివరి వన్డేలో రోహిత్ డబుల్ సెంచరీ బాదేశాడు.
సెంచరీ కొడ్తాడా.? కొట్టడా.? అని అందరూ అనుకుంటున్న తరుణంలో సెంచరీ బాదిన రోహిత్ శర్మ, చివర్లో అనూహ్యంగా రెచ్చిపోయాడు. బెంగళూరులోని స్టేడియం చిన్నబోయింది. సిక్సర్ల మోత మోగింది. 209 పరుగులు చేసి, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, వన్డేల్లో అసాధ్యం అని అంతా అనుకున్న డబుల్ సెంచరీని తొలిసారి సాధిస్తే, టెండూల్కర్ శిష్యుడిగా చెప్పుకునే సెహ్వాగ్ రెండో డబుల్ సెంచరీని సాధించాడు. ముచ్చటగా మూడోదీ టీమిండియా ఆటగాడికే దక్కింది.
రోహిత్ డబుల్‌తో టీమిండియా స్కోర్ 383 పరుగులకు చేరుకుంది యాభై ఓవర్లలో. ఇక, బౌలర్లు కాస్తంత శ్రమిస్తే టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకే. బౌలర్లు చేతులెత్తేస్తే మాత్రం, ఫలితం తారుమారయ్యే ప్రమాదముంది.