ఒకే లైన్‌తో కొరటాల శివ ఐదు సినిమాలు తీసాడు. కథనం మారింది. కానీ మూలకథ ఒకటే. భారతంలో అజ్ఞాతవాసం ఘట్టంలో అద్భుత రసం కనిపిస్తుంది. వంట చేసేవాడు భీముడు, బృహన్నల ఎవరో కాదు అర్జునుడు, రాజుకి జూదంలో సహకరించేవాడు ధర్మరాజు. ఐడెంటిటీ బయట పడినప్పుడు షాక్‌కి గురి కావడం.
ఇది రెండు రకాలు. ఒకటి ఆడియన్స్‌కి వాళ్లెవరో తెలియడం. భారతంలో పాఠకుడిగా మనకు పాండవులు ఎవరో తెలుసు. అదే విధంగా ఆడియన్స్‌కి మెల్లిగా చెప్పడం. బాషా, ఇంద్ర, నరసింహనాయుడు ఇవన్నీ ఈ జానర్. సింపుల్‌గా చెప్పాలంటే అలెగ్జాండర్ డ్యూమా రాసిన కౌంట్ ఆఫ్ మాంట్‌క్రిస్టో నవల స్టైల్.
హీరో తన ఐడెంటిటీ బయట పెట్టకుండా, ఒక వూరికి వెళ్లి అక్కడి సమస్యలు పరిష్కరించడం. కొరటాల అన్ని సినిమాల్లో హీరో అక్కడ వుండడు. ఒక ప్రత్యేకమైన పనిమీద ఆ వూరు వస్తాడు. ట్రైలర్ చూస్తే ఆచార్య కూడా ఇదే జానర్. ఒకే లైన్‌తో ఐదు సినిమాలు. కథని అటుఇటు తిప్పి తీయడం కొరటాలకే సాధ్యం.
మిర్చిలో ప్రభాస్ ఎక్కడ నుంచో వచ్చి ప్రత్యర్థుల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకుంటాడు. శ్రీమంతుడులో మహేశ్‌బాబు తాను ఎవరో చెప్పకుండా ఒక పల్లెకు వచ్చి అక్కడి సమస్యలు పరిష్కరిస్తాడు. జనతా గ్యారేజీలో ఎన్టీఆర్ కూడా ఇంతే. తన ఐడెంటిటీని చెప్పకుండా కుటుంబాన్ని చేరుకుని వాళ్లతో వుంటాడు. భరత్ అనే నేను కొంచెం డిఫరెంట్. దీంట్లో కూడా హీరో బయట నుంచే వస్తాడు.
మిర్చిలో కుటుంబ సమస్య. శ్రీమంతుడులో ఊరి సమస్య. జనతాగ్యారేజీలో కుటుంబం ప్లస్ సమూహం, భరత్‌లో రాష్ట్రం, ఆచార్యలో ఊరు. హీరో వచ్చి గట్టిగా నాలుగు ఫైటింగ్‌లు చేసి, ఎమోషనల్ డైలాగ్‌లు చెప్పి, హీరోయిన్‌తో కొంచెం లవ్, నాలుగు పాటలు. సినిమా హిట్. ఒకే ఫార్ములా. సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్.
కొరటాల దగ్గరున్న వస్త్రం ఒకటే, ఒకసారి కోటు, ఇంకోసారి లాల్చీ, మరోసారి షర్ట్ కుడతాడు. చిరంజీవికి ఈ సారి నక్సలిజం యూనిఫాం కుట్టాడు.
కొలతలు మారుస్తూ ఒకే ముడి పదార్థాన్ని ఇస్తున్న శివ ఒక్కో కథని రెండుమూడేళ్లు రాసుకుంటాడు. అందుకే హిట్స్.
కథ ఏంటి కాదు, ఎలా చెప్పావన్నదే ముఖ్యం.
జీఆర్ మహర్షి