తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఏం చేసినా దానికో సెంటిమెంట్ ఉంటుంది. చివరికి సెక్రటేరియట్ విషయంలో కూడా కేసీఆర్ చాలా సెంటిమెంట్స్ పాటించారనే విషయం బహిరంగ రహస్యం. అలా జ్యోతిష్యం, న్యూమరాలజీ విషయంలో కేసీఆర్ కు పట్టింపులెక్కువ.
అయితే ఎవ్వరికీ ఎప్పుడూ ఒకే సెంటిమెంట్ ఉండదు. కేసీఆర్ కు కూడా అలానే ఈమధ్య సెంటిమెంట్ మారింది. మొన్నటివరకు ఆయన లక్కీ నంబర్ 6. కానీ ఇప్పుడు ఆయన సెంటిమెంట్స్ అన్నీ 4 అనే అంకె చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా జరిగిన పరిణామాలు, ఘటనలు చూస్తే అదే నిజం అనిపిస్తుంది.
ఎన్నికల వేళ కేసీఆర్ కొత్త సెంటిమెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన పనులన్నీ 4 అనే అంకె చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు ఆయన 4 పబ్లిక్ మీటింగ్స్ లో మాత్రమే పాల్గొంటున్నారు. ఇది కాకుండా ఆయనకు ఇప్పుడు శనివారం సెంటిమెంట్ కూడా ఉందంటున్నారు చాలామంది.
నామినేషన్ సమర్పించడానికి వెళ్లేముందు కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు కేసీఆర్. ఇది ఆయన దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఆచారం. అయితే దీనికి కొత్త సెంటిమెంట్ ఏంటంటే.. ఆయన దర్శించుకున్న రోజు శనివారం, పైగా 4వ తేదీ. అంతేకాదు.. ఆ రోజున ఆయన హెలికాప్టర్ వదిలేసి రోడ్డు మార్గంలో వెళ్లారు.
కట్ చేస్తే.. నవంబర్ 18, మళ్లీ శనివారం, జనగాంలోని ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన కేసీఆర్, మరోసారి హెలికాప్టర్ పక్కనపెట్టి, రోడ్డుమార్గాన్ని ఎంచుకున్నారు. మిగతా రోజుల్లో ఆయన ప్రతి సభకు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు. శనివారం వచ్చేసరికి మాత్రం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు.
కేసీఆర్ ఫాలో అవుతున్న ఈ కొత్త సెంటిమెంట్లు, పార్టీలో హాట్ హాట్ చర్చకు దారితీస్తున్నాయి. ఆయన మరోసారి అధికారం చేపడితే మాత్రం, 4 అంకె సెంటిమెంట్ తో పాటు, శనివారం సెంటిమెంట్ మరింత బలపడడం ఖాయం.