ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా టీ20 సీరిస్ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ బాధ్యతల్లో ఉన్నారు. వరల్డ్ కప్ వరకూ జట్టుతో గడిపిన రాహుల్ ద్రావిడ్ విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉన్నారు. ఆ స్థానంలో లక్ష్మణ్ తాత్కాలికంగా బాధ్యతల్ల ఉన్నాడు. అయితే లక్ష్మణ్ కు పూర్తి స్థాయిలో కోచ్ బాధ్యతలు దక్కవచ్చిన వార్తలు వస్తున్నాయి.
టీమిండియా కోచ్ హోదా నుంచి ద్రావిడ్ దాదాపు తప్పుకున్నట్టే అని ప్రచారం జరుగుతోంది. నేషనల్ టీమ్ తో ద్రావిడ్ ప్రయాణం పూర్తయినట్టే అని అంటున్నారు. ద్రావిడ్ స్థానంలో మరో చర్చ లేకుండా వీవీఎస్ కు బాధ్యతలు దక్కవచ్చని తెలుస్తోంది.
ద్రావిడ్ కోచ్ గా మిశ్రమానుభవాలనే పొందాడు. ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్స్ వరకూ వెళ్లి ఓటమి పాలవ్వడం ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో కొనసాగిన అనుభవాలు. టెస్టు చాంఫియన్స్ షిప్ ఫైనల్ విషయంలో అయినా, వరల్డ్ కప్ ఫైనల్ విషయంలో అయినా అదే జరిగింది. వరల్డ్ కప్ లో వరసగా పది విజయాలను సాధించినా, ఫైనల్ మ్యాచ్ ఓటమితో విజేత కాలేకపోయిన బాధ మిగిలింది. ఆటగాడిగానూ, కోచ్ గానూ ఫైనల్లో ఓటమే ద్రావిడ్ కు చేదు అనుభవంగా మిగిలింది.
ఇక జాతీయ జట్టు కోసం ద్రావిడ్ పని చేయకపోవచ్చని, వచ్చే ఐపీఎల్ సీజన్లో మెంటర్ గా ఆయనకు లక్నో జట్టుతో ఒప్పందం కూడా కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. కోచ్ కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు గట్రా చేయకుండానే వీవీఎస్ కు బీసీసీఐ బాధ్యతలు అప్పగించనుందనే ప్రచారం జరుగుతోంది!