ఒకవైపు ప్రపంచకప్ హడావుడి ముగియగా.. ఐపీఎల్ ప్రాంచైజ్ లు వచ్చే సీజన్ కోసం అంతర్గతంగా సమాయత్తం అవుతున్నాయి. ఆటగాళ్ల బలాబలాలను అవి సరి చూసుకుంటున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తమ పాత ఆటగాడు హార్దిక్ పాండ్యా మీద దృష్టి సారించినట్టుగా ప్రచారం జరుగుతోంది.
గత సీజన్లో గుజరాత్ టైటన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ ను ముంబై తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో ఉందట. అందుకోసం 15 కోట్ల వరకూ పాండ్యాకు చెల్లించడానికి ఆ యాజమాన్యం సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆటగాడి బదిలీ గురించి బీసీసీఐ ఇంకా స్పందించలేదు.
అయితే పాండ్యా కోసం 15 కోట్ల రూపాయలను చెల్లించడానికి ముంబైకి అవకాశం లేదు! ఆటగాళ్లపై జీతంపై అంత డబ్బు చెల్లించడానికి ఆ జట్టుకు అవకాశం లేదు! అయితే.. ప్రస్తుతం కాంట్రాక్ట్ లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లను వదిలించుకుని అయినా.. ముంబై ఇండియన్స్ పాండ్యాను కొననుందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ముంబై జట్టులో కామెరన్ గ్రీన్ 17.5 కోట్లు, జోఫ్రా అర్చర్ 8 కోట్ల రూపాయల ధర ఉన్న ఆటగాళ్లు. వీరిద్దరినీ వదిలించుకుంటే ముంబైకి దాదాపు 25 కోట్ల రూపాయల వెసులుబాటు లభిస్తుంది. అందులో 15 కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించి పాండ్యాతో ముంబై ఒప్పందం చేసుకునే అవకాశాలుంటాయి.
అయితే.. ఆటగాడి బదలాయింపు విషయంలో గుజరాత్ జట్టు యాజమాన్యానికి కూడా ముంబై కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మరి అంత ధర పెట్టి పాండ్యాను కొనుగోలు చేయడం సరైన నిర్ణయమేనా! అనేది ఆలోచించుకోవాల్సిన అంశమే! పాండ్యా ఎప్పుడు ఫామ్ లో ఉంటాడో, ఎప్పుడు గాయాల్లేకుండా ఫిట్ గా ఉంటాడనేది ఎవ్వరూ ఊహించలేని అంశం. సుడిగాడిలా సాగిపోతున్న పాండ్యాపై ముంబైకి ఏం లెక్కలున్నాయో బయటకు తెలియదు.
ఆ జట్టు రోహిత్ శర్మను కూడా వదిలించుకునే ఉద్దేశంతో ఉందనే ప్రచారమూ జరుగుతోంది! రోహిత్ స్థానంలో పాండ్యాకు ఫుల్ పవర్స్ ఇచ్చే ఉద్దేశంతో అతడిని ఎమ్ఐ తీసుకుంటుందనే టాక్ నడుస్తోంది!