వెండితెరపై విషప్రయోగం.. ‘రాజధాని ఫైల్స్’

సినిమా ఫార్మాట్ ను రాజకీయ ప్రయోజనాలకు, భావాల వ్యక్తీకరణకు, రాజకీయంగా నిందలు వేయడానికి, విమర్శలు చేయడానికి వాడుకోవడం అనేది ఇవాళ పుట్టిన సాంప్రదాయం కాదు. ఎన్నో దశాబ్దాల కిందనుంచి మనకు ఆ అలవాటు ఉంది.…

సినిమా ఫార్మాట్ ను రాజకీయ ప్రయోజనాలకు, భావాల వ్యక్తీకరణకు, రాజకీయంగా నిందలు వేయడానికి, విమర్శలు చేయడానికి వాడుకోవడం అనేది ఇవాళ పుట్టిన సాంప్రదాయం కాదు. ఎన్నో దశాబ్దాల కిందనుంచి మనకు ఆ అలవాటు ఉంది.

ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వ్యూహం అనే సినిమా ఒకటి రూపొందింది. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించడానికి వెండితెర మీదుగా సరికొత్త విషప్రయోగం జరుగుతోంది. దాని పేరే ‘రాజధాని ఫైల్స్’!

తెలుగువన్ ప్రొడక్షన్స్ నుంచి ఈ చిత్రం రూపొందుతున్నట్టుగా ట్రైలర్ లో ఉంది. ఈనెల 15న సినిమా విడుదల అవుతుందని అంటున్నారు. వైఎస్సార్ మరణానంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీస్తే.. దానికి పోటీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కడానికే తెలుగుదేశం పార్టీ కోసం రాజధాని ఫైల్స్ చిత్రం రూపొందించినట్లుగా అర్థమవుతోంది. అసలు ఈ సినిమా ఎలా విడుదలవుతుందో ట్రైలర్ చూసిన వారికి అర్థం కావడం లేదు.

శాసనసభలో అత్యంత అసభ్యకరమైన భాష వాడినట్టుగా ఇందులో మనకు కనిపిస్తుంది. అలాంటి మాటలు సభా గౌరవానికి భంగకరం అనే సంగతి.. సెన్సారు బోర్డు అయినా గుర్తించాల్సిందే. జీవించి ఉన్న వ్యక్తులను పోలిన పాత్రలు ఉన్నందున వ్యూహం సినిమాను సెన్సారు బోర్డు క్లియర్ చేయకుండా ముప్పతిప్పలు పెడుతోంది. మరి ఈ రాజధాని ఫైల్స్ సినిమాకు సెన్సారు సర్టిఫికెట్ వచ్చిందో లేదో తెలియదు. కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించేశారు. దీనిపై ఎలాంటి న్యాయపరమైన వివాదాలు ముసురుకుంటాయో తెలియదు.

వైసీపీని పోలీని పార్టీ జెండాతో కత్తి పార్టీ అని పేరు పెట్టి.. అయిరావతి అంటూ అమరావతిని పోలిన పేరు పెట్టి.. రకరకాల గిమ్మిక్కులకు పాల్పడ్డారు. ఇలాంటి గిమ్మిక్కుల వల్ల సెన్సార్ అడ్డంకులను తప్పించుకోలమని వారు అనుకుంటే చాలా పొరబాటు.

చంద్రబాబునాయుడు ఆలోచనలనే ఈ సినిమా ప్రతిబింబిస్తూ ఉంటే గనుక.. ఇది విడుదలైతే తెలుగుదేశాన్ని ప్రజలు మరింతగా అసహ్యించుకునే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్ సంక్షేమ పథకాలు ప్రజల, పేదల ఆర్థిక స్థిరత్వానికి వెన్నుదన్నుగా ఉంటుండగా.. ఆ పథకాలను ఈ చిత్రంలో అభివర్ణించిన తీరు, వాటిపై వేసిన నిందలు, ప్రజలను చులకన చేసిన తీరు ఎవ్వరికైనా కోపం తెప్పిస్తాయి.

ఇంతకూ సినిమా విడుదల అవుతుందో.. కాకపోయినా పర్లేదు అనుకుని.. జగన్ మీద నిందలు వేయగల సీన్లన్నీ ట్రైలర్లుగా కట్ చేసి యూట్యూబ్ లో పెట్టేసి మురిసిపోతారో తెలియదు.