సీబీఐ అంటే మన దేశంలో అత్యున్నత నేర విచారణ సంస్థ. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. వారి నేర విచారణ, నిర్ధరణ భిన్నంగా ఉంటాయని అందరూ ఒప్పుకుంటారు. కానీ.. ఏపీలో పరిస్థితుల మీద ఉడికిపోతున్న పచ్చమీడియా కళ్లకు మాత్రం సీబీఐ కూడా ఒక్కోరకంగా కనిపిస్తూ ఉంటుంది.
పచ్చమీడియాకు ఒక ముందే తేల్చుకున్న ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ప్రకారం సీబీఐ నడుచుకోవాలన్న మాట.. నేరాలను నిర్ణయించాలన్న మాట. పచ్చమీడియా మనసులో ఉన్నదే సీబీఐ తేలిస్తే పొగుడుతారు. వారి నివేదికల్ని దొరకబుచ్చుకుని ప్రచురిస్తారు. తేడా కొడితే.. సీబీఐకి విచారణే చేతకాలేదంటూ విరుచుకుపడతారు. అందుకు నెల్లూరు కోర్టులో పత్రాలు విస్సయిన వ్యవహారంపై విచారణే పెద్ద ఉదాహరణ.
మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిమీద కోర్టులో ఫోర్జరీ కేసుంది. దీనికి సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయి. ఆ కేసును విచారించిన సీబీఐ ఈ నేరంతో కాకాణి గోవర్దన్ రెడ్డికి సంబంధం లేదని తేల్చేసింది. అలా తేల్చడం తప్పు అంటూ పచ్చమీడియా కథనాలు వండి వారుస్తోంది.
అదే సమయంలో.. వివేకా హత్య కేసులో అసలు చంపించింది ఎవరో రకరకాల వివాదాలు ఉన్నప్పటికీ.. సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ అవినాష్ పాత్ర ఉన్నదని పచ్చమీడియా రాసేస్తుంటుంది. సీబీఐ కు సహకరించడం లేదని వీళ్లే తేల్చేస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళితే చాలు.. హత్య కేసు నుంచి అవినాష్ ను తప్పించమని ప్రధానిని అడిగేందుకు మాత్రమే అని పచ్చమీడియా కారుకూతలు కూస్తుంది.
మరి సీబీఐ ను ప్రభావితం చేసే అవకాశం ఉంటే అవినాస్ ను తప్పించకుండా.. కాకాణి ని తప్పించడానికి మాత్రం వైసీపీ ప్రభుత్వం ఎందుకు పూనుకుంటుంది? ఈ ప్రశ్నకు కూడా పచ్చమీడియా వద్ద సమాధానం ఉండాలి కదా. సీబీఐ దర్యాప్తు చేసిన విషయాల్లో పొంతన లేదుట. హాస్యాస్పదంగా ఉన్నాయట. వార్తల్లో వ్యాఖ్యలు జొప్పించి తాము నికార్సుగా రాస్తున్నట్టుగా పచ్చమీడియా వ్యవహరిస్తోంది.
సీబీఐ లాంటి సంస్థ తమ పద్ధతిలో తాము దర్యాప్తు చేస్తారు. ఏ సంగతి తేలితే దానినే నివేదిస్తారు. వివేకా హత్య కేసులో అయినా, కాకాణి కేసులో అయినా అంతే. కానీ.. తాము కోరినట్లుగా వారి నివేదికలు ఉండాలని భావించే క్షుద్ర పచ్చ మీడియాకు ఆ పోకడలు రుచించడం లేదు.