అల్లరి నరేష్ హీరోగా బచ్చలమల్లి అనే సినిమా తీస్తున్నారు నిర్మాత రాజేష్ దండా. ఇటీవలే భైరవ కోన సినిమాను కొన్ని నెలల క్రితం సామజవరగమన సినిమాను సక్సెస్ ఫుల్ గా అందించారు. బచ్చలమల్లి సగం వరకు పూర్తయిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. ‘బచ్చలమల్లి’ సరికొత్త కథతో డిఫరెంట్ జోనర్ సినిమా. ఈ సినిమా ఇటీవలే ఓ పెద్ద షెడ్యూలు పూర్తి చేసుకుంది. త్వరలో సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లతో రెండు సినిమాలు ప్రారంభించబోతున్నాము అని వివరించారు రాజేష్.
పంపిణీదారుని గా తన కెరీర్ ప్రారంభించానని, కానీ నిర్మాతగా ప్రయాణమే బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా వుందని అన్నారు. తాను పంపిణీదారుడిగా వున్నప్పుడే సందీప్ కిషన్, అల్లరి నరేష్ తనను నమ్మారని. వారితో మరలాసినిమాలు తీయడానికి కారణమదే అంటూ వివరించారు.
స్వామిరారా చిత్రంతో పంపిణీదారునిగా మొదలు పెట్టి దాదాపు 82 సినిమాలను విడుదల చేశా. ఒక్క క్షణం, నాంది సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశా. అనిల్ సుంకరతో ప్రయాణం సాగిస్తూ ఊరి పేరు భైరవ కోన, సామజవర గమన వంటి సినిమాలను నిర్మించా. అవి హిట్ కావడంతో మరి కొన్ని సినిమాలు ప్రారంభించా అని వెల్లడించారు. బచ్చలమల్లి 90 దశకంలో జరిగే కథ. చాలా ఆసక్తికరంగా వుంటుంది. కథ ప్రకారం సహజమైన లొకేషన్లలో తీయాలని అన్నవరం, తుని చుట్టు పక్కల విలేజ్ లలో షూటింగ్ చేస్తున్నాం. మే 10 నుంచి సాగే మరో సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తామన్నారు.
తనకు కమర్షియల్ సినిమా అంటే ఇష్టమని, అందులోనూ యాక్షన్ సినిమాలంటే మరీ ఇష్టమని అంటూ అలాంటి సినిమాలు తీయాలని వుందన్నారు. ఏ సినిమా అయినా హిట్ అయితేనే కొనుక్కున్న బయ్యర్ కు డబ్బులు వస్తాయి. అలాంటి సినిమాలే బెటర్ సినిమా అనుకుంటాడు. ఒక్కోసారి కొన్ని సినిమాలు మనకు బాగున్నా రికవరీ అవ్వలేదంటే ప్రేక్షకులకు నచ్చలేదని అర్థం. ఇక రివ్యూలు అంటారా.. వారి అభిప్రాయాలు ఎలాగైనా రాయవచ్చు. బైరవ కోనలో ఓ సాంగ్ వుంది. అది థియేటర్ వరకు తీసుకువస్తుందని భావించాం. అలాగే జరిగింది. నేడు రెగ్యులర్ సినిమాలకు పెద్దగా ఆడియన్ రావడంలేదు. కానీ భిన్నంగా వుంటే తప్పకుండా వస్తారు అంటూ వివరించారు.
ప్రస్తుతం డిజటిల్, శాటిలైట్ బిజినెస్ తగ్గిందనే చెప్పాలి. ఇది చిన్న సినిమాలకే. పెద్ద సినిమాలకు పెద్దగా వర్తించదు. లక్కీగా తమ సినిమాలకు అటువంటి ఇబ్బంది రాలేదన్నారు. తన మూడు సినిమాలు రిలీజ్ కుముందుగానే శాటిలైట్ బిజినెస్ అయిపోయాయి. రేపు రాబోయే సినిమాలు కూడా బిజినెస్ కు సిద్ధంగా వున్నాయి అని వెల్లడించారు.