బాబు మీద మండిపోతున్న ఉక్కు ఉద్యమ నేతలు!

చంద్రబాబు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పల్లెత్తు మాట అనకపోవడం పట్ల ఉక్కు ఉద్యమ సంఘాలు నేతలు మండిపోతున్నారు. ప్రతీ సభలోనూ బీజేపీతో…

చంద్రబాబు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పల్లెత్తు మాట అనకపోవడం పట్ల ఉక్కు ఉద్యమ సంఘాలు నేతలు మండిపోతున్నారు. ప్రతీ సభలోనూ బీజేపీతో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని పదే పదే వల్లించే చంద్రబాబుకు విశాఖ ఉక్కులో ప్రజా ప్రయోజనం కనిపించలేదా అని నిలదీస్తున్నారు.

రాష్ట్ర భవిష్యత్తు అంటున్న చంద్రబాబు ఉక్కుని నూరు శాతం అమ్మేయడానికి సిద్ధపడిన బీజేపీలో ఏమి భవిష్యత్తు కనిపిస్తోందని ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ళుగా ఉక్కు కార్మికులు రోడ్డున పడి పోరాడుతూంటే గట్టిగా మాట్లాడకుండా కేంద్రాన్ని నిలదీయకుండా కాలాయాపన చేసి చివరికి అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్న బాబుని జనాలు నమ్ముతారా అని ఉక్కు నేతలు ప్రశ్నిస్తున్నారు.

విశాఖ ఉక్కు ఏపీకే గర్వ కారణమని అలాంటి ఉక్కు పీక నొక్కుతూ బీజేపీ దూకుడు చేస్తూంటే ఏపీని బాగు చేయడానికే బీజేపీతో చేతులు కలిపామని బాబు చెప్పుకోవడమేంటి అని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పోలవరం రాజధాని నిర్మాణం వంటి ఏ సమస్య విషయంలో బీజేపీ నుంచి హామీని తీసుకోలేదని విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయమని ప్రధాని హోదాలో మోడీ చిలకలూరిపేట సభలో ఒక్క మాట అనలేదని ఉక్కు ఉద్యమ కారులు గుర్తు చేస్తున్నారు.

ఇవన్నీ ఏపీ భవిష్యత్తుని తీర్చిదిద్దే హామీలని వాటిని పక్కన పెట్టి ఏపీని బాగుచేయడమే మా ఆశయం అంటూ బీజేపీతో అంటకాగితే నమ్మేది ఎవరు అని నిలదీస్తున్నారు. విశాఖ ఉక్కు విషయంలో మొదటి నుంచి బాబు కప్పదాటు గానే వ్యవహరించారని అంటున్నారు.

ఇప్పటికైనా బాబు బీజేపీతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దానిని తెగనమ్మబోమని చెప్పించాలని ఉక్కు ఉధ్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి సంబంధించి విభజన హామీలు అన్నీ నెరవేరుస్తామని బీజేపీ పెద్దలు చెబితే అపుడు పొత్తు పెట్టుకున్నా జనాలు నమ్ముతారు అని అంటున్నారు. కానీ బాబు మాత్రం ఏపీ ప్రయోజనాలు అంటున్నారు తప్ప ఫలనా హామీ బీజేపీ నుంచి తీసుకున్నాను అని చెప్పలేకపోతున్నారు ఎందుకు అని ఉక్కు ఉద్యమకారులు నిలదీస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఉక్కు దెబ్బ టీడీపీకి ఈసారి గట్టిగానే పడేలా ఉంది అంటున్నారు.