తిరుపతి ఎంపీగా మంచి డమ్మీ అభ్యర్థి కావలెను!

అదేమిటి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సిటింగ్ ఎంపీ మద్దిల గురుమూర్తి పేరును ప్రకటించింది కదా. సీట్ల సంఖ్య మీద కోరిక తప్ప నాయకుల బలం లేని భారతీయ జనతా పార్టీ కూడా తిరుపతి…

అదేమిటి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సిటింగ్ ఎంపీ మద్దిల గురుమూర్తి పేరును ప్రకటించింది కదా. సీట్ల సంఖ్య మీద కోరిక తప్ప నాయకుల బలం లేని భారతీయ జనతా పార్టీ కూడా తిరుపతి స్థానాన్ని తమ వాటా కింద తీసుకుని, కేండిడేట్ కు గతిలేక, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వచ్చిన గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ కు తిరుపతిలో ఎంపీ గా అభ్యర్థిత్వం ఇచ్చేసింది కద. ఇంకా అభ్యర్థి కావాలంటున్నారు.. ఎవరికి చెప్మా అనుకుంటున్నారా? అభ్యర్థి కావాల్సింది కాంగ్రెస్ పార్టీకి!

ఆ మాట చెబితే కూడా కొందరికి సందేహం వస్తుంది. అదేమిటి.. కాంగ్రెసు పార్టీకి అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకడు, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అక్కడే ఉండగా.. మళ్లీ ఇంకో కేండిడేట్ కోసం వెతుక్కోవడం ఏమిటి? అని డౌటొస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే.. చింతా మోహన్ అంతటి గట్టి కేండిడేట్ వారికి వద్దు.. తాము పోటీచేస్తున్నట్టే ఉండాలి. కానీ.. ఆ అభ్యర్థి డమ్మీగా ఎందుకూ పనికిరానివాడిగా ఉండాలి. గెలవలేని వాడు మాత్రమే కాదు.. కనీసం ఓట్లు సాధించలేని వాడుగా ఉండాలి. అలాంటి వారికోసం కాంగ్రెస్ వెతుకుతున్నదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి చింతామోహన్ కాంగ్రెస్ పార్టీకి తిరుపతి ఎంపీగా చాలా గట్టి అభ్యర్థి. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెసు పార్టీని మాత్రమే నమ్ముకుని ఉన్న అతికొద్దిమంది నాయకుల్లో ఒకడు. అంతేకాదు, విభజన తర్వాత చాలామంది కాంగ్రెస్ సీనియర్లు పూర్తిగా సైలెంట్ అయిపోతే.. యావత్తు రాష్ట్రంలో తిరుపతి నుంచి చింతామోహన్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీ గళాన్ని వినిపిస్తూ ఉండేవారు.

పైగా ఆయనకు నియోజకవర్గం మొత్తం విస్తృతమైన పరిచయాలు, ప్రజాసంబంధాలు ఉన్నాయి. గెలుపు సంగతి ఎలా ఉన్నా గణనీయంగా ఓట్లు సంపాదించగలరు కూడా. అంతమంచి కేండిడేట్ పేరు కాంగ్రెస్ తొలిజాబితాలో రాకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. తిరుపతిలో చింతామోహన్ ను మించి మరొకరిని వారు తేగలరా? అని అంతా విస్తుపోతున్నారు.

అయితే అంత గట్టి అభ్యర్థి గనుకనే కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తున్నట్టు సమాచారం. చింతామోహన్ అభ్యర్థి అయితే.. ఆయన కేవలం ఎంపీగా ఓట్లు తెచ్చుకోవడం మాత్రమే కాదు. తనకున్న ప్రజాసంబంధాల ద్వారా నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగే అలవాటు కారణంగా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఓట్లు వేయించగలరు. పైగా గతంలో ఆయన ఎన్నడూ చంద్రబాబునాయుడును ఉపేక్షించింది లేదు.

ఇప్పుడు ఆయన అంత క్రియాశీలంగా తిరిగితే తెదేపా- జనసేనకు కూడా నష్టం జరుగుతుంది. అలా ఎమ్మెల్యే సీట్లలో వారు నష్టపోవడం పీసీసీ సారథి షర్మిలకు ఇష్టం లేదని, అందుచేతనే చింతామోహన్ పేరు మొదటి లిస్లులో రాలేదని అంటున్నారు. మరి మలి జాబితాల్లోనైనా చింతా తన పేరు చూసుకోగలరో లేదో!