2014-19 మధ్య చంద్రబాబునాయుడి పాలన మళ్లీ వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లే చూస్తే …దయనీయ స్థితిలో వివిధ రకాల పింఛన్‌దారులు కనిపిస్తున్నారు. జగన్ పాలనలో 55 నెలల పాటు ఇళ్ల వద్దకే వలంటీర్లు వెళ్లి పింఛన్ అందించారు. పాలకులు ఎవరైనా ఈ విధానమే కొనసాగుతుందని పింఛన్‌దారులు ఆశించారు. అయితే చంద్రబాబునాయుడి దుర్మార్గమైన ఆలోచన పుణ్యమా అని పింఛన్‌దారులకు తీవ్ర ఇక్కట్లు తప్పలేదు.
వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని తనకు నమ్మకస్తుడైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ద్వారా ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబునాయుడు కోరుకున్నట్టుగానే ఈసీ నిర్ణయం వెలువడింది. మూడు నెలల పాటు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకుని, రాక్షసానందం పొందారు.
అయితే పింఛన్‌దారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు ఉలిక్కి పడ్డారు. ఎన్నికల సమయంలో 66 లక్షల మంది పింఛన్‌దారులు, వారి కుటుంబ సభ్యులు కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని భయాందోళన చెందారు. దీంతో వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందించాలని ఏపీ మొదలుకుని ఢిల్లీ వరకూ లేఖలు రాశారు. ఈ లోపు కూటమికి జరగాల్సిన నష్టం జరిగింది.
ఇవాళ్టి నుంచి పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అధికారులు చెప్పినట్టుగా గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర పింఛన్ లబ్ధిదారులు వెళ్లారు. కొంత మంది నడవలేని వారిని కుటుంబ సభ్యులు ఆటోల్లో, మంచాలపై తీసుకెళుతున్న దృశ్యాలు చంద్రబాబు పాలన నాటి రోజుల్ని గుర్తు చేశాయి. అసలే వేసవి కాలం కావడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పరిస్థితి వర్ణనాతీతం. తీరా అక్కడికి వెళితే… ఉద్యోగులు చావు కబురు చల్లగా చెప్పారు.
బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకొచ్చే సరికి రెండుమూడు గంటల సమయం పడుతుందని, కావున మధ్యాహ్నం పైన తీరిక చూసుకుని రావాలని చెప్పారు. సచివాలయాలు సాయంత్రం ఏడు గంటల వరకు పని చేస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో దగ్గర్లో ఇల్లు ఉన్నవారు తిరిగి వెళ్లిపోయారు. నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన పింఛన్‌దారులు తిరిగి ఇళ్లకు వెళ్లలేక, సచివాలయాల వద్దే పడిగాపులు కాస్తున్నారు.
మళ్లీ చంద్రబాబునాయుడి పాలన నాటి దుస్థితి తమకు దాపురించిందని పింఛన్‌దారులు ఆవేదన, ఆగ్రహంతో తిట్టిపోస్తున్నారు. తమకు ఇబ్బందులు తెచ్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హెచ్చరించడం గమనార్హం.