జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయాలకు పనికి రారని తేలిపోయింది. సరిగ్గా రెండు రోజులు కూడా ప్రజల్లో తిరగలేకపోయారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్‌కల్యాణ్, ప్రచారాన్ని అక్కడి నుంచి ప్రారంభించారు. ఒకరోజుకే ఆరోగ్యం బాగా లేదని హడావుడిగా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మళ్లీ మరుసటి రోజు పిఠాపురం వెళ్లారు.
ఇలా పిఠాపురంలో పవన్ పర్యటన మమ అనిపించారు. ఇవాళ సాయంత్రం తెనాలిలో ప్రచారం చేయాల్సి వుంది. తెనాలిలో జనసేన నంబర్ టూ లీడర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఆయన కోసం పవన్ ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి కీలక ప్రకటన.
శ్రీ పవన్‌కల్యాణ్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వెల్లడించారు. దీంతో తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయభేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేసినట్టు తెలిపారు. కనీసం రెండుమూడు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించినట్టు ప్రకటనలో తెలిపారు. త్వరలో రీషెడ్యూల్ గురించి ప్రకటిస్తారని తెలిపారు. విశ్రాంతి కోసం ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు.
తీవ్ర జ్వరంతో ప్రచారం చేయాలని ఎవరూ చెప్పరు. కానీ పవన్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తాయి. జనంలోకి ఆయన ఎప్పుడు వెళ్లినా తీవ్ర జ్వరం రావడాన్ని చూస్తున్నాం. మరీ ఇంత సుకుమారంగా వుంటే, రాజకీయాల్లో ఎలా నెట్టుకొస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరీ ముఖ్యంగా కీలకమైన ఎన్నికల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని కూటమి నేతలు వాపోతున్నారు. పవన్ పర్యటన కోసం ఏర్పాట్లను చేసుకుంటున్న నేతలు, చివరి నిమిషంలో రద్దు అయ్యిందనే సమాచారంతో షాక్‌కు గురి అవుతున్నారు. తాజాగా నాదెండ్ల మనోహర్ పరిస్థితి కూడా ఇదే.