ఏపీ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. రెండున్నర నెలల క్రితం నాటి పరిస్థితులకూ, నేటికి ఎంతో తేడా. రెండున్నర నెలల క్రితం… ఏపీలో ఇక జగన్ పనై పోయిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సహా అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే పొత్తులు కుదుర్చుకోవడం మొదలైందో, అప్పుడే టీడీపీ పతనం కూడా స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు.
రెండున్నర నెలల క్రితం ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఏపీలోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్లో ఆ పార్టీ అభిమానులు కేకలేసి మరీ పిలిచారు. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితుల్ని చూసి… ఎందుకు లేబ్బా, మనోడు వచ్చేలా లేడని మౌనాన్ని ఆశ్రయించారు. కానీ ఇప్పుడు వైసీపీ అభిమానులు కేకలేస్తున్నారు. అధికారం మాదే, కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు అడుగుతున్నారు.
ఆరు నెలల క్రితం ఉభయగోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి రెండు సీట్లకు మించి రావని కోట్లాది రూపాయలు పందేలు జరిగాయి. అలాగే రాష్ట్రం మొత్తంమీద 58 సీట్లు వైసీపీకి రావని ఆరు నెలల క్రితం పందేలు కాసిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా లబోదిబోమంటున్నారు. ఎక్కడైనా ఎన్నికలు సమీపించే కొద్ది అధికార పార్టీకి ప్రజాదరణ తగ్గుతుంది. ఇదేం విచిత్రమో కానీ, ఏపీలో మాత్రం ఇందుకు రివర్స్.
ఒకప్పుడు వైసీపీకి 50 సీట్ల నుంచి మొదలై 70 సీట్ల వరకూ రావని పిలిపి పిలిచి మరీ టీడీపీ వాళ్లు పందేలు అడిగారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ పందెంరాయుళ్లు బెట్ కట్టేందుకు ధైర్యం చేయలేదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అప్పుడు సీట్లపై ఫోన్ చేసి పందేలు అడిగిన వాళ్లకు, వైసీపీ బెట్టింగ్రాయుళ్ల నుంచి ఫోన్ కాల్స్ వెళుతున్నాయి. పందేనికి సిద్ధమా? అని కేకలేసి మరీ అడుగుతున్నారు.
టీడీపీ బెట్టింగ్ రాయుళ్లు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారంపై పందేలు కాస్తామని కొందరు, వైసీపీకి 110 సీట్లు రావని మరికొందరు, అలాగే రాయలసీమలో 35 సీట్లకు మించి రావని, ఉభయగోదావరి జిల్లాలో వైసీపీకి 15 సీట్లకు మించవని …ఇలా రకరకాలుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. పందేలను చూస్తేనే అర్థమవుతుంది… రాజకీయం మారిందని.
ఒకప్పుడు ఊపు మీద ఉన్న టీడీపీ పందెంరాయుళ్లు … రోజులు గడుస్తున్న కొద్ది చల్లబడుతున్నారు. పొత్తు పెట్టుకుని మావాడు (చంద్రబాబునాయుడు) తప్పు చేశాడని, లేకపోతేనా అధికారం తమదే అని బడాయి మాటలు చెబుతున్నారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబునాయుడు నాశనమయ్యాడని, అందరి కొంపలు ముంచుతున్నాడనే మాట బలంగా వినిపిస్తోంది. మీ వాడికి (జగన్) కాలం కలిసొస్తోందని, టీడీపీ చేస్తున్న తప్పులే, వైసీపీకి ప్లస్ అవుతున్నాయనేది మెజార్టీ పందెంరాయుళ్ల అభిప్రాయం.