సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కడపలో బాబాయ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, అబ్బాయ్, కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి ఇంత వరకూ కలుసుకోలేదు. బీజేపీ తరపున జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ అధికారికంగా టికెట్లు ప్రకటించినప్పటికీ, ఎవరికి వారు తమదైన పంథాల్లో రాజకీయం నడుపుతున్నారు.
ఇరు కుటుంబాల మధ్య వ్యక్తిగత వైరం వుంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కుట్రపూరితంగా తమ కుటుంబాన్ని రాజకీయంగా అణచివేస్తున్నారనే ఆవేదన భూపేష్‌రెడ్డి తల్లిదండ్రుల్లో బలంగా వుంది. అప్పట్లో భూపేష్‌రెడ్డి తండ్రి నారాయణరెడ్డి తన తమ్ముడు ఆది కోసం రాజకీయ జీవితాన్ని బలి పెట్టారు. ఇప్పుడు తన కుమారుడు భూపేష్‌కు జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వస్తే, కనీసం కృతజ్ఞత లేకుండా ఆదినారాయణరెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నారాయణరెడ్డి, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు.
కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం అంటే… రాజకీయంగా గొంతు కోసుకోవడమే అని భూపేష్ కుటుంబ సభ్యుల వాదన. గత ఐదేళ్లుగా జమ్మలమడుగుకు దూరంగా వుండి, ఇప్పుడు ఎన్నికల సమయానికి ఎక్కడి నుంచో ఊడిపడి, టికెట్ దక్కించుకుని, తమను ముంచాడని ఆదినారాయణరెడ్డిపై నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ధ్వజమెత్తుతున్నారు.
అందుకే ఆదినారాయణరెడ్డిని కలవడానికి కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి ఇష్టపడడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పార్టీ పెద్దల సూచనల మేరకు మనుషులు కలిసినా, మనసులు మాత్రం ఎప్పటికీ దూరమే అనే చర్చ కడప జిల్లాలో సాగుతోంది.