పెన్ష‌న‌ర్ల దెబ్బ – వ‌ణుకుతున్న బాబు

చంద్ర‌బాబు మ‌న‌సులో మ‌నుషుల‌పై ప్రేమ‌కు చోటు లేద‌నే విమ‌ర్శకు బ‌లం క‌లిగించేలా ఆయ‌న తాజా లేఖ వుంది. పెన్ష‌న‌ర్ల దెబ్బ‌కు వ‌ణికిపోతున్నారాయ‌న‌. ఒక‌వైపు ప్ర‌తినెలా ఒక‌టో తేదీన పింఛ‌న్‌దారుల‌కు పింఛ‌న్ సొమ్ము అందించే వ‌లంటీర్ల‌ను…

చంద్ర‌బాబు మ‌న‌సులో మ‌నుషుల‌పై ప్రేమ‌కు చోటు లేద‌నే విమ‌ర్శకు బ‌లం క‌లిగించేలా ఆయ‌న తాజా లేఖ వుంది. పెన్ష‌న‌ర్ల దెబ్బ‌కు వ‌ణికిపోతున్నారాయ‌న‌. ఒక‌వైపు ప్ర‌తినెలా ఒక‌టో తేదీన పింఛ‌న్‌దారుల‌కు పింఛ‌న్ సొమ్ము అందించే వ‌లంటీర్ల‌ను త‌న మ‌నిషి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ద్వారా చంద్ర‌బాబే అడ్డుకున్నార‌ని లోకం కోడై కూస్తోంది. టీడీపీ నేత‌ల‌పై పింఛ‌న్‌దారులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. దీంతో ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా తీవ్రంగా దెబ్బ త‌గులుతుంద‌నే ఆందోళ‌న టీడీపీ నేత‌ల్లో వుంది.

దీంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగారు. ఇంటి వద్ద‌కే వెళ్లి పింఛ‌న్ పంపిణీ చేయాల‌ని చంద్ర‌బాబు రెండురోజుల క్రితం సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డికి లేఖ రాశారు. కానీ ఇవాళ్టి నుంచి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల వ‌ద్ద పింఛ‌న్ల పంపిణీకి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి మ‌రో లేఖ రాశారు. ఆ లేఖ‌లో పింఛ‌న్‌దారుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌నే ఆందోళ‌న మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు త‌దిత‌రుల‌కు సామాజిక పింఛ‌న్ల‌ను ఇంటి వ‌ద్ద‌కే వెళ్లి పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీకి చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు. లేఖలో మిగిలిన అంశాల‌న్నీ ఇత‌రుల‌పై బుర‌ద‌చ‌ల్ల‌డానికే స‌రిపోయింది. గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ (సెర్ప్‌) సీఈవో ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఉద్దేశ పూర్వ‌కంగానే ఇంటి వ‌ద్దకే వెళ్లి పింఛ‌న్ల పంపిణీని అడ్డుకుంటున్నార‌ని ఆరోపించారు.

‘ఇప్పటిదాకా వలంటీర్ల ద్వారా పింఛనుదారులకు వారి ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఇటీవల ఎన్నికల కమిషన్‌ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీని నిలిపివేసింది. గ్రామ/వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేయాలని సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడానికే ఈ ఆదేశాలు. ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉంది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి టీడీపీ కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు 40 డిగ్రీల సెల్సియ‌స్‌ మించి ఉన్నాయి. ఈ సమయంలో వృద్ధులు, దివ్యాంగులు, తదితరులు నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే ఇబ్బంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించండి’ అని చంద్ర‌బాబు కోరారు.

త‌న మ‌నిషి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ ఫిర్యాదు మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌లంటీర్ల‌తో పింఛ‌న్ల పంపిణీని నిలిపేసింద‌ని లేఖ‌లో పేర్కొన‌లేదు. చంద్ర‌బాబు అడ్డుకోవ‌డం వ‌ల్లే త‌మకు ఒక‌టో తేదీ పింఛ‌న్లు అంద‌లేద‌ని ల‌క్ష‌లాది మంది లబ్ధిదారులు శాప‌నార్థాలు పెడుతున్నారు. చంద్ర‌బాబుకు ప్ర‌తిదీ రివ‌ర్స్ కొడుతోంది. వ‌లంటీర్లు వైసీపీకి ప్ర‌చారం చేస్తార‌నే భ‌యంతో వారిని అడ్డుకున్నారు. కానీ అంత‌కు మించి న‌ష్టం వాటిల్లుతోంది. చంద్ర‌బాబు ఎన్ని లేఖ‌లు రాసినా, ఎంత‌గా అరిచినా… పింఛ‌న్ ల‌బ్ధిదారులు న‌మ్మే ప‌రిస్థితి వుండ‌దు.

బాబు అడ్డుకున్నాడు కాబ‌ట్టే ప‌దేప‌దే లేఖ‌లు రాస్తున్నారని జ‌నానికి అర్థ‌మైంది. నిజంగా ఆయ‌న అడ్డుకోక‌పోతే ఎందుకంత భ‌య‌ప‌డుతున్నార‌నే చిన్న లాజిక్‌ను చంద్ర‌బాబు మ‌రిచిపోతే ఎట్లా? చేసుకున్న వాళ్ల‌కు చేసుకున్నంత మ‌హాదేవ అంటే ఇదే కాబోలు. చంద్ర‌బాబు మూల్యం చెల్లించుకోవాల్సిందే.