తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి చేసిన ఫిర్యాదు వేలాది మంది టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైసీపీ తిరుపతి అభ్యర్థి అభినయ్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక, వాళ్లిద్దరిపై వ్యక్తిగత ద్వేషంతో తమ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందనే భయాందోళన టీటీడీ ఉద్యోగుల్లో నెలకుంది.
తాజాగా టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డిని తొలగించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు ఆరణి శ్రీనివాసులు, భానుప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఎందుకయ్యా అంటే… టీటీడీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు, అలాగే టీటీడీ రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల 30 ఏళ్ల కలైన ఇంటి స్థలాలను ఇవ్వడమే చైర్మన్‌గా ఆయన చేసిన నేరం.
తిరుపతి సిటింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి కుమారుడు అభినయ్ ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో నిలిచారు. తిరుపతిలో కేవలం రెండేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, అలాగే 8 ఫ్రీలెప్ట్ రోడ్లు, 10 స్లిప్‌వేస్, ఇతర రోడ్లు, నగరంలోని ప్రధాన కూడళ్లలో అకర్షణీయమైన, స్ఫూర్తిదాయక మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో డిప్యూటీ మేయర్‌గా భూమన అభినయ్ బలమైన ముద్ర వేయగలిగారు. ఇవే ఆయన గెలుపునకు బాటలుగా మారాయి.
దీంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీటికి తోడు టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి ఉద్యోగులకు భారీ లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతలా అంటే… జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఇచ్చిన ఫిర్యాదులో లక్ష మందికి ప్రయోనం కలిగించేంతగా.
టీటీడీలో పని చేస్తున్న, ఉద్యోగ విరమణ చేసిన 9 వేల మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇప్పించారు. ఇంటి స్థలాల కోసం టీటీడీ ఉద్యోగులు 30 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. అలాగే టీటీడీ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్టు, సొసైటీల ద్వారా టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ లబ్ధి కలిగించారు. మొదటి విడతలో పారిశుధ్య, పోటు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్పకళాశాలతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరు వేల మంది కాంట్రాక్టు, సొసైటీ, సంభావన ఉద్యోగులకు జీతాలు పెంచారు.
మిగిలిన 9 వేల 750 మందికి కూడా వారి కేడర్, సీనియారిటీని బట్టి 3 వేల నుండి 20 వేల వరకు రెండో విడతలో జీతాలు పెంచారు. దీంతో టీటీడీలో కాంట్రాక్టు, సొసైటీల ద్వారా పని చేస్తున్న ప్రతి ఉద్యోగికి భూమన నేతృత్వంలో జీతం పెరిగినట్లు అయ్యింది. జీతాల పెంపు కోసం సుమారు 15 సంవత్సరాలుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి జీవితాల్లో జీతాల పెంపుతో వెలుగులు నింపినట్టైంది.
వీటితో టీటీడీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తిరుమల ఎంప్లాయీస్ క్యాంటీన్‌లో టిఫెన్, భోజనం అందించడానికి భూమన కరుణాకర రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు వీరికి రాయితీ ధరలతో టిఫిన్, భోజనం, టీ, కాఫీ అందిస్తారు. ఈ నిర్ణయం వల్ల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
ఇవన్నీ వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్‌కి ఎన్నికల్లో కలిసొస్తాయనే భయం జనసేన, బీజేపీ నేతల్లో వుంది. 2014 నుంచి ఇదే కూటమి అధికారంలో వుండింది. అప్పుడు టీటీడీ ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. అలాగే ఉద్యోగుల ఇళ్ల స్థలాల కలల్ని సాకారం చేయాలన్న తలంపే లేకపోయింది.
ఇప్పుడు భూమన కరుణాకరరెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తే, టీటీడీ ఉద్యోగుల్ని తీవ్ర ప్రభావితం చేస్తారని, దీంతో లక్ష ఓట్లను కొల్లగొడతారని ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికే ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు ఫిర్యాదుతో వచ్చిన సమస్య ఏంటంటే… ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు ఏమవుతాయో అనే భయం ఉద్యోగుల్లో వుంది. తమ ఫిర్యాదుతో ఇళ్ల స్థలాలను ఎన్నికల సంఘం రద్దు చేస్తుందని జనసేన, బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అలాగే తిరుపతి, నగరం చుట్టు పక్కల నియోజకవర్గాల్లో రూ.1500 కోట్ల టీటీడీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ ఆగిపోతాయని వారు ప్రచారం చేస్తున్నారు. తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోతాయనే ఆందోళన నగర వాసుల్లో నెలకుంది.
అలాగే జీతాల పెంపునకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేస్తుందని తిరుపతి బీజేపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో 15 ఏళ్ల తర్వాత జీతాలు పెరిగాయనే ఆనందంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయంగా వైసీపీ నేతలతో తేల్చుకోవాలే తప్ప, తమ కడుపు కొట్టాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఏంటని టీటీడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2007, 2008లలో టీటీడీ చైర్మన్‌గా కరుణాకరరెడ్డి ఉద్యోగుల జీతాలు పెంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే టీటీడీ చైర్మన్ హోదాలో పుట్టా సుధాకర్ యాదవ్ వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేశారని మరికొందరు గుర్తు చేస్తున్నారు.