కాంగ్రెస్ జట్టులోకి జగన్.. పీకేకు సాధ్యమేనా?

ఎన్నికల వ్యూహకర్తలు ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు చేస్తేనే వారికి విలువ ఉంటుంది. ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చిన దేశంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించే పనిలో ఉన్నారు.…

ఎన్నికల వ్యూహకర్తలు ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు చేస్తేనే వారికి విలువ ఉంటుంది. ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చిన దేశంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించే పనిలో ఉన్నారు. ఆయన స్వయంగా కాంగ్రెస్లో చేరదలచుకుంటున్నారు గనుక.. మరింత శ్రద్ధగా వారికోసం వ్యూహాలు చేస్తారని ఊహించవచ్చు. అయితే ఆయన రాష్ట్రాల్లో పార్టీలతో పొత్తులు పెట్టుకునే దిశగా సోనియాకు చేసిన సూచనలే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. 

ఈ వ్యూహంలో భాగంగా.. మిగిలిన రాష్ట్రాల్లో ఆయన ప్రతిపాదించిన పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని పీకే సోనియాకు సూచించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన సోనియాకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో ఆయన చూపించారని ప్రచారం జరుగుతున్న స్లయిడ్స్ ఆధారంగా చర్చ జరుగుతోంది. 

జగన్ అధికారంలోకి రావడం వెనుక కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహరచన నైపుణ్యం పుష్కలంగానే ఉంది. ప్రశాంత్ కిశోర్ మాట జగన్ వద్ద బాగానే చెల్లుబాటు అవుతుందనే ప్రచారం కూడా ఉంది. ఇదంతా నిజమే అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని పీకే సూచిస్తే/ సలహా ఇస్తే జగన్ దానిని ఆచరిస్తారా? ప్రాక్టికల్ గా అది సాద్యమేనా అనేది చాలా మందికి కలుగుతున్న సందేహం. 

పొత్తుల గురించి పీకే చేసిన సూచనల్లో భాగంగా.. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, తమిళనాడులో డీఎంకేతో, జార్ఖండ్ లో జెఎంఎంతో పొత్తులు పెట్టుకోమని అన్నారు. ఏపీలో జగన్ తో పొత్తు పెట్టుకోవాలనేది ఆయన సలహా. ఏపీలో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్న జగన్ తో పొత్తు అనేది సోనియాకు, కాంగ్రెస్ కు తియ్యగానే ధ్వనించవచ్చు. కానీ.. ఆ ప్రతిపాదనకు జగన్ అంగీకరిస్తారా? అంగీకరించాల్సిన అవసరం  ఆయనకు ఏమున్నది? అనేది ఇక్కడ జవాబు దొరకని ప్రశ్న.

జగన్ మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజెపీతో సత్సంబంధాలే ఉన్నాయి. రాష్ట్రంలో ఆయన హవాకు ప్రస్తుతం తిరుగులేదు. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకోగలిగే సత్తా కూడా లేదు. ఇలాంటి పార్టీతో పొత్తును ఆయన ఎందుకు కోరుకుంటారు. 

పైగా, సింహం సింగిల్ గానే వస్తుందని అన్నట్టుగా, తాను ఒంటరిగా మాత్రమే ఎన్నికల బరిలో ఉంటాను అనే సంకేతాల్ని జగన్ చాలా సందర్భాల్లో ఇచ్చారు. అలాంటిది.. కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఉండడానికి ఆయన ఇష్టపడతారా? అనేది కూడా పెద్ద చర్చే. 

జగన్ భుజాల మీద కాంగ్రెస్ పార్టీ పల్లకిని పెట్టి.. ఆయనతో మోయించి.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనేది ప్రశాంత్ కిశోర్ కల కావొచ్చు. కానీ.. అందుకు జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉంటారా? తన తండ్రి రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత.. తాను ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర నాయకులందరూ కోరుకున్నప్పుడు.. సోనియా గాంధీ వ్యవహరించినా అవమాన కరమైన తీరు ఆయన మర్చిపోతారా? అనేది వేచిచూడాలి. 

ఒకవేళ పీకే వ్యూహరచన ఫలిస్తే.. కాంగ్రెస్ జట్టులోకి జగన్ చేరితే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సిద్ధాంతం నిజమే అనుకోవాలి.