సుదీర్ఘ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు తెర‌, మ‌రి కొన్ని గంట‌ల్లో!

మార్చి 16వ తేదీన 2024 లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయ్యింది! అలా ఎన్నిక‌ల వేడి రాజుకుంది! ఆ వేడి ఎంత వాడీవేడీగా కొన‌సాగినా.. ఇది సుదీర్ఘ ఎన్నిక‌ల ప్ర‌క్రియ అని…

మార్చి 16వ తేదీన 2024 లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయ్యింది! అలా ఎన్నిక‌ల వేడి రాజుకుంది! ఆ వేడి ఎంత వాడీవేడీగా కొన‌సాగినా.. ఇది సుదీర్ఘ ఎన్నిక‌ల ప్ర‌క్రియ అని చెప్పాలి! రాజ‌కీయం అంటే అప‌రిమిత‌మైన ఆస‌క్తి ఉన్న వారిని ప‌క్క‌న పెడితే, మిగ‌తా వారి అటెన్ష‌న్ మాత్రం కొంత వ‌ర‌కూ ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై త‌గ్గిపోయింది! దీనికి ప్ర‌ధాన కార‌ణం.. దేశంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌ల‌య్యాకా ఓటేయ‌డానికి తెలుగు వాళ్లు నెల రోజుల పాటు వేచి చూశారు, ఓటేసిన త‌ర్వాత ఫ‌లితాల కోసం ఇంకో ఇర‌వై రోజుల‌కు పైగా వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది! క‌నీసం ఏపీలో అయితే అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రిగాయి కాబ‌ట్టి.. ఇంకా ఉత్కంఠ‌త కొన‌సాగుతూ ఉంది! 

కేవ‌లం లోక్ స‌భ ఎన్నిక‌లు మాత్ర‌మే జ‌రిగిన రాష్ట్రాల్లో.. ఈ సుదీర్ఘ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఫ‌లితాల‌పై తీవ్ర‌మైన ఉత్కంఠ‌ను అయితే త‌గ్గించి వేసింది! ఫ‌లితాల గురించి మ‌రీ జ‌నాలు ఎదురుచూసే ప‌రిస్థితి లేకుండా పోయింది. కేంద్రంలో మ‌ళ్లీ మోడీనేనా, ఏదైనా మార్పు ఉంటుందా.. అనే ఆస‌క్తి ఉన్నా, తొలి విడత పోలింగ్ లో ఓటేసిన వారు ఎన్నిక‌ల ప్ర‌క్రియ మీద ఏ మేర‌కు ఆస‌క్తితో ఉంటారో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళ‌నాడు తొలి విడ‌త పోలింగ్ లోనే లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ ను పూర్తి చేసుకుంది. అలాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు జ‌నాలు ఎన్నిక‌ల ప్ర‌క్రియ గురించి కూడా మ‌రిచిపోయి ఉండ‌వ‌చ్చు!  దాదాపు రెండున్న‌ర నెల పాటు ఎన్నిక‌ల పోలింగే కొన‌సాగింది! 

గ‌త ప‌ర్యాయం క‌న్నా ఈ సారి మ‌రింత ఎక్కువ స‌మ‌యం పాటు సాగడం ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించిన మ‌రో విశేషం. గ‌త ప‌ర్యాయం మార్చి నెల రెండో వారంలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డం, ఏప్రిల్ రెండో వారంలో పోలింగ్ జ‌ర‌గ‌డం, మే నెల రెండో వారంలో ఫ‌లితాలు రావ‌డం జ‌రిగింది. అప్పుడు రెండు నెల‌ల్లో మొత్తం త‌తంగం పూర్త‌య్యింది. ఈ సారి అటు ఇటుగా రెండు వారాల పాటు అద‌నంగా సాగింది ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌! దీని వ‌ల్ల కొంత అనాస‌క్తి నెల‌కొన్న ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది.

ఏదైమ‌నా.. ఇక ఫ‌లితాల వెల్ల‌డికి మ‌రి కొన్ని గంట‌ల స‌మ‌య‌మే మిగిలి ఉంది. జూన్ నాలుగున  లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌, ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కాబోతూ ఉన్నాయి. దేశానికి రాజ‌కీయంగా మ‌రో ఐదేళ్ల పాటు ప్ర‌జ‌లు ఎలాంటి దిక్సూచిని చూపిస్తున్నారో తేలిపోనుంది.  ఇక ఫ‌లితాల విష‌యంలో ఎవ‌రి కాన్ఫిడెన్స్ వారిదిగా క‌నిపిస్తూ ఉంది. అటు కేంద్రం విష‌యంలో అయినా, ఏపీ విష‌యంలో అయినా ఎవ‌రికి వారు త‌మ‌దే విజ‌యం అనే ధీమాను వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

బీజేపీ వాళ్లేమో త‌మకు 400 అని వాదిస్తూ ఉన్నారు! కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావంటూ అమిత్ షా ఆఖ‌రి ఫేస్ ప్ర‌చారంలో కూడా వ్యాక్యానించారు! త‌మ‌కు భారీ విజ‌యం ద‌క్క‌బోతోందంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ వాళ్లు బీజేపీకి అంత సీన్ లేద‌ని అంటున్నారు. మ‌రీ బీజేపీ త‌ర‌హాలో వారు మాట్లాడ‌టం లేదు కానీ, బీజేపీకి ఈ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 200 ఎంపీ సీట్ల‌కు కౌంట్ మించ‌దు అని కాంగ్రెస్ కూట‌మిలోని నేత‌లు వ్యాక్యానిస్తూ ఉన్నారు. ఇలా త‌మ ప్ర‌త్య‌ర్థులు మ‌రీ చిత్త‌యిపోక‌పోవ‌చ్చ‌ని.. వారికి సొంతంగా మెజారిటీ వ‌చ్చే పరిస్థితి అయితే లేదంటూ కాంగ్రెస్ కూట‌మి వాళ్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!   

ఇక ఏపీ విష‌యంలో కూడా ఇరు ప‌క్షాల నుంచి విశ్వాసం వ్య‌క్తం అవుతూ ఉంది. త‌మ‌కు వ‌ర‌స‌గా రెండోసారి అధికారం ద‌క్క‌డం ఖాయ‌మ‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్య‌క్తం చేస్తూ ఉంది. ఆ పార్టీ వాళ్లు త‌మ కౌంట్ ను వంద అసెంబ్లీ సీట్ల‌కు మించి మొద‌లుపెడుతూ ఉన్నారు. 151 సీట్ల‌కు మించి సాధిస్తామ‌నే ధీమా కూడా ఆ పార్టీ నుంచి వ్య‌క్తం అవుతూ ఉంది. 

ఇక తెలుగుదేశం పార్టీ ఏమీ తీసిపోవ‌డం లేదు! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెల‌వ‌దంటూ ఆ పార్టీ సానుభూతి ప‌రులు వాదిస్తూ ఉన్నారు. ఈ మేర‌కు బెట్టింగులు వేయ‌డంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లు ముందున్నార‌నే మాట వినిపిస్తూ ఉంది. జ‌న‌సేన‌, బీజేపీల మ‌ద్ద‌తుతో కూట‌మిగా తాము విజ‌యం సాధిస్తామ‌నే ధీమా తెలుగుదేశం వైపు నుంచి వినిపిస్తూ ఉంది.   

ఇక సంద‌డిలో స‌డేమియాగా ప్రీ పోల్ స‌ర్వేలు, పోస్ట్ పోల్ స‌ర్వేల హ‌డావుడి కొన‌సాగుతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ కు కూడా ఇన్నాళ్లూ గేట్లేశారు, అవి కూడా ఇక స్వైర్య‌విహారం చేయ‌డ‌మే మిగిలి ఉంది. రెండున్న‌ర నెల‌ల వేచి చూపుల‌కూ, ల‌క్ష కోట్ల‌కు పైగా పెట్టుబ‌డుల‌కూ, ఐదేళ్ల రాజ‌కీయ గ‌మ‌నానికి, వంద కోట్ల మంది ప్ర‌జ‌ల ఓట్ల తీర్పుకూ మ‌రి కొన్ని గంట‌ల స‌మ‌యమే మిగిలి ఉంది!