కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.1 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని డెవిడెండ్ గా చెల్లించనుందనే వార్తలు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయల మొత్తం ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి అందుతోందంటే.. ప్రభుత్వం ఆ డబ్బును ఏం చేస్తుందనే అంశం కూడా చర్చలో ఉంది. అయితే కేంద్ర బడ్జెట్ లో లోటు ఏకంగా 17 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంటుందట! ఆ 17 లక్షల కోట్ల రూపాయల లోటును భర్తీ చేసుకోవడంలో ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు ఏ మూలకు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.
మరి ఇంతకీ ఆర్బీఐ ఇంత సొమ్మును ఉన్న ఫలంగా ఎలా చెల్లించగలుగుతోందంటే బ్యాంకులకు బ్యాంక్ అయిన ఆర్బీఐ కి సవాలక్ష వ్యాపారాలుంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు! అందులో ముఖ్యమైనది నోట్ల ముద్రణ! ఉదాహరణకు ఐదువందల రూపాయల నోటు ముద్రణకు ఆర్బీఐ రెండు రూపాయల మొత్తాన్ని ఖర్చు పెడుతుందనుకుంటే.. దానిపై ఆర్బీఐకి 498 రూపాయల లాభం దక్కినట్టు! అనేది ఒక ఆర్థిక వేత్త చెప్పే మాట! అంటే.. ముద్రించిన నోట్లను ఆర్బీఐ బ్యాంకులకు సరఫరా చేయడమే దాని పెద్ద వ్యాపారం!
నోట్ల ముద్రణ ఎంత చేయాలనే అంశం గురించి అనేక ఆర్థిక గణనలు ఉంటాయనేది తెలిసిందే. అవెన్ని ఉన్నా.. నోట్ల ముద్రణ ద్వారా ఆర్బీఐ ప్రధానంగా డబ్బు సంపాదిస్తుందట! ఇవి గాక.. ఆర్బీఐ బాండ్ల మీద, బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటుంది. తన దగ్గర భారీ ఎత్తున బంగారు నిల్వలను కలిగి ఉంటుందనే వార్తలు తరచూ బిజినెస్ పేపర్లలో ప్రచురితం అవుతూ ఉంటాయి. ఇలాంటి మార్గాల ద్వారా, వడ్డీల ద్వారా ఆర్బీఐ డబ్బులు సంపాదిస్తుందట!
ఆర్బీఐ సాధారణంగా ప్రతి ఏడాదీ కేంద్ర ప్రభుత్వానికి డెవిడెండ్ చెల్లిస్తూనే ఉంటుంది. అయితే అది ఈ ఏడాది గరిష్టం! గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ 81 వేల కోట్ల రూపాయల డెవిడెండ్ చెల్లించిందట కేంద్రానికి. అది ఇప్పుడు 2.1 లక్షల కోట్ల రూపాయలయ్యింది. గతంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర కోట్ల రూపాయల పై మొత్తాన్ని కేంద్రానికి ఆర్బీఐ డెవిడెండ్ గా చెల్లించిందని గణాంకాలు చెబుతున్నాయి.