మళ్లీ లైన్లోకి వస్తున్న సీనియర్ దర్శకులు

టాలీవుడ్ లో సీనియర్ దర్శకుల హవా దాదాపు తగ్గిపోయింది. పూరి జగన్నాధ్ లాంటి డైరక్టర్లు మార్కెట్లో ఉన్నారు కానీ హవా చూపించలేకపోతున్నారు. ఈ ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు కొత్త డైరక్టర్లు వస్తూనే ఉన్నారు. ఇలాంటి…

టాలీవుడ్ లో సీనియర్ దర్శకుల హవా దాదాపు తగ్గిపోయింది. పూరి జగన్నాధ్ లాంటి డైరక్టర్లు మార్కెట్లో ఉన్నారు కానీ హవా చూపించలేకపోతున్నారు. ఈ ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు కొత్త డైరక్టర్లు వస్తూనే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో పాత దర్శకులు మళ్లీ మెగాఫోన్ పడితే ఎలా ఉంటుంది? ఆ టైమ్ రానే వచ్చింది.

సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి మళ్లీ మెగాఫోన్ పట్టుకుంటానని ప్రకటించారు. త్వరలోనే తన నుంచి ఓ మంచి సినిమా వస్తుందని ప్రకటించారు. ఇప్పటి తరం టేస్ట్ కు తగ్గట్టు సరికొత్త కథతో, మంచి టెక్నికల్ వాల్యూస్ తో సినిమా తీస్తానని ఆయన ప్రకటించారు.

దర్శకుడు గుణశేఖర్ కూడా మరో సినిమా ప్రకటించారు. శాకుంతలం తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. యుఫోరియా పేరుతో యూత్ ఫుల్ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. కూతురు నీలిమ నిర్మాతగా రాబోతున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందంట.

దర్శకుడు విజయ్ భాస్కర్ కూడా సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొడుకును హీరోగా పెట్టి ఉషా పరిణయం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం.

ఇక బి.గోపాల్, కె.రాఘవేంద్రరావు కూడా సినిమాలు తీస్తామని గతంలోనే ప్రకటించారు. అయితే ఇప్పటివరకు వీళ్లు సినిమాలు ఎనౌన్స్ చేయలేదు. బాలకృష్ణతో యాక్షన్ సినిమా చేస్తానని బి.గోపాల్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కె.రాఘవేంద్రరావు సినిమా ప్రకటించలేదు, అలా అని తప్పుకున్నట్టు కూడా చెప్పలేదు. అప్పుడప్పుడు దర్శకత్వ పర్యవేక్షకుడిగా మారుతున్నారు.