రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగడానికి నిర్ణయించుకుని, వయనాడ్ ను రాహుల్ గాంధీ వదులుకున్న తర్వాత.. ఇప్పుడు ఉపఎన్నిక అనివార్యం అయింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం ప్రచారానికి మాత్రం పరిమితం అయిన ప్రియాంక గాంధీ ఇప్పుడు అన్నయ్య వదలిపెట్టిన వయనాడ్ నుంచి పోటీకి దిగబోతున్నారు. అయితే, ఈ సీటునుంచి ప్రియాంక 7 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవాలని లక్ష్యం నిర్దేశించుకున్నదంటూ వార్తలు వస్తున్నాయి. అది సాధ్యమేనా? అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇండియా కూటమి తరఫున ప్రియాంక బరిలోకి దిగబోతున్నది గనుక.. వారి కూటమిలో భాగస్వామి అయిన సీపీఐ ను బుజ్జగించి.. వారు పోటీలో లేకుండా చేయగలిగితే తప్ప.. ప్రియాంక 7 లక్షల మెజారిటీ సాధించడం కుదరదని అంటున్నారు. పార్టీ ఆమేరకు టార్గెట్ పెట్టుకోవడం ఓకే కానీ, అప్పటికీ కష్టమే అనే వాదన కూడా వినవస్తోంది.
వయనాడ్ లో రాహుల్ గాంధీ తొలిసారి పోటీచేసినప్పుడు కేరళ ప్రజలు ఆయనకు ఘన విజయం కట్టబెట్టారు. 2019లో ఆయనకు మొత్తం 7.06 లక్షల ఓట్లు పోలయ్యాయి. నాలుగులక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ లభించింది. 2024 వచ్చేసరికి ఆయన మెజారిటీ మూడున్నర లక్షలకు పడిపోయింది. సీపీఐ- కాంగ్రెస్ మిత్రపక్షాలే అయినప్పటికీ.. ఈ సీటును వారు వదలిపెట్టలేదు. సీనియర్ నాయకుడు రాజా సతీమణి అన్నీ రాజా ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. ఆమెకు 2.83 లక్షల ఓట్లు వచ్చాయి. దాంతో రాహుల్ మెజారిటీ కూడా కాస్త తగ్గింది.
ఇప్పుడు జరుగుతున్నది ఉప ఎన్నిక! రెండు చోట్ల పోటీ చేసి గెలిచి.. రాయ్‌బరేలీని ఉంచుకుని, తమను విస్మరించినందుకు వయనాడ్ ప్రజలు అసంతృప్తితో ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఆయన సొంత చెల్లెలే అక్కడ పోటీచేయబోతున్నారు. కాబట్టి.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలమే. కానీ.. 7 లక్షల మెజారిటీ అనేది కేవలం కల మాత్రమే.
కాకపోతే.. మోడీ 3.0 సర్కారు కూడా ఏర్పడిపోయిన తర్వాత.. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలో జయాపజయాలు ఎవరూ పెద్ద సీరియస్ గా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అతి ప్రయత్నమ్మీద సీపీఐను బుజ్జగించి.. వారిని పోటీలో లేకుండా చేయగలిగితే మాత్రమే ప్రియాంక మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. అలా జరిగి, సీపీఐ కూడా ప్రియాంక కోసం ముమ్మర ప్రచారం చేస్తే 7 లక్షల మెజారిటీ రావొచ్చు. మరి ప్రియాంక కల నెరవేరుతుందో లేదో చూడాలి.