కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీకి కష్టకాలం నడుస్తోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో టీడీపీ దాడులు పెరిగాయి. ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వినుకొండలో అందరూ చూస్తుండానే వైసీపీ కార్యకర్త షేక్ అబ్దుల్ రషీద్ అనే యువకుడిని నరికి చంపారు. ఇలాంటి చర్యలు వైసీపీ శ్రేణుల్ని భయభ్రాంతులకి గురి చేస్తాయి.
టీడీపీ దాడుల్ని తట్టుకోవడం వైసీపీ శ్రేణులకి సవాల్‌గా మారింది. తానున్నానని భరోపా కల్పించాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వుంది. తాను వుంటున్న ప్రాంతానికి సమీపంలో వైసీపీ కార్యకర్త హత్యకు గురైతే కనీసం వెళ్లాలనే ఆలోచన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైఎస్ జగన్ ధోరణి వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.
వైసీపీ యువ కార్యకర్త హత్యకు గురైతే, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అంజాద్ బాషా, ఎమ్మెల్సీలు ఇసాక్‌బాషా, మర్రి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేశ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు ఖండించారు. టీడీపీ హింసాయుత చర్యల్ని వారంతా తప్పు పట్టారు. వీళ్లందరి కంటే, ప్రధానంగా స్పందించాల్సిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తన పార్టీ కార్యకర్త హత్యకు గురైనా కనీసం ఆ కుటుంబానికి, వైసీపీ శ్రేణులకి ధైర్యం చెప్పాలనే స్పృహ జగన్‌లో లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.
ఇదే బాధితులు టీడీపీకి చెందిన వారై వుంటే, వెంటనే చంద్రబాబు, లోకేశ్ ఘాటుగా స్పందించే వారు. గతంలో వైసీపీ హయాంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ కార్యకర్త నందం సుబ్బయ్య హత్యకు గురైతే, నారా లోకేశ్ స్వయంగా అక్కడికి వెళ్లారు. పాడె పట్టి, అంతిమ సంస్కారం నిర్వహించారు. వైసీపీలో ఆ పని చేసేవాళ్లేరి?
ఇలాగైతే వైసీపీ బతికి బట్ట కట్టేదెట్టా? అనే ప్రశ్న ఆ పార్టీ నాయకుల నుంచి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడుల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వివిధ రకాలుగా నష్టపోతున్నారు. బాధితులుగా మిగులుతున్నారు. కనీసం వారిని పలకరించే దిక్కులేదు. టీడీపీ దాడుల కంటే, తమ ఆవేదనను సొంత పార్టీ నేతలెవరూ పట్టించుకోలేదన్న ఆవేదన వారిని కుంగదీస్తోంది. ఇప్పటికైనా తమ పార్టీ శ్రేణుల ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ నడుచుకుంటే మంచిది.
Maa comments anni thesesaru very bad