విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్‌కల్యాణ్‌కు వుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిద్రలేచిన మొదలు ట్విటర్లో లోకేశ్ తమపై విరుచుకుపడేవారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు తల్లికి వందనం, ఉచిత ఇసుక, విద్యుత్ ట్రూఅప్ చార్జీలు, అలాగే మోటర్లకు మీటర్లు బిగిస్తావా? లేదా? అంటే మాట్లాడ్డం లేదని మండిపడ్డారు. అంతేకాదు, తల్లికి వందనం పథకం లోకేశ్ మంత్రిత్వశాఖకు సంబంధించిందని కాకాణి అన్నారు.
సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేసే బాధ్యత తనదని జనసేనాని పవన్‌కల్యాణ్ చెప్పారని కాకాణి గుర్తు చేశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని పవన్‌కల్యాణ్ కూడా చెప్పారని ఆయన అన్నారు. పవన్‌కల్యాణ్ తన విశ్వసనీయత దెబ్బతినకుండా, చూసుకోవాల్సిన సమయం ఇది అన్నారు. ఈ నాయకులెవరూ మాట్లాడకుండా, జనాన్ని అడ్డగోలుగా మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
అయితే కూటమి ప్రభుత్వ మోసాల్ని ప్రశ్నిస్తుంటే, దాని నుంచి పక్కదారి పట్టించడానికి వైఎస్ జగన్‌పై కేసులు పెట్టి చంద్రబాబు కపట నాటకానికి తెరలేపారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారని ఆయన అన్నారు. అధికారం తన చేతుల్లో వుందని చంద్రబాబు విరవీగుతున్నారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు.
బాబు పాలన ప్రారంభమై 40 రోజులైందన్నారు. విమర్శించాలని తాము అనుకోవడం లేదన్నారు. మీ పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై వుందన్నారు. మీ పద్ధతుల్ని సరిచేసుకోవాలని కూటమి నేతల్ని ఆయన కోరారు. తాము ఓడిపోయి వుండొచ్చని, అయితే ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత తమపై ఉన్నట్టు కాకాణి తెలిపారు.