ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అమ్మ ఒడి అనే కొత్త పథకానికి జగన్ శ్రీకారం చుట్టి, పేద, సామాన్య పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలని ఆకాంక్షించారని అన్నారు. ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలని, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు జగన్ పని చేశారని ఆయన అన్నారు. అమ్మ ఒడి పథకాన్ని అద్భుతంగా అమలు చేశారన్నారు. అలాంటి జగన్‌పై కూటమి నేతలతో పాటు షర్మిల కూడా విమర్శలు చేస్తున్నారన్నారు.
అమ్మ ఒడి కంటే మెరుగ్గా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తారా? లేదా? అని షర్మిల ప్రశ్నించకుండా, టీడీపీ అధికార ప్రతినిధిలా ఆమె మాట్లాడుతున్నారని తప్పు పట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ అనే విషయాన్ని మరిచిపోవద్దని పోతిన మహేశ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారా? లేరా? అనే అనుమానం వస్తోందన్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి మాట్లాడాలని షర్మిలకు పోతిన సూచించారు.
వాటి అమలు కోసం పోరాటం చేయాలన్నారు. ఇప్పటికీ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్న షర్మిలను చూస్తుంటే, కూటమిలో రహస్య భాగస్వామ్యం వుందనే అనుమానం అందరిలో కలుగుతోందన్నారు. అలాగే బీ3 బాబుల చేతిలో బందీ అయ్యారనే అనుమానం వస్తోందన్నారు.
బీ3 బాబు అంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌బాబు, లోకేశ్‌బాబు అని ఆయన చెప్పుకొచ్చారు. బీ3 బాబుల చేతిలో షర్మిల బందీ అయ్యారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు. అమ్మ ఒడిపై షర్మిల విమర్శలు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. జీవో నంబర్ 29ను చంద్రబాబు సర్కార్ జారీ చేసిందన్నారు. ఇందులో ప్రతి బిడ్డకూ అని నమోదు చేయకుండా, ప్రతి తల్లికీ అని మాత్రమే చేర్చారన్నారు. అది కూడా తల్లులందరికీ కాదని ఆయన అన్నారు. తల్లికి వందనం పథకంలో ప్రతిబిడ్డకూ లబ్ధి చేకూరుస్తున్నారా? లేదా? అని మంత్రి నిమ్మల రామానాయుడిని ఆయన నిలదీశారు.