వైసీపీ ఎంపీపీ భవనం కూల్చివేతకు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వీరంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకనే, టీడీపీ ప్రజాప్రతినిధులు ఇలా చేస్తున్నారేంటి? అనే విమర్శ వినిపిస్తోంది. టీడీపీ అధినేతల్ని ప్రసన్నం చేసుకోవడంలో కొలికిపూడి ఆరితేరారని ఆయన పార్టీ నాయకులే అంటుంటారు.
ఈ నేపథ్యంలో మీడియాధిపతుల సిఫార్సుతో తిరువూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి ఎలాగోలా టికెట్ దక్కించుకున్నారు. అదృష్టం కలిసొచ్చి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడాయన దృష్టి అంతా మంత్రి పదవిపైనే. మంత్రి పదవిని గెలవడం ఎలా? అని ఆయన నిత్యం ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారనే అనుమానం టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.
అందుకే ఆయన తన ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎంపీపీ నాగలక్ష్మి కుటుంబానికి చెందిన భవనాన్ని టార్గెట్ చేశారు. మందీమార్బలం, భవనాన్ని కూల్చేందుకు యంత్రాలతో తనే స్వయంగా వెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించింది. తన చర్యలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆయనకు తెలియదని అనుకోలేం. అవన్నీ ఐదేళ్ల నాడు చూసుకుందామని ఆయన భావన అంటున్నారు కొలికపూడి అనుచరులు.
తక్షణం మంత్రి పదవిని దక్కించుకోడానికి చంద్రబాబు, లోకేశ్ దృష్టిలో పడాలనే అత్యుత్సాహం కొలికిపూడిలో కనిపించింది. ప్రత్యర్థుల భవనాల్ని కూల్చివేతల్ని లోకేశ్ ప్రోత్సహిస్తున్నారని టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అందుకే ఆ పని తానెందుకు చేయకూడదని స్వయంగా రంగంలోకి దిగారాయన. కొలికిపూడి వీరంగం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని లోకేశ్, చంద్రబాబు పసిగట్టి వెంటనే మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం వుంది. కాలయాపన చేస్తే, ప్రత్యర్థులకు చెందిన మరిన్ని భవనాలను కూల్చడానికి ఆయన వెళ్లే అవకాశం వుంది. తగ్గేదే లే అని ఆయన చర్యలు చెప్పకనే చెబుతున్నాయి.