ఈరోజే నెల్లూరులో బిగ్ ఫైట్.. ఏం జరుగుతుంది?

ఈ రోజు సాయంత్రం నెల్లూరులో మంత్రి కాకాణి అభినందన ర్యాలీ. అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కార్యకర్తలతో టౌన్ లో బహిరంగ సభ పెట్టుకున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీల గొడవ ముదిరింది, మాటల యుద్ధం…

ఈ రోజు సాయంత్రం నెల్లూరులో మంత్రి కాకాణి అభినందన ర్యాలీ. అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కార్యకర్తలతో టౌన్ లో బహిరంగ సభ పెట్టుకున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీల గొడవ ముదిరింది, మాటల యుద్ధం కూడా ఓ రేంజ్ లో సాగుతోంది. సభ వద్దని అధిష్టానం తనకు చెప్పలేదంటున్నారు అనిల్, తగ్గేదే లేదని తేల్చి చెబుతున్నారు. మరి సాయంత్రానికి రిజల్ట్ ఏంటి..? ఎవరు సర్దుకుంటారు, ఎవరు కాలరెగరేస్తారు. అధిష్టానం కలగజేసుకుంటుందా..?

తాను మంత్రిగా ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో తనను ఏ కార్యక్రమానికి పిలవలేదని, తనను అవమానించారనేది అనిల్ ఆరోపణ. ఇప్పుడు కాకాణి మంత్రి అయ్యారు కాబట్టి.. ఆయన ఇచ్చిన ప్రేమ, ఆప్యాయతలను రెట్టింపు స్థాయిలో ఇస్తానంటున్నారు. ప్రతీకార రాజకీయాన్ని ఎవరూ కాదనలేదు. కానీ ఇప్పడు అనిల్ ప్రతీకారం అంతా తన సొంత పార్టీ నాయకుడిపైనే. కాకాణిపై కాలరెగరేశారంటే.. కచ్చితంగా అది జగన్ కి కూడా ఇబ్బందే. 

ఇద్దరి పోరు వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే అప్పుడు నేను జగన్ సైనికుడ్ని, వైఎస్ఆర్ భక్తుడ్ని అని చెప్పుకున్నా ఉపయోగం ఏం లేదు. చలిమంటలు కాచుకోడానికి విపక్షాలు రెడీగా ఉన్నాయి. చేజేతులా వారికి ఆయుధాలిచ్చి, తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఎలా..?

ఎవరు సర్దుకుపోతారు..?

ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ, టీడీపీ అనుకూల మీడియా ఇప్పటికే దీన్ని పెద్ద రాద్ధాంతం చేసింది. అనిల్, కాకాణి వర్గాలను రెచ్చగొట్టింది. ఈ ఉద్రిక్త వాతావరణంలో నెల్లూరులో ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు ఎదురుపడితే పరిస్థితి చేయిదాటితే ఎవరేం చేయగలరు. మధ్యేమార్గం అధిష్టానం ఇద్దరితో చర్చలు జరుపుతోందని సమాచారం. 

ఇది కూడా వైరి వర్గం మీడియా సృష్టే. అయితే దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది. వ్యక్తిగత ఇగోలు, ప్రతీకారం కోసం పార్టీని బలిపెడతానంటే జగన్ చూస్తూ ఊరుకోరు. కాకాణి వైపు నుంచి ఇప్పటి వరకూ కౌంటర్ పడలేదు కాబట్టి.. ఆయన సర్దుకుపోయేటట్టు ఉన్నారని సమాచారం. 

నెల్లూరు టౌన్ లో తన ఫ్లెక్సీలు చించేసినా కూడా ఆయన సైలెంట్ గానే ఉన్నారు. నాయకులు, అభిమానులు అనిల్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతామన్నా కూడా కాకాణే అడ్డుకున్నారట. మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో సాయంత్రానికి ఓ క్లారిటీ వస్తుంది.