అప్పలకొండ – జోగినాధం: జాంబీ రెడ్డి కబుర్లు

అప్పలకొండ: ఏరా జోగినాధం …కుంటుతున్నావేంట్రా? Advertisement జోగినాధం: కుక్క కరిచింది రా అప్పలకొండా! ఇంజెక్షన్ పొడిపించుకున్నాను ఇప్పుడే.  అప్పలకొండ: కుక్కే కదా…మనిషేమో అని కంగారు పడ్డాను జోగినాధం: ఎహె..మనిషి ఎందుకు కరుస్తాడు? నువ్వు..నీ కుళ్లు…

అప్పలకొండ: ఏరా జోగినాధం …కుంటుతున్నావేంట్రా?

జోగినాధం: కుక్క కరిచింది రా అప్పలకొండా! ఇంజెక్షన్ పొడిపించుకున్నాను ఇప్పుడే. 

అప్పలకొండ: కుక్కే కదా…మనిషేమో అని కంగారు పడ్డాను

జోగినాధం: ఎహె..మనిషి ఎందుకు కరుస్తాడు? నువ్వు..నీ కుళ్లు సెటైర్లు…

అప్పలకొండ: మరదే..లోకజ్ఞానం లేకపోవడం అంటే..జాంబీల గురించి విన్నావా?  

జోగినాధం: లేదులే..చెప్పు..నీ దగ్గరకొచ్చాక సోది వినక తప్పుద్దా!!

అప్పలకొండ: సోది కాదురా…జాంబీలంటే చచ్చిపోయినా బతికున్న మనుషులు…వాళ్లు మనలాంటోళ్లని కరిచారంటే మనం కూడా జాంబీలైపోతాం…ఇక చావుండదు…మనుషుల్ని మెడ మీద కరిచి రక్తం తాగుతూ బతకాల్సిందే…

జోగినాధం: (ఎగా దిగా చూసి) ఏరా..రాత్రేం తాగావ్?

అప్పలకొండ: ఎప్పుడూ తాగేదే రా…ప్రెసిడెంట్ మెడలు..

జోగినాధం: నిజం చెప్పు..నిన్ను కూడా ఒక నెల క్రితం కుక్క కరిస్తే ఇంజెక్షన్ చేయించుకోలేదు కదూ…

అప్పలకొండ: ఎందుకా డౌటు? 

జోగినాధం: కుక్క కరిచాక ఇంజెక్షన్ పొడిపించుకోక పోతే ర్యాబీస్ అనే జబ్బొస్తదట. అదొచ్చినోళ్లు పిచ్చ వాగుడు వాగుతారట. 

అప్పలకొండ: ఎహె..మళ్లీ ఎదవ సెటైరు…ఎందుకులే పాయింటుకొస్తున్నాను….జాంబీ రెడ్డి అని సినిమా వచ్చింది…వర్మ డైరెక్షన్!

జోగినాధం: ఎవరు?…రామ్ గోపాల్ వర్మా? నెట్లో వదిలాడా? 

అప్పలకొండ: కాదురా..ప్రశాంత్ వర్మ అని ఆల్రెడీ రెండు సినిమాలు తీసాడు…థియేటర్లోకే వదిలాడు…అందులో మ్యాటర్ ఇదే…కరోనా వ్యాక్సీన్ కనిపెట్టి టెస్టింగు కోసం ఒక సైంటిష్టు మనుషులకి ఇంజెక్షన్ పొడుస్తాడు..వాళ్లు జాంబీలైపోయి వేరే జనాల్ని కరుస్తుంటారు…అలా రెండూళ్ల జనం జాంబీలైపోయాక హీరో గారి సౌజన్యంతో అందరూ నార్మల్ అవుతారులే. 

జోగినాధం: అమ్మో…కొంపదీసి నాకు మన ఆరెంపీ డాక్టరుగాడు పొడిచింది ఆ ఇంజెక్షన్ కాదు కదా!

అప్పలకొండ: హహహ…కాదు లేరా…భయపడకు..అదైతే ఈ పాటికి నన్ను కరిచేసే వాడివి కదా!

జోగినాధం: నీ బొంద..భయం కాదు…ఇది సెటైరు…అద్సరే గానీ…కరోనా వ్యాక్సీన్ ఏయించుకుంటావా?

అప్పలకొండ: ఏమోరా జోగి…ఈ సినిమా చూసాక ఆలోచించాలేమో అనిపిస్తోంది. 

జోగినాధం: ఎహె.ఊరుకో…సినిమాలో చూపించనట్టు ఏమైనా అవుతోందేంటి? అమెరికా అధ్యక్షుడు ఏయించుకున్నాడు…ఆడెవర్నీ కరవట్లేదుగా…ఇక్కడ మనోళ్లు కూడా ఏయించుకున్నారు…అలాంటిదేం లేదుగా…

అప్పలకొండ: ఏమోరా జోగి…ఎందుకైనా మంచింది ఒక కిరసాయిల్ డబ్బా పక్కనుంచుకోవాలి…

జోగినాధం: అదెందుకురోయ్…

అప్పలకొండ: ఒంటి మీద కిరసనాయిలు పోసుకుంటే ఆ వాసనకి జాంబీలు మీదకి రావట..

జోగినాధం: పోనీలే..నీలాంటి మేధావులకి అదొక ఉపాయం చెప్పాడన్నమాట దర్శకుడు..

అప్పలకొండ: అంటే నేను మేధావినే అంటావ్! థాంక్స్ రా..

జోగినాధం: ఏడిసావ్…ఇది సెటైరు…

అప్పలకొండ: సర్లే.. అన్నట్టు ఒక ఉద్యమం కూడా చెయ్యాలనుకుంటున్నాను రా…

జోగినాధం: ఏంటది?

అప్పలకొండ: ప్రపంచంలో అందరూ పళ్లు, గోళ్లు ఊడ గొట్టుకుని కట్టుడు పళ్లు, పెట్టుడు గోళ్లు పెట్టించుకోవాలి…

జోగినాధం: (షాకయ్యి చూస్తూ) ఒరేయ్…డాక్టరు దగ్గరికెళ్దాం పద. నీకు ర్యాబీస్ వ్యాధి వచ్చేసింది. 

అప్పలకొండ: ఎహె ..విను…ఒరిజినల్ పళ్లు, గోళ్లు లేకపోతే జాంబీలుగా మారి ఎవరినైనా కరిచినా …కరిపించుకున్న వాళ్ళు జాంబీలుగా మారలేరు. ఆ పాయింటు కూడా ఇంది ఈ సినిమాలో…

జోగినాధం: వామ్మో…నాకిప్పుడొక డౌట్ వస్తోంది…

అప్పలకొండ: ఏంటది?

జోగినాధం: ఆ ప్రశాంత్ వర్మ ని ఈ సినిమా తీసే ముందు కచ్చితంగా రామ్ గోపాల్ వర్మ కరిచుంటాడు!!