జీవితంలో లేటుగా తెలుసుకునే స‌త్యాలు!

ఆనందం అనేది ఎప్పుడూ ఇత‌రుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న‌ట్టుగా యుక్త వ‌య‌సు, మిగిలిన వ‌య‌సు కూడా గ‌డిచిపోతుంది

ఇన్ స్టాగ్ర‌మ్ లో కొంద‌రు వృద్ధుల‌ను ప‌ల‌క‌రిస్తూ.. మీ క‌న్నా చిన్న వ‌య‌సులో ఉండే వారికి మీరు చెప్పేదేంటి? అనే ప్ర‌శ్న‌తో కొంద‌రు వీడియోలు చేస్తూ ఉంటారు. ప్ర‌త్యేకించి పాశ్చాత్య వ్లాగ‌ర్లు ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. 70 నుంచి ఎన‌భై యేళ్ల వ‌య‌సులో ఉన్న వృద్ధుల‌ను ప‌ల‌క‌రించి.. వారు చెప్ప‌ద‌లుచుకున్న దాన్ని చిన్న వీడియోలుగా పోస్ట్ చేస్తూ ఉంటారు.

తాము జీవితంలో మిస్ అయిన వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆ అనుభ‌వ‌జ్ఞులు స్పందించే అవ‌కాశాలు ఉంటాయి. అలాంటి వారిలో చాలా మంది చెప్పేదేంటంటే.. దేని కోసం అతిగా ఆరాటం వ‌ద్ద‌ని, వ‌ర్త‌మానాన్ని ఆస్వాధించ‌మ‌ని, అన్నీ వేగంగా జ‌రిగిపోవాల‌ని కోరుకోవ‌ద్ద‌ని, బాంధ‌వ్యాలు చాలా ప్ర‌ధానం అని.. ఆ పాశ్చాత్య సంస్కృతిలోని వారు చెబుతూ ఉంటారు! మ‌రి జీవితంలో చాలా లేటుగా తెలుసుకునే స‌త్యాలు మ‌రి కొన్ని ఉంటాయి. వ‌య‌సులో ఉన్న‌ప్పుడు వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకోరెవ‌రూ! ఇవ‌న్నీ అప్ర‌ధానాలుగా అగుపిస్తాయి. అయితే వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం అయితే ఎంతైనా ఉంటుంది!

ఎలా ఆనందంగా ఉండొచ్చు!

మీకు ఆనందాన్ని ఇచ్చేవి ఏమిటి అంటే.. ఈ విషయాల్లో చాలా మంది ఫాంట‌సీలు ఉంటాయి. అలాంటివి నెర‌వేరిన‌ప్పుడే తాము ఆనందంగా ఉంటామ‌నే తీరుతో చాలా మంది ఉంటారు. అయితే అవి నెర‌వేరేవిలా ఉండ‌వు, అది అర్థం చేసుకునేంత ప‌రిణ‌తి వ‌చ్చే స‌రికే జీవితం చాలా వ‌ర‌కూ గ‌డిచిపోతుంది. అప్పటికే చాలా కాలమూ గ‌డిచిపోయి ఉంటుంది. కాబ‌ట్టి.. అంద‌ని ద్రాక్ష‌ల గురించి ఆరాట‌ప‌డ‌టం క‌న్నా, ఉన్న వాటిలో ఆనందాన్ని వెదుక్కోవ‌డం అనేది చేయాల్సింద‌ని, అంతా అయిపోయాకా కానీ బోధ‌ప‌డ‌దు!

ఆరోగ్య‌మే సంప‌ద అనేది!

ఎంతో సంపాదించిన వారు కూడా ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క చాలా క‌ష్టాలు ప‌డుతూ ఉంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్న‌వారికి దాని విలువ తెలియ‌క‌పోవ‌చ్చు. అయితే క‌రోనా ప‌రిస్థితుల త‌ర్వాత మ‌నుషుల నైజం కొంత వ‌ర‌కూ మారింది. ఆరోగ్యం ఎంత విలువైన సంప‌దో అర్థం అవుతూ ఉంది. హెల్త్ ఈజ్ వెల్త్ అనే విష‌యాన్ని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం గురించి క‌స‌ర‌త్తులు చేయాల్సిన అవ‌స‌రం కూడా కాస్త లేటు వ‌య‌సులో అర్థం కావొచ్చు.

స‌మ‌యం విలువైన‌ది!

యుక్త వ‌య‌సులో అయినా, ఉద్యోగాలు చేస్తున్న స‌మ‌యంలో అయినా.. స‌మ‌యాన్ని వ్య‌ర్థం చేస్తున్న‌ప్పుడు దాని విలువ తెలియ‌క‌పోవ‌చ్చు. రోజులు, వారాలు, నెల‌లు, సంవ‌త్స‌రాలు, ద‌శాబ్ద స‌మ‌యం కూడా.. ఇట్టే గ‌డిచిపోయిన‌ట్టుగా అనిపిస్తుంది వ‌యసు పెరుగుతున్న కొద్దీ. 10 యేళ్ల నుంచి 20 యేళ్ల మ‌ధ్య స‌మ‌యంతో పోలిస్తే 20 నుంచి 30 మ‌ధ్య‌న స‌మ‌యం వేగంగా గ‌డిచిపోయిన‌ట్టుగా అనిపిస్తుంది. ఆ త‌ర్వాత వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ రోజులు వేగంగా గ‌డిచిపోతూ ఉంటాయి. ఇలా స‌మీక్షించుకున్న‌ప్పుడు స‌మ‌యం విలువ‌, వ్య‌ర్థం చేసిన స‌మ‌యం రెండూ తెలుస్తాయి!

డ‌బ్బు విలువ‌!

డ‌బ్బు జీవితంలో చాలా కీల‌క‌మైన‌ది. డ‌బ్బులు లేక‌పోతే జీవితం నిస్సందేహంగా సాఫీగా ఉండ‌దు. డ‌బ్బు సంపాదించిన వారికి అయినా, డ‌బ్బు సంపాదించ‌లేక‌పోయిన వారికి అయినా ఈ విష‌యంలో లేటుగా జ్ఞానోద‌యం అవుతుంది. అతిగా డ‌బ్బుల కోసం పాకులాడి జీవితాన్ని ఆస్వాధించ‌లేక‌పోయిన వాళ్లూ ఉంటారు. మ‌నుషుల‌ను దూరం చేసుకున్న వారూ ఉంటారు. వారికి ఒక ద‌శ‌లో డ‌బ్బు కోసం తామెంత త‌పించిపోయిన నిర్వేద‌మూ మ‌న‌సులో క‌ల‌గ‌వ‌చ్చు. ఇక ప్ర‌ణాళిక ర‌హితంగా గ‌డిపి డ‌బ్బులు వ్య‌ర్థం చేసుకున్న వాళ్లకూ దాని విలువ లేటుగా అర్థం కావొచ్చు.

బంధాలు ఆనంద‌మ‌యం చేసుకోలేక‌పోతే!

మ్యారిట‌ల్ లైఫ్ కావొచ్చు, ఇత‌ర బంధాల విష‌యంలో కావొచ్చు.. స‌ఖ్య‌త‌తో గ‌డ‌లేక‌పోయిన విష‌యం కూడా లేటుగా అర్థం అవుతుంది. లేనిపోని గొడ‌వ‌ల‌తో బంధాలు దెబ్బ‌తిన్న త‌ర్వాత వాటి విలువ తెలియ‌వ‌చ్చు. లేదా బంధం కోసం అతిగా ప్రామ‌ఖ్య‌త‌ను ఇచ్చి ప్ర‌శాంత‌త‌ను కోల్పోయిన వైనం అయినా చింత‌న‌లో గుర్తుకు రావొచ్చు.

మార్పు అనివార్యం అనేది!

జీవితంలో చిన్న చిన్న మార్పుల‌కు కూడా కొంద‌రు త‌ట్టుకోలేరు. చాలా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. అయితే జీవితంలో మార్పులు అనేది నిరంత‌రం అనేది, మార్పులు అనివార్యం అని.. మార్పుల‌కు త‌గ్గ‌ట్టుగా మార‌డ‌మే జీవితం అనే విష‌యం కూడా ఆల‌స్యంగా బోధ‌ప‌డుతుంది.

ఆనందం అనేది అంత‌ర్గ‌తం!

మీ ఆనందం అనేది ఎప్పుడూ ఇత‌రుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న‌ట్టుగా యుక్త వ‌య‌సు, మిగిలిన వ‌య‌సు కూడా గ‌డిచిపోతుంది. ఒక ద‌శ‌లో స్నేహితులు, ప్రేమ ఆ త‌ర్వాత దాంప‌త్యం, పిల్ల‌లు, స్నేహితులు.. ఇలా ఎంత‌సేపూ మ‌రొక‌రితోనే ఆనందం ముడిప‌డితే.. వారితోనే, వాటిల్లోనే ఆనందం ఉంటుంద‌న్న‌ట్టుగా జీవితం గ‌డుస్తూ ఉంటుంది. అయితే.. ఎవ‌రి ఆనందం అంత‌ర్లీనంగా వారి త‌త్వం మీదే ఆధార‌ప‌డి ఉంటుంది త‌ప్ప‌, ఇత‌రుల మీద కాద‌ని, అలా ఆధార‌ప‌డితే ఆనందం అనేది అరుదైన‌ది అవుతుంద‌నే విష‌యం కూడా లేటుగా జ్ఞానోద‌యం అయ్యే అంశాల్లో ఒక‌టి!

5 Replies to “జీవితంలో లేటుగా తెలుసుకునే స‌త్యాలు!”

  1. యాభై ఏళ్ల వయసులో తెలుసుకోవలసిన నిజం ఒకటి ఉంది. 151 రికార్డు బ్రేక్ నెంబర్ ఒక్కసారిగా 11 అవ్వటానికి కారణం మన స్వయం కృపరాదం తప్ప వేరే ఏమీ కాదు అని

Comments are closed.