ట్రంప్ విజయం వెనక 5 కారణాలు

ట్రంప్ ఇచ్చిన హామీలు అతడికి అమెరికా సింహాసనాన్ని దగ్గర చేశాయి.

“గెలిచి ఓడితే ఆ ఒటమే గుర్తుంటుంది.. ఓడి గెలిస్తే, ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే, చరిత్ర ఎప్పుడూ ముగింపునే గుర్తుపెట్టుకుంటుంది.” రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలో డైలాగ్ ఇది. దీన్ని అక్షరాలా నిజం చేసి చూపించారు డొనాల్డ్ ట్రంప్.

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ఆయన బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకొని, ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా గెలిచారు. ఈ తరహాలో గెలవడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.

అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్ హౌజ్ లో అడుగుపెట్టబోతున్న ట్రంప్ విజయానికి ప్రధాన కారణాలేంటి? దీనిపై పాశ్చాత్య మీడియా రకరకాల విశ్లేషణలిస్తోంది. ప్రధానంగా 5 అంశాలు, ట్రంప్ విజయానికి లైన్ క్లియర్ చేశాయి. ఆ టాప్-5 రీజన్స్ ఏంటి..?

ఎలాన్ మస్క్ సపోర్ట్

ట్రంప్ కు ఎలాన్ మస్క్ ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదు. మస్క్ కు ఆయన వ్యాపార అవసరాలు ఆయనకు ఉండొచ్చు. కానీ అమెరికాలో ఇప్పటివరకు ఏ వ్యాపారవేత్త, ఈ స్థాయిలో అధ్యక్ష అభ్యర్థికి సహకరించలేదు.

ట్రంప్ ఏదో తనకు దగ్గర చుట్టం అయినట్టు.. ఆయన తన జీవితానికి అత్యంత విలువైన వ్యక్తి అన్నట్టుగా మస్క్ వ్యవహరించాడు. ట్రంప్ కోసం ఏకంగా 119 మిలియన్ డాలర్ల విరాళం అందించాడు. అయితే ఇచ్చిన విరాళం కంటే, తెరవెనక మస్క్ చేసిన సహాయం, అందించిన మద్దతు అపారం.

తన ట్విట్టర్ ను ట్రంప్ కు దాసోహం చేశాడనేది బహిరంగ రహస్యం. ట్రంప్ కు మద్దతుగా, కమలా కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో వచ్చిన కథనాలు, విశ్లేషణలు అమెరికన్ల మైండ్ సెట్ ను మార్చేశాయి. ఒక దశలో ట్రంప్ గెలవకపోతే అమెరికా నాశనం అనే అర్థం వచ్చేలా ప్రజల్ని భయటపెట్టింది ట్విట్టర్. “ట్రంప్ విల్ ఫిక్స్ ఇట్” (ట్రంప్ అన్నీ సరిచేయబోతున్నాడు) లాంటి హ్యాష్ ట్యాగ్స్ ను పాపులర్ చేసిన ఘనత ట్విట్టర్ కే దక్కుతుంది. అలా ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు మస్క్.

హత్యాయత్నంతో సింపతీ

ఇక ట్రంప్ విజయానికి లైన్ క్లియర్ చేసిన మరో ప్రధాన అంశం అతడిపై హత్యాయత్నం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తున్న సమయంలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి. అతడి మద్దతుదారుడు చనిపోయాడు. ట్రంప్ చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకుపోయింది. ఈ ఘటన తర్వాత అమెరికా రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల్ని అమెరికన్లు చూసే దృక్కోణం మారిపోయింది. సురక్షితమైన అమెరికాను కోరుకునేవాళ్లంతా ఒక్క దెబ్బకు ట్రంప్ వైపు వచ్చేశారు. ఈ ఘటన తర్వాత ట్రంప్ పై సింపతీ అమాంతం పెరిగింది. ఆయనను మరోసారి అధ్యక్షుడ్ని చేసింది.

అందరివాడు అనిపించుకున్నాడు

మొదటిసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికైన సందర్భం గుర్తుందా..? తను అందరివాడ్ని అని చెప్పుకునేందుకు మోదీ అనుసరించిన ‘చాయ్ వాలా’ విధానం చాలామందికి గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అదే పద్ధతిని ఈసారి ట్రంప్ అనుసరించారు. చాలామంది దృష్టిలో ఆయనో వ్యాపారవేత్త. దాన్ని చెరిపేసేందుకు ఆయన ‘సామాన్యుడు’గా మారిపోయారు. కార్మిక వర్గానికి తనే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా కలరింగ్ ఇచ్చుకున్నారు. మెక్ డొనాల్డ్స్ లో పనిచేశారు. చెత్తను శుభ్రంచేసే వ్యక్తిగా పోజులిచ్చారు. సరిగ్గా ఎన్నికలకుముందు ఆయన చేసిన ‘గార్బేజ్’ ప్రచారం పనిచేసింది. కార్మికులు దీనికి ఆకర్షితులయ్యారు.

అమెరికా ఫస్ట్

అమెరికా ఫస్ట్ నినాదం కూడా ట్రంప్ కు అద్భుతంగా కలిసొచ్చింది. అంశం ఏదైనా ‘అమెరికా ముందు’ అనేది ట్రంప్ నినాదం. అది ఇమ్మిగ్రేషన్ పాలసీ అయినా, దిగుతులైనా, ఉద్యోగాలైనా.. ఇలా ప్రతిదాంట్లో ముందు అమెరికన్లకే అవకాశం అన్నారు ట్రంప్. నిజానికి ఇది కొత్త హామీ కాదు, గతంలో ఇదే హామీతో ఆయన అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు దాన్నే ఇంకాస్త మార్చి “మేలుకో అమెరికన్” అనే స్లోగన్ తో కొత్తగా ప్రజెంట్ చేశారు. ఉద్యోగ భద్రత, సరిహద్దు అంశాల్ని హైలెట్ చేయడంలో “అమెరికా ఫస్ట్” కాన్సెప్ట్ బాగా పనిచేసింది.

బలహీన ప్రత్యర్థి

ఇక చివరిది, ట్రంప్ కు బాగా కలిసొచ్చినది బలహీన ప్రత్యర్థి. రేసు నుంచి బైడెన్ తప్పుకొని, తన వారసురాలిగా కమలా హారిస్ ను ప్రకటించిన రోజే చాలామంది ట్రంప్ విజయాన్ని కన్ ఫర్మ్ చేశారు. అయితే ఊహించని విధంగా కమలా తన ప్రజాదరణను పెంచుకున్నారు. కానీ రోజులు గడిచేకొద్దీ ట్రంప్-మస్క్ మీడియా మేనేజ్ మెంట్ ముందు కమలా నిలబడలేకపోయారు. దీనికి తోడు ఇమ్మిగ్రేషన్ అంశంపై ట్రంప్ విమర్శల్ని, కమలా బలంగా తిప్పికొట్టలేకపోయారు. ఇతర దేశాల్లో ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బైడెన్-కమలా విఫలమయ్యారనే విషయాన్ని హైలెట్ చేయడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు.

ఈ 5 ప్రధాన కారణాలతో పాటు.. ట్రంప్ ఇచ్చిన హామీలు అతడికి అమెరికా సింహాసనాన్ని దగ్గర చేశాయి. బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే వలసదారుల్ని దేశం నుంచి వెల్లగొడతానని.. పన్నులు తగ్గిస్తానని.. విదేశీ దిగుమతులపై సుంకాలు పెంచుతానని ఆయన చెప్పిన మాటల్ని అమెరికన్లు నమ్మారు. దీనికితోడు.. తను అధికారంలోకి రాగానే ఇజ్రాయెల్, ఉక్రెయిన్ లో నడుస్తున్న యుద్ధాల్ని ఆపేస్తానని ఆయన చెప్పడం చాలామందికి నచ్చినట్టుంది.

12 Replies to “ట్రంప్ విజయం వెనక 5 కారణాలు”

  1. నాకెందుకో ఈ ఆర్టికల్… జగనన్న ను ఉద్దేశించి రాసి నట్లుంది GA…

  2. బైడెన్ కంటే కమల బలహీన ప్రత్యర్థి కాదు, బైడెన్ కాదని కమల ని ఖరారు చేసినప్పుడు మీడియా అంతా కమల ముందున్నట్లు సర్వే లు చూపించారు. మీడియా వీలున్నంత వరకు కమల వైపు మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది.

Comments are closed.