Kanguva Review: మూవీ రివ్యూ: కంగువా

అనుభవజ్ఞుడైన సూర్య కూడా ఇలాంటి సీన్ చేస్తున్నప్పుడు కానీ, చేసేసాక కానీ, ఎడిటింగ్ సమయంలో కానీ ఎలా ఉందో ఆలోచించుకోలేదా?

చిత్రం: కంగువా
రేటింగ్: 2.25/5
తారాగణం: సూర్య, దిశా పటాని, బాబీ డియోల్, యోగిబాబు, కోవై సరళ తదితరులు
కెమెరా: వెట్రి పళనీస్వామి
ఎడిటింగ్: నిషద్ యూసఫ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాతలు: జ్ఞానవేల్ రాజా, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
దర్శకత్వం: శివ
విడుదల: 14 నవంబర్ 2024

ఎందరికో అభిమాన నటుడు సూర్య హీరో..”యామినల్” తో తన స్టార్ డం ని చాటుకున్న బాబీ డియోల్ విలన్. “కల్కి”లో కనిపించిన దిశా పటాని హీరోయిన్. ఇలా అన్నీ హిట్ సినిమాలతో అసోసియేట్ అయిన పేర్లు, ఏదో విచిత్ర ప్రపంచాన్ని తలపించే ట్రైలర్ కలిసి..”కంగువ” పై ఆసక్తి పెంచాయి. టైటిల్ అర్ధమేంటో తెలుగు ప్రేక్షకులకి తెలియకపోయినా స్టార్లకి కనెక్టయ్యి చాలా ఆశించారు. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం.

ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో ఉంటుంటాడు. కల్కి సినిమాలో ప్రభాస్ లాగ ఇతనొక బౌంటీ తీసుకుని క్రిమినల్స్ ని పట్టిచ్చే వృత్తిలో ఉంటాడు. ఏంజెలా (దిశ పటాని) అతని గర్ల్ ఫ్రెండ్. వీళ్లు అనుకోకుండా జీటా అనే ఇబ్బందిలో ఉన్న పిల్లవాడిని తారసపడతారు. ఫ్రాన్సిస్ కి, జీటా కి ఏదో అవినాభావ సంబంధం ఉందని ఇద్దరికీ తెలుస్తుంటుంది. కానీ అదేంటో తెలియదు. ఆ పిల్లవాడిని కాపాడాలని నిర్ణయించుకుంటాడు ఫ్రాన్సిస్. ఇంతకీ ఆ ఇద్దరి మధ్యన సంబంధం కీ శ 1070 నాటిది. ఆ కాలంలో ఐదు ద్వీపాలు, ఐదు తెగలు. ఆ తెగల మధ్యలో గొడవలు. అందులో కాపాలికా తెగ కి చెందిన రాజు రుధిర (బాబీ డియోల్). అతని లక్ష్యం ప్రణవాది తెగకి చెందిన రక్షకుడు కంగువ (సూర్య) ని చంపడం. ఆ మధ్యలో పోరువ (2024లో జీటా) ఎలా ప్రవేశిస్తాడు. కంగువకి, పోరువకి సంబంధమేంటి? అది 2024లో ఎలా కొనసాగింది అనేది కథ.

ఈ రెండు జన్మల ట్రాక్ 2009 నాటి “మగధీర” అంత పాతది. ఆ క్లాసిక్ కి, దీనికి కంపారిజన్ లేదు కానీ, ఆ ఫార్మాట్ లో ఉందని మాత్రం చెప్పొచ్చు. పైగా చివర్లో “ఎన్ని జన్మలెత్తినా సరే నీ ఋణం తీర్చుకుంటానురా పోరువా” అని మగధీరలో శ్రీహరి రేంజులో అదే పిచ్ లో అరుస్తాడు సూర్య. మరి గుర్తురాక ఏమౌతుంది!?

అసలిలాంటి కథ రాసుకుని చెప్పదలచుకున్నది ఏవిటో అర్ధం కాదు. చెప్పక్కర్లేదు.. పోనీ ఇవ్వదలచుకున్న అనుభూతి ఏమయ్యుండొచ్చు? హీరోకి, పిల్లవాడికి మధ్యన ఉన్న ఎమోషన్. అంతే. అంతకుమించి ఇందులో కథ, కాకరకాయ ఏవీ లేవు. తెగల మధ్య గొడవలు, తన్ని తగలేసుకోవడాలు..!

అయినా ఇలాంటి యాంబియన్స్ ఎవ్వరికీ కొత్త కాదు. అయితే ఎంత వెగటు పుట్టేలా తీస్తే అంత గగుర్పాటు కలిగిస్తుంది అనుకున్నారేమో దర్శకనిర్మాతలు. కానీ తలపోటు కలిగించింది. పైగా ఈ భీభత్సాన్ని అనుభవించడానికి 3డి ఒకటి.

ప్రధమార్ధంలో 2024 నాటి స్టోరీ తెర మీద కదులుతున్నంత సేపూ కథ ఎటూ నడవదు. ఏదో సైంటిఫిక్ థ్రిల్లర్ టైపులో సెమీ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చిపోతుంటాయి. వీటిని హాలీవుడ్ సినిమా రేంజులో చిత్రీకరిస్తే జనం మైమరిచిపోయి చూస్తారని అనుకుని ఉండొచ్చు. ఎవడు ఎందుకు కొడుతున్నాడో, లక్ష్యాలు, ఉద్దేశాలు ఏవిటో తెలుసుకోకుండా ఎంత యాక్షన్ జరిగినా ప్రేక్షకుల్లో రియాక్షన్ ఉండదు. ఇంటర్వల్ సమయంలో ట్విస్టులాంటిదేం లేదు. దీర్ఘంగా నిట్టూర్చి కాళ్లీడుస్తూ బయటికి వెళ్లడమే.

ద్వితీయార్ధం కూడా అంతే. హీరో, ఆ పిల్లాడు తప్ప మిగిలిన పాత్రలన్నీ ఎందుకున్నాయో.. దొమ్మీల్లోనూ, యుద్ధాల్లోనూ చావడానికి తప్ప దేనికి ఉపయోగపడ్డారో తెలీదు. అంత వీన్ రైటింగ్ ఇది. ప్రెజెంట్ టైం కథ పేలవంగా ఉంటే, పాస్ట్ లోకి తీసుకెళ్లిన కథనం తల పేలేలా ఉంది.

ట్రీట్మెంట్, గ్రాఫిక్స్, యాంబియన్స్ మీద దృష్టి పెట్టి కథని, కథనాన్ని గాలికొదిలేసిన చిత్రమిది. సాంబారులో వెయ్యాల్సినవి ఏవీ వేయకుండా గుప్పెడు ఇంగువ మాత్రం వేస్తే ఎలా తగలడుతుందో అలా ఉంది ఈ “కంగువ”.

సూర్య మేకోవర్, నటన ఓకే. కానీ కథనం పట్టు తప్పాక ఎంత చేసినా ప్రయోజనమేముంటుంది?

బాబీ డియోల్ బాడీ స్ట్రాంగ్ గానూ, క్యారెక్టర్ రైటింగ్ పరమ వీక్ గానూ కనిపించాయి. కాపాలికుల రాజుగా కౄరంగా ఉన్నాడు తప్ప, అతని ద్వారా కథని డ్రైవ్ చేసే మ్యాటర్ రైటింగ్ లో లేదు.

బాలనటుడు మాత్రం ఆకట్టుకున్నాడు. పాస్ట్ లోనూ, ప్రెజెంట్ లోనూ అతని మీద పెట్టిన క్లోజప్స్ లో కావాల్సిన ఎక్ష్ప్రెషన్స్ ని చక్కగా పలికించాడు.

దిశా పటానిది బటానిలాంటి పాత్ర. కోవై సరళ, యోగి బాబు వేస్టైపోయిన చిన్న పాత్రలు. క్లైమాక్స్ లో కార్తి ఎంట్రీ మాత్రం బాగుంది. ఆ కాసేపూ కాస్తంత ఎనెర్జీ వచ్చినట్టయ్యింది కానీ, అంతలోనే మళ్లీ నెరేషన్ నట్టు లూజయ్యి సడలిపోయింది.

దేవీశ్రీప్రసాద్ సంగీతం మాత్రం బాగుంది. నేపథ్య సంగీతం లౌడ్ గా అనిపించినా పాటలు మాత్రం ఎంగేజింగ్ గా ఉన్నాయి. పాటల్లోని వాక్యాలు కొన్ని అర్ధవంతంగా వినిపించాయి. “ఆది జ్వాల..అనంత జ్వాల..” పాట మంచి ఊపుతో ఉంది. అలాగే “మన్నింపు” పాటలో సాహిత్యం సందర్భోచితంగా ఉంది. పాటల వరకు దేవీశ్రీప్రసాద్ కాస్త ఊరట కల్గించాడు.

కెమెరా, గ్రాఫిక్స్ వంటి సాంకేతికాంశాలు ఉన్నత ప్రమాణాలతో ఉన్నాయి.

ఏది బాగున్నా, ఏది బాగోకపోయినా.. అతిశయోక్తే అతిగా ఫీలయ్యే సీన్లు, ఇది సూపర్ హీరో సినిమానో లేక ఈ భూమ్మీదే నిలబడి రాసుకున్న కాల్పనిక కథో తెలియని తనం ఉన్నాయిందులో. క్లైమాక్స్ లో ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని పట్టుకుని వ్రేలాడుతూ చేసిన స్టంట్లైతే ట్రోలింగ్ చేసుకోవడానికి పనికొస్తాయి. అనుభవజ్ఞుడైన సూర్య కూడా ఇలాంటి సీన్ చేస్తున్నప్పుడు కానీ, చేసేసాక కానీ, ఎడిటింగ్ సమయంలో కానీ ఎలా ఉందో ఆలోచించుకోలేదా? ఏమో! ఐదు దీవుల కథ ప్రేక్షకుల పంచప్రాణాలనీ తోడవతల పారేస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకుని “కంగువా” కి వెళ్లిన ప్రేక్షకులు ఖంగు తినాల్సిందే.

బాటం లైన్: “ఖంగు”వా!

11 Replies to “Kanguva Review: మూవీ రివ్యూ: కంగువా”

  1. అసలు ఈ డైరెక్టర్ శివ గా – డి – ని నమ్మి సూర్య ఇలాంటి సినిమా తీసాడంటే దండం పెట్టాలి ఈ శివ తెలుగులో రొట్ట రోత సినిమాలు తీస్తుంటే జనాలు భరించలేక నీకు ఆరవ అతి యే కరెక్ట్ అని అక్కడికి తరిమారు

  2. ఒక రొ(హిత్)ట్ట శెట్టి ,ఒక శివ ,ఒక హరి ఈ ముగ్గురు రాడ్ గా — ల్ల – సినిమాలను కేవలం ఆరవ అతి గాళ్ళు నార్త్ లో ఉన్న మూస బ్యాచ్ తప్ప వేరే వాళ్ళు చూడలేరు

  3. అసలు రివ్యూ అర్థవంతంగా వుందా లేదా కాదు భయ్యా ముఖ్యం , ఎన్ని పంచులు ప్రాసలు పడ్డాయి అది లెక్క. అన్ని సినిమాలని మూడు పాటలు ఆరు ఫైట్లు అని తిట్టడం, మనం మాత్రం పంచ్ ప్రాసలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం.

    ఇంగువ కంగువ , పటాని బటాని, కంగువా ఖంగువా. సూపర్ డూపర్

Comments are closed.