కోవిడ్‌-19 ఎక్స్‌ఈ…వేగంగా విస్త‌రిస్తోంది!

క‌రోనా మ‌హ‌మ్మారి పీడ ఇప్ప‌ట్లో వదిలేలా లేదు. క‌రోనా ఫ‌స్ట్‌, సెకెండ్‌, థ‌ర్డ్ వేవ్‌లు వెళ్లిపోయాయ‌ని, ఇక ఎలాంటి వేవ్‌కు స్థానం ఉండ‌ద‌ని ఊపిరి తీసుకుంటున్న స‌మ‌యంలో షాకింగ్ న్యూస్. కొత్త వేరియంట్ తెర‌పైకి…

క‌రోనా మ‌హ‌మ్మారి పీడ ఇప్ప‌ట్లో వదిలేలా లేదు. క‌రోనా ఫ‌స్ట్‌, సెకెండ్‌, థ‌ర్డ్ వేవ్‌లు వెళ్లిపోయాయ‌ని, ఇక ఎలాంటి వేవ్‌కు స్థానం ఉండ‌ద‌ని ఊపిరి తీసుకుంటున్న స‌మ‌యంలో షాకింగ్ న్యూస్. కొత్త వేరియంట్ తెర‌పైకి వ‌చ్చిన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. కొత్త‌గా క‌నుగొన్న మ‌హ‌మ్మారి పేరు కోవిడ్-ఎక్స్ఈ.

కొత్తగా బయట పడిన కరోనా మ్యూటెంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. దీనికి వేగంగా విస్త‌రించే గుణం ఉంది. ఒమిక్రాన్ వేరియెంట్‌లో బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించేదిగా భావిస్తూ వ‌చ్చారు. స్టెల్త్‌ కరోనాతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10 శాతం ఎక్కువ వేగంతో వ్యాపించే గుణం ఉన్న‌ట్టు  ప్రపంచ ఆరోగ్య సంస్థ తన  నివేదికలో పేర్కొంది.

కొత్త వేరియంట్ ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ క‌ల‌యిక‌. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కలిసి ఏర్ప‌డిన కొత్త‌ రూపం. ఎక్స్ఈ రకాన్ని ఈ ఏడాది జనవరి 19న బ్రిటన్ లో గుర్తించారు. ప్రస్తుతానికి ఎక్స్ఈ ప్ర‌భావిత కేసులు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. 

మున్ముందు ఎలా విస్త‌రిస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేర‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిస్తోంది. కావున క‌రోనా విష‌యంలో అజాగ్ర‌త్త‌గా ఉండ‌కుండా, నిబంధ‌న‌లు పాటిస్తూ అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం ఒక్క‌టే మ‌న‌ముందున్న ఏకైక క‌ర్త‌వ్యం.