తెలుగునాట భక్తి రసం తెప్పలుగా సాగుతోంది…డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారితోంది అన్నారు కవి మల్లారెడ్డి. కానీ అప్పటికి తెలుగునాట అందునా ముఖ్యంగా ఆంధ్రనాట కులజాఢ్యం అంతగా అంటుకోలేదు. స్వాతంత్రానికి ముందు నుంచి కమ్మ సంఘాలు, రెడ్డి హాస్టళ్లు వున్నాయి. కానీ ఎవరి మధ్య పెద్దగా స్పర్థలు లేవు. ప్రైవేటు స్కూళ్లు లేవు కనుక పేద, ధనిక తారతమ్యం అంతగా లేదు. అందరూ ఒక స్కూలు లోనే చదువుకోవాల్సి వచ్చేది. అందువల్ల ఓ స్నేహ పూరిత వాతావరణం వుండేది.
రాజకీయాల్లో రెడ్ల హవా వుండేది. కాంగ్రెస్ పార్టీలో ఈ రెడ్డి కాలు ఆ రెడ్డి, ఆ రెడ్డి కాలు ఈ రెడ్డి లాక్కోవడం తప్ప అక్కడ కూడా కుల సమీకరణలు పెద్దగా వుండేవి కాదు. కేవలం అధికార తాపత్రయం కనిపించేది. అలాగే తెలంగాణ, రాయలసీమ ప్రాంతీయ వాదం ఈ రాజకీయాల్లో వుండేది కానీ కులాల ప్రభావం తక్కువ.
తెలుగునాట ఓ ప్రధాన దిన పత్రిక ప్రారంభమైన తరువాత కాంగ్రెస్ ను ద్వేషించడం ప్రారంభమైంది. చాలా మంది ఇది సైద్దాంతికి విబేధం అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించడం వెనుక, దాని విజయం వెనుక ఆ పత్రిక పోషించిన పాత్ర గమించాక ఇది సైద్దాంతిక విబేధం కాదు, కులజాఢ్యం అని అవగతం అయింది.
తెలుగుదేశం ఆవిర్భాం వెనుక ఓ సామాజిక వర్గానికి రాజకీయంగా సమవాటా దక్కకపోవడం అన్నది కీలకంగా వుందన్న సంగతి అందరికీ ముందుగా అర్థం కాలేదు. కానీ ఉత్తరోత్తరా అవగతం అయింది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ వెండితెర వేలుపు కావడం, ప్రజల్లో ఆయనకు అప్పటికే ఓ ఇమేజ్ వుండడం తో ఈ అసలు సిసలు ఎజెండా జనాలకు అర్థం కాకుండా పోయింది. పైగా అప్పట్లో ఇంకా సామాన్య ప్రజానీకం కులాల కుంపట్లకు కాస్త దూరంగానే వున్నారు. బెజవాడలో మాత్రమే రెండు సామాజిక వర్గాల మధ్య కిందా మీదా వ్యవహారాలు వుండేవి. మిగిలిన ప్రాంతాలు సామారస్యంగా, సామాజిక తూకంతోనే మనుగడ సాగించేవి.
సీనియర్ జనాలకు ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎన్టీఆర్ ను ముందు పెట్టి పార్టీని ప్రారంభించిన నాదెండ్ల వగైనా పెద్దల మదిలో ఎజెండా వేరు. వారికి కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ప్రాబల్యాన్ని అడ్డుకోవడం సాధ్యం కాలేదు. ఇక వేరు కుంపటి మినహా మరో దారి కనిపించ లేదు. అందుకే తమ తమ బలాలు అన్నీ కూడదీసుకుని, ఫేస్ గా ఎన్టీఆర్ ను ఎంచుకున్నారు. వీళ్లు ఒకందుకు ఆయనను ముందుకు తెచ్చారు. ఆయన మరొకందుకు ముందుకు వచ్చారు.
అయితే అప్పుడు కూడా జనాలకు పెద్దగా వ్యవహారం అవగతం కాలేదు. కానీ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో రెడ్ల తరువాత కాపులకు పెద్ద పీట వుండేది. కొన్ని చోట్ల మాత్రమే బిసిలకు అవకాశం వుండేది. తెలుగుదేశం పార్టీ వచ్చి అన్ని చోట్లా వీలయినంత మంది బిసి లను దగ్గరకు తీసింది. బిసిలను వాడుకుని ఓట్లు తెచ్చుకుని, అధికారం చెలాయించవచ్చు అన్నది ప్రణాళిక. అదే ఫలించింది కూడా.
కానీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన సామాజిక వర్గ విశ్వరూపం కనిపించడం ప్రారంభమైంది. మహానుభావుడు అనుకునే ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే ఏరి కోరి తన సామాజిక వర్గానికి టికెట్ లు కేటాయించారు. ఆ సామాజిక వర్గం ఒక్కటి అంటే ఒక్క కుటుంబం వున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విజయనగరం జిల్లా చీపురుపల్లిల్లో వారికే టికెట్ లు కేటాయించారు. అంటే ఎన్టీఆర్ కు కులం మీద అభిమానం వుందని అనుకోవాలా? వద్దా?
అంతే కాదు,. తను అధికారంలోకి రాగానే పలు సంస్థలకు ఎక్కడెక్కడి నుంచో తమ వాళ్లను తీసుకువచ్చి, ఉన్నత పదవుల్లో కూర్చో పెట్టారు. ఇది కూడా చేసింది ఎన్టీఆర్ నే. చంద్రబాబు కాదు. అప్పటికి ఇంకా చంద్రబాబు తెలుగుదేశంలోకి రాలేదు. ఇలా మెలమెల్లగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ చాటున దాగిన సామాజిక వర్గం విస్తరణ ప్రారంభమైంది. పార్టీ తమది కావడం, తమకు ప్రాధాన్యత వుండడంతో పార్టీ పదవులు, అధికార పదవులు, వివిధ సంస్థల్లో పదవులు చేజిక్కించుకొవడం ప్రారంభమైంది. వాటితో పాటే వివిధ వ్యాపార అవకాశాలు, నియామకాల్లో సింహభాగం దక్కించుకోవడం ప్రారంభమైంది.
గమ్మత్తేమిటంటే చంద్రబాబు పార్టీలోకి వచ్చిన తరువాత ఈ వర్గం నిజానికి ఆయనను దూరంగానే వుంచింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావునే తమ ప్రతినిధిగా భావించింది. ఈయన దక్షిణ కోస్తావాడు కావడం, ఆయన చిత్తూరు ప్రాంతీయుడు కావడం కూడా దీని వెనుక వుంది. కానీ చంద్రబాబు తెలివితేటలతో పార్టీని తన అదుపు ఆజ్ఞల్లోకి తీసుకున్నారు. పార్టీ లక్ష్మీపార్వతి చేతిలోకి వెళ్లిపోతుందని దేశం అనుకూల సామాజిక వర్గం అంతా భయపడిన క్షణంలో చంద్రబాబునే ఆపద్భాంధవుడిలా కనిపించారు. దగ్గుబాటి వల్ల కాని పని అర్థం అయింది. దాంతో అంతా చంద్రబాబు వెనుక నిలిచారు.
తెలుగుదేశం పార్టీలో వ్యవహారాలు ఎప్పుడయితే ఇలా జరుగుతూ వచ్చాయో, అటు రెడ్లలో, ఇటు కాపుల్లో అసంతృప్తి గూడు కట్టుకోవడం ప్రారంభమైంది. సీమలో ఫ్యాక్షనిజం, కోస్తా జిల్లాల్లో కులాల గొడవలు ప్రారంభమయ్యాయి. బాంచెన్ కాల్మొక్త అని అనకపోయినా, అణిగిపోయి, అధికారం, వ్యాపారం, అవకాశాలు అన్నీ వారికి అప్పగించి సైలంట్ గా నలిగిపోయింది, మిగిలిపోయింది కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే.
మీడియా తమ చేతుల్లో వుండడంతో తాము చెప్పాలనుకున్నదే చెప్పడం, తాము చూపించాలనుకున్నదే చూపించడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. కానీ రాను రాను ఈ కులాల వ్వవహారాలు జనాలకు అవగాహన కావడం మొదలైంది. అప్పటి వరకు కాంగ్రెస్ ను ఓ బూచిగా చూపించిన వైనం తెలిసి వచ్చింది. బూచి అనుకున్న కాంగ్రెస్ నే మళ్లీ నెత్తిన పెట్టుకున్నారు జనం.
ఇక్కడ చంద్రబాబు పాలనలో తప్పు లేకపోవచ్చు. ఆయన ఆడ్మినిస్ట్రేటర్ అనిపించుకోవచ్చు. కానీ ఆ పార్టీ పాలన కారణంగా ఒక్క కులం లబ్ది పొందడం, మిగిలిన కులాలు అణగారడం అన్నది జనాల గమనింపులోకి వచ్చేసింది. దాంతో పక్కన పెట్టారు.
ఇలాంటి టైమ్ లో రాజశేఖర్ రెడ్టి అధికారంలోకి వచ్చారు. ప్రాంతాల వారీగా చీలిపోయి వున్న రెడ్లు అందరినీ ఓ తాటి మీదకు తేగలగిరు. విశాఖ బిసి రెడ్లు, తూర్పు రెడ్లు, నెల్లూరు రెడ్లు, సీమ రెడ్లు, తెలంగాణ రెడ్లు అంతా బేధాలు మరిచి ఒక్కటయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఇటు బిసిలను అటు కాపులను కూడా సమాదరించారు. అది కూడా ఆయనకు కలిసి వచ్చింది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వైఎస్ జమానా వరకు వచ్చేసరికి ఆంధ్ర నాట కుల చైతన్యం బ్రహ్మాండంగా వచ్చేసింది. పదవులు, పోస్టులు, సీట్లు అన్నీ కులాల వారీ పంపకం అన్నది అనివార్యం అయిపోయింది. అప్పటికి కూడా అది కొంత కంట్రోలు లోనే వుంది. అప్పటి వరకు తెలుగుదేశం అనుకూల మీడియా ఓ పనిని నిర్విరామంగా చేసింది. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రులను అవినీతి పరులుగా, బఫూన్లుగా చిత్రీకరించడం చేసింది.
నిజంగా కాంగ్రెస్ నాయకులు అంత అవినీతి పరులు అయితే చెన్నారెడ్డి, విజయభాస్కర రెడ్డి, అంజయ్య ఇలా వీళ్లందరి పిల్లలు ఇవ్వాళ కోట్లలో మునిగి తేలుతూ వుండాలి కదా. ఇదంతా ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి ఓ సహేతుక కారణాన్ని, వాతావరణాన్ని సృష్టించారు. నిజానికి చంద్రబాబు కన్నా ఎక్కువ ఆర్జించిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో ఎవరైనా వున్నారా? అన్నది ఆలోచిస్తే వ్యవహారం అర్థం అవుతుంది.
రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మరి ఆయన మారారో? లేక లోకేష్ హయాం రావడం వల్లనో, మళ్లీ ఆ పార్టీ పునాదుల్లో దాగిన కులం విశ్వరూపం చూపించడం ప్రారంభమైంది. అప్పటికే రాజకీయంగా, మీడియా పరంగా, వివిధ సంస్థల పరంగా. వ్యాపారపరంగా వేళ్లూనుకుపోయింది సదురు సామాజిక వర్గం. అందువల్ల ఎక్కడ ఎలా కథ నడిపించాలన్నా అత్యంత సులువు అయిపోయింది.
ఇదంతా జనాలకు అర్థం కావడానికి రెండు దశాబ్దాలు పట్టింది. కానీ ఆ విషబీజాలు బలంగా నాటుకుపోయాయి. ఇప్పుడు ఆంధ్రను కుల జాఢ్యం పట్టుకు పీడిస్తోంది. జనం అంతా రెడ్లు, కమ్మ, కాపు, బలిజ ఇలా రకరకాలుగా విడిపోయారు. ఏ ఉదతం చూసినా, ఏ వార్త చూసినా, ఏ వ్యవహారం చూసినా దాని వెనుక ఏ కులం దాగివుందో అని వెదకడం అలవాటైపోయింది. లేదా దాన్ని మాయం చేయాలంటే కులాన్ని తెరపైకి తేవడం అన్నది ఓ సాధనం అయిపోయింది.
మొత్తం మీద ఓ కులం అవకాశాల ప్రాతిపదికగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ పెట్టిన నలభై ఏళ్లకు ఆంధ్ర నాట సంకుల సమరం అలుముకుంది. మంచి చేసారా? చెడ్డ చేసారా? అన్నది కాదు ఇప్పుడు విషయం. ఏ కులం? అన్నదే పాయింట్. సర్వం ఒడ్డి అయినా తమ కులాన్ని ఎలాగైనా అధికారంలో కూర్చో పెట్టాలన్నదే అజెండా. కులాల వారీగా పార్టీలు పుట్టుకువస్తున్నాయి. కులాల వారీగా రాజకీయాలు జరుగుతున్నాయి. కులాల వారీగా మీడియా చీలిపోయింది. కులాల వారీగా సమస్య వ్యవహారాలు జరిగిపోతున్నాయి.
ఈ రావణకాష్టానికి అగ్గిపుల్ల వెలిగి నలభై ఏళ్లు.