ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌లో కాస్త మార్పు కనిపిస్తోందా? అంటే ఔననే చెప్పుకోవాలి. నిన్న ఒంగోలు మీటింగ్‌లో జగన్‌ను ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ నాయకుడిగా పవన్‌కల్యాణ్ అభివర్ణించారు.
నేడు జగన్‌కు కృతజ్ఞతలు చెప్పడం, పవన్‌లో చోటు చేసుకున్న సానుకూల మార్పునకు నిదర్శనంగా చెబుతున్నారు. దివీస్ నిరసనకారుల విడుదలకు సహకరించిన హైకోర్టు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పవన్‌కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం గమనార్హం.
ఇటీవల దివీస్ నిరసనకారులకు మద్దతుగా పవన్ పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దివీస్ కర్మాగారంతో పరిసర గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా 36 మంది దివీస్ నిరసనకారులను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకున్నాయన్నారు. ప్రస్తుతం వారికి బెయిలు రావడానికి సహకరించిన విజ్ఞతతోనే వారిపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పవన్ విజ్ఞప్తిపై జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి!