అదే పట్టుకు కూచుంటే అతీగతీ ఉండదు!

ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రులు, ప్రభుత్వంలోని పెద్దలు మంతనాలు సాగించారు. ఉద్యోగులకు చెల్లిస్తామని చెప్పిన పీఆర్సీ బకాయిలు నాలుగేళ్లలోగా 2027లోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొత్త పీఆర్సీ వేస్తాం అని కూడా హామీ…

ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రులు, ప్రభుత్వంలోని పెద్దలు మంతనాలు సాగించారు. ఉద్యోగులకు చెల్లిస్తామని చెప్పిన పీఆర్సీ బకాయిలు నాలుగేళ్లలోగా 2027లోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొత్త పీఆర్సీ వేస్తాం అని కూడా హామీ ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చారు. త్వరలోనే ఉత్తర్వులు అని కూడా చెప్పారు.

ఉద్యోగులను ప్రసన్నం చేసుకోగల నిర్ణయాలనే ప్రభుత్వం తరఫు నుంచి ప్రకటించారు. అయినా సరే అందులో రంధ్రాన్వేషణ చేయడానికి, ప్రభుత్వాన్ని ఇంకా ఎన్నిరకాలుగా బద్నాం చేయగలమా అనే దిశగా పచ్చమీడియా ప్రయత్నాలు సాగిస్తోంది. 

పాతపింఛను విధానాన్ని పునరుద్ధరించే ఉద్దేశంతో ప్రభుత్వం లేదంటూ.. నెగటివ్ ఇమేజి సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఆ మాటకొస్తే.. పాత పెన్షన్ విధానం మళ్లీ ఇవ్వడం కుదరదు అని ప్రభుత్వమే ఎప్పుడో తేల్చిచెప్పేసింది. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త ఆలోచన చేస్తున్నట్లు కూడా వివరించింది. కాగా, పచ్చమీడియా ప్రయత్నాలు కేవలం.. మరోసారి ఉద్యోగుల్ని రెచ్చగొట్టడానికే అన్నట్లుగా ఉన్నాయి.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తా అని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసిన పొరబాట్లలో ఒకటి. అధికారంలోకి వచ్చిన తరవాత, ఆచరణలో అది అసాధ్యం అని అర్థమైంది. దాంతో, కాంట్రిబ్యూటరీ పెన్షను స్కీమ్ ద్వారా చాలా నష్టపోతున్న ఉద్యోగులను ఆదుకోవడానికే.. జగన్ సర్కారు గ్యారంటీ పెన్షను పద్ధతిని తెచ్చింది. 

జగన్ మీద ఉద్యోగులు ఒత్తిడి చేయడం వల్ల వారు సాధించేది ఏమీ లేదు. జీపీఎస్ లో 33 శాతం గ్యారెంటీ ఉండేలా నిబంధనలు మార్చి, కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని ప్రభుత్వ పెద్దలు వారికి హామీ ఇచ్చారు. అందులో ఇంకా ఏమైనా మార్పు చేర్పులు కావాలంటే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అడగవచ్చు. 

తమకు ప్రభుత్వం ద్వారా వీలైనంత ఎక్కువ న్యాయం జరిగేందుకు ప్రయత్నించవచ్చు. అంతే తప్ప.. పాత పెన్షను స్కీమ్ మాత్రమే కావాలని అదే పట్టుకు కూచునిఉంటే అటూ ఇటూ కాకుండా అతీగతీ లేకుండా పోతారని, ఉద్యోగసంఘాల వ్యవహార నిపుణులే వ్యాఖ్యానిస్తున్నారు.

పాత పెన్షన్ విధానాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేసేంత సీన్ లేదు. హిమాచల్ లో పునరుద్ధరించిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా హామీ ఇచ్చింది గానీ, ఏపీ వంటి పెద్దరాష్ట్రంలో అది పునరుద్ధరణ సాధ్యం కాదు. ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ఉండగల సాధకబాధకాలను అర్థం చేసుకుని మెట్టుదిగితే బాగుంటుంది. 

జగన్ ఎన్నడో పొరబాటున ఒక మాట చెప్పారు కాబట్టి.. ఆయనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకోవడం కరెక్టు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.