రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులే అంతిమంగా పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే తప్ప ప్రజాదరణ పొందలేరు. ప్రత్యర్థులను ఢీకొట్టే క్రమంలో ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా … చివరికి పార్టీ వినాశనానికి దారి తీస్తుంది. ఇప్పుడు చంద్రబాబు మతం అనే నిప్పుతో చెలగాటం ఆడుతుండడం చూస్తే …. ఆ పార్టీ భవిష్యత్‌పై ఎవరికైనా అనుమానాలు తలెత్తక తప్పదు.
చివరికి చంద్రబాబు ఎక్కడికి దిగజారారంటే … జగన్‌పై ద్వేషం, ఆయన విశ్వసించే క్రిస్టియన్ మతాన్ని, అలాగే మైనార్టీ మతస్తులను కూడా పరాయి మనుషులుగా చూసే వరకూ వెళ్లింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, అందులో 14 ఏళ్ల పాలనాను భవం ఉన్న చంద్రబాబులో ఈ విషపు ధోరణులు ఆయనకే కాకుండా, సమాజానికి కూడా ద్రోహం చేస్తాయనే ఆందోళన కలుగు తోంది.
రాజకీయాల కోసం తాను పాతాళానికి పడిపోతున్నాననే వాస్తవాన్ని చంద్రబాబు గ్రహించలేకపోతున్నారు. టీడీపీ నూతన రాష్ట్ర కమిటీ సమావేశం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న జరిగింది.
ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం ఆ పార్టీ శ్రేణులకే ఆందోళన, ఆశ్చర్యం కలిగించింది. ఒక మతతత్వ పార్టీ అధ్యక్షుడిగానో, లేక ఒక మతానికి సంబంధించిన సంస్థ అధిపతిగానో ఆయన ప్రసంగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ ఆయన ఏమన్నారంటే…
“రామతీర్థం ఘటన దర్యాప్తు బాధ్యతను సీఐడీకి ఇచ్చారు. దాని అధిపతి క్రైస్తవుడైన సునీల్‌కుమార్. ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి.. మనమేం చేస్తున్నాం అన్నది కూడా చూసుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ, చివరకు విజయనగరం ఎస్పీ అంతా క్రిస్టియన్లే” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలతో చంద్రబాబు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తనను ఘోరంగా ఓడించిన జగన్‌పై చంద్రబాబు కోపాన్ని అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా జగన్‌కు ముస్లిం, క్రిస్టియన్, దళిత, బహుజన మైనార్టీలు అండగా ఉన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల వాళ్లంతా మరింత బలమైన ఓటు బ్యాంకుగా జగన్‌కు మారారు, మారుతున్నారు. దీంతో జగన్‌ను ఎదుర్కోవడం కష్టమని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఇది బాహాటంగానే నిన్నటి సమావేశంలో చెప్పడాన్ని గ్రహించాలి.
“మనం ఒక ఉన్మాదితో పోరాడుతున్నాం. కలిసికట్టుగా ఉంటేనే ఎదుర్కోగలుగుతాం. మనం చీలిపోతే దెబ్బతింటాం. గెలుపొక్కటే మంత్రం కావాలి” అని తన పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. బాబు మాటల్లోని “మనం” అంటే ఎవరనేది ప్రధాన ప్రశ్న. బాబు దృష్టిలో మనం అంటే సమాజంలోని మెజార్టీ సభ్యులైన హిందువులని అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్‌కు అండగా నిలిచిన హిందువుల్లో చీలిక తెస్తే తప్ప తనకు, తన పార్టీకి భవిష్యత్, మనుగడ ఉండదనే ఆందోళన బాబులో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చివరికి తన హయాంలో సీఐడీలో నియమితుడైన ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌లో కూడా క్రిస్టియానిటీని చూసేస్థాయికి దిగజారారు.
ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి, డీజీపీ …ఇలా అందరిలోనూ ఆయనకు ఇప్పుడు క్రిస్టియన్లే కనిపిస్తున్నారు. పచ్చ కామెర్లోళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందనే సామెత చందాన …మనసంతా కుల పిచ్చిని నింపుకున్న చంద్రబాబు దృష్టిలో…జగన్‌కు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఓటరూ క్రిస్టియన్ లేదా ముస్లిం లేదా …నాన్ హిందువే.
నిన్న మొన్నటి వరకూ జగన్‌పై మాత్రమే చంద్రబాబుకు ద్వేషం ఉందని అందరూ భావించారు. ఇప్పుడాయన మతం కోణంలో ప్రతి ఒక్కరిని విమర్శించడం చూస్తుంటే, ఓటర్లపై కూడా అంతేస్థాయిలో ద్వేషాన్ని చిమ్ముతున్నారని అర్థం చేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ చరమాంక దశలో ఉన్న చంద్రబాబులో విపరీత ధోరణులకు , తాజాగా ఆయన పతన దశే నిదర్శనమంటున్నారు. చంద్రబాబు మత రాజకీయాలు చేసేందుకు శ్రీకారం చుట్టడం అంటే పులిమీద స్వారీ చేయడమే. చివరికి ఈ మత రాజకీయం చంద్రబాబు మెడకు చుట్టుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలకు టీడీపీ ఇక శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి తలెత్తుంది.
టీడీపీ అంటే ఓ అంటరాని పార్టీగా చూస్తారనే కఠిన వాస్తవాన్ని చంద్రబాబు గ్రహించాలి. తనపై హిందు ముద్రను తొలగించుకు నేందుకు బీజేపీ ఒకవైపు నానా తిప్పలు పడుతుంటే, మరోవైపు ఆ ముద్రను తాను వేయించుకునేందుకు టీడీపీ తహతహ లాడుతోంది. తాజాగా టీడీపీ మారిన రాజకీయ వ్యూహం …చివరికి తన పతనాన్ని తానే రాసుకోవడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి సూచనకు చంద్రబాబు సమాధానం ఇస్తూ …మనది లౌకిక పార్టీ అని చెప్పుకోవాల్సి వచ్చిందంటే … ఆ పార్టీ ప్రయాణం ఎటు వైపు సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. వినాశకాలే విపరీత బుద్ధి అనే సూక్తి చంద్రబాబును గుర్తు చేస్తోందంటే …దాని అర్థం ఏమై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!
-సొదుం