సినిమా ప్రచారంలో ఏ అంశాన్ని మాట్లాడకూడదో అదే అంశాన్ని ప్రస్తావించాడు దర్శకుడు డైమండ్ రత్నబాబు. మోహన్ బాబు హీరోగా సన్నాఫ్ ఇండియా సినిమాను తెరకెక్కించిన ఈ దర్శకుడు.. తమ సినిమా ఓటీటీ మూవీ అని ప్రకటించాడు. ఓటీటీ కోసం సినిమా తీసి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని చెప్పాడు. ఇలాంటి ప్రకటనలు చేస్తే, థియేటర్లకు రావాల్సిన ప్రేక్షకులు కూడా రారు కదా. ఈ చిన్న లాజిక్ ను మిస్సయ్యాడు ఈ దర్శకుడు.
మోహన్ బాబుతో ఓ ప్రయోగం చేద్దామనుకున్నాడట రత్నబాబు. అదే విషయాన్ని మోహన్ బాబుకు కూడా చెప్పాడట. కాన్సెప్ట్ నచ్చి మోహన్ బాబు ఒప్పుకున్నాడట. స్వయంగా తనే స్క్రీన్ ప్లే కూడా సమకూర్చాడు. అలా సన్నాఫ్ ఇండియా తెరకెక్కింది. అంతా బాగుంది కానీ, సినిమా రెడీ అయిన తర్వాత మోహన్ బాబుకు ఎందుకో దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలనిపించిందట.
మరోవైపు రన్ టైమ్ చూస్తే కేవలం గంటన్నర మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలంటే గంట 26 నిమిషాలు మాత్రమే. అయినప్పటికీ ఓటీటీకి ఇవ్వకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని మోహన్ బాబు నిర్ణయించడంతో, తను కూడా ఓకే చెప్పానంటున్నాడు రత్నబాబు.
మోహన్ బాబుకి చిరంజీవి వాయిస్ ఓవర్
ఈ సినిమాకు సంబంధించి స్టార్టింగ్ ఎవ్వరూ మిస్సవ్వొద్దని చెబుతున్నాడు దర్శకుడు. ఎందుకు మిస్ అవ్వకూడదో కూడా తనే చెప్పేస్తున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబు విరూపాక్ష అనే పాత్ర పోషించారట మోహన్ బాబు. ఆ పాత్ర పరిచయానికి స్వయంగా చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారట. అందుకే బిగినింగ్ మిస్ అవ్వొద్దంటున్నాడు రత్నబాబు.
ఎంత ప్రచారం చేసినా పెద్దగా బజ్ రాని ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరగడం లేదు.