టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన వాళ్లు లేరనే అభిప్రాయాలున్నాయి. ఆ అభిప్రాయా లకు బలం కలిగించే సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. బాబును నమ్ముకుని దూకుడుగా వ్యవహరించి, ఇప్పుడు ఏకాకి అయిన ఆ మహిళా అగ్రనేత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బాబు స్వార్థానికి ఆమె బలి అవుతున్నా రంటున్నారు.
వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చూపి, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ వర్సెస్ కేంద్ర సర్కార్ అనే ఘర్షణ వాతావరణం నెలకొంది.
కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ వద్ద గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పనే అని బీజేపీ విరుచుకుపడుతోంది.
ఈ నేపథ్యంలో గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మమతా సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, ఆ మేరకు తన రాజ్యాంగ విధుల్లో భాగంగా కేంద్రానికి నివేదిక పంపినట్టు తెలిపారు. నిప్పుతో చెలగాటం ఆడొద్దని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హెచ్చరించారు.
గవర్నర్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన్ను బీజేపీ ముసుగుగా అభివర్ణించింది. కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఢిల్లీకి పిలవడంపై తృణమూల్ ఎంపీలు సౌగతరాయ్, కల్యాణ్ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
మరో వైపు బెంగాల్ గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని 14న ఢిల్లీలో నిర్వహించే సమావే శానికి వచ్చి వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అయితే, ఈ సమావేశానికి ఇద్దరు ఉన్నతాధికారులను పంపించ రాదని మమతా బెనర్జీ సర్కారు నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ, నడ్డా కాన్వాయ్ మీద దాడి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, తగు చర్యలు తీసుకుం టోందని చెప్పారు. ఢిల్లీలో సమావేశం నుంచి రాష్ట్ర అధికారులను మినహాయించాలని కోరాలని తనకు ఆదేశాలందాయని ఢిల్లీకి వెళ్లేందుకు నిరాకరించారు.
పశ్చిమబెంగాల్లో ఇంత జరుగుతున్నా, నిన్నమొన్నటి వరకు మమతా బెనర్జీతో స్నేహంగా తిరిగిన చంద్రబాబు మాట వరుసకైనా కనీసం పలకరించిన పాపాన పోలేదు. ఇదే చంద్రబాబు ప్రధాని మోడీతో విభేదించినప్పుడు ఎలా వ్యవహరించారో దేశమంతా చూసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో బాబు పన్నిన పన్నాగం గురించి తప్పక గుర్తు చేసుకోవాలి.
అప్పట్లో పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు , బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కోల్‌కతాలో ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ ర్యాలీకి 20 పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు, అఖిలేష్‌యాదవ్, స్టాలిన్, శరద్‌పవార్, దేవేగౌడ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, యశ్వంత్‌సిన్హా, తేజస్వీయాదవ్, హార్దిక్‌పటేల్, జిఘ్నేశ్, శరత్‌యాదవ్, శతృఘ్నసిన్హా, కుమారస్వామి, అరుణ్‌శౌరి, మల్లికార్జునఖర్గే, హేమంత్ సొరేన్, అభిషేక్ సింఘ్ని తదితరులు హాజరయ్యారు.
ర్యాలీ, అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో ఏపీ సీఎంగా చంద్రబాబు మాట్లాడారు. అంతేకాదు, ఆయన బెంగాలీలో ప్రసంగాన్ని ప్రారంభించినట్టు ఎల్లో మీడియా గొప్పగా రాసింది. అప్పట్లో బాబు ఏం మాట్లాడారంటే…
రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.
మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని బాబు జోస్యం చెప్పారు.
మోదీ, అమిత్‌షాలను కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు. దేశమే అందరికీ ముఖ్యమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునివ్వడం అందరికీ తెలిసిందే.
పశ్చిమబెంగాల్‌కు వెళ్లి తానో దేశ రక్షకుడిగా, మోడీని గద్దె దింపే మొనగాడిగా బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు ….గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కుక్కిన పేనులా తయారయ్యారు. అసలు మోడీకి వ్యతిరేకంగా తానేమీ చేయలేదని, ఏమీ మాట్లాడలేదన్నట్టు మౌనం పాటించారు.
నిజానికి అప్పట్లో కేంద్రంపై అంత భారీగా ర్యాలీ, సభ పెట్టాల్సిన అవసరం మమతకు లేదు. కేవలం చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆమె అత్యుత్సాహానికి పోయి బీజేపీతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. అప్పుడు మమతను ఎగదోసిన చంద్రబాబు, ఓడిపోయిన తర్వాత ఆమెతో ఫోన్లో మాట్లాడ్డానికి కూడా భయపడుతున్నారనే విషయం తెలిసిందే.
గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు మద్దతుగా మమత నుంచి స్టేట్మెంట్ కూడా ఇప్పించుకున్న చంద్రబాబు… ఇప్పుడు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు కనీస స్నేహ ధర్మంగా స్పందించకపోవడం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు నిదర్శనంగా చెబుతున్నారు. చంద్రబాబు స్వార్థానికి బలైన నేతల్లో మమత ఎన్నోవారే లెక్కేలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబా ….మజాకా?