పరకాల ప్రభాకర్…బూతులు..బూతులు

సోషల్ మీడియాను వాడేది అంతా కాస్తో..కూస్తో చదువుకున్న వారు. కానీ అదే సోషల్ మీడియాలో దొర్లేటన్ని బూతులు మరెక్కడా వుండవు. అస్సలు సంస్కారం అన్న మాటకు ఆమడదూరంలో వుంటాయి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా…

సోషల్ మీడియాను వాడేది అంతా కాస్తో..కూస్తో చదువుకున్న వారు. కానీ అదే సోషల్ మీడియాలో దొర్లేటన్ని బూతులు మరెక్కడా వుండవు. అస్సలు సంస్కారం అన్న మాటకు ఆమడదూరంలో వుంటాయి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్. వుండగలిగితే తట్టుకుని వుండాలి. లేదా బ్లాక్ అనే అస్త్రం వాడాలి. కాదంటే మనమూ బూతులు లంకించుకోవాలి. 

ఇప్పుడు ఈ మార్గాన్నే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది ఘనత వహించిన మేధావి పరకాల ప్రభాకర్. మామూలు సాదా సీదా వ్యక్తి కాదు. రాజకీయాల్లో ఢక్కా మక్కీ తిన్నారు. బాబుగారి లాంటే సిఎమ్ లకు సలహాదారుగా వున్నారు. చిరంజీవి ప్రజారాజ్యంలో కీలకంగా వ్యవహరించారు. అన్నింటికి మించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ భర్త కూడా.

ఇలాంటి హై ప్రొఫైల్ వ్యక్తి ట్విట్టర్ లో తనను ట్రోల్ చేసే జనసైనికులకు చాలా అంటే చాలా చీప్ గా సమాధానం చెప్పారు. వయసు పైబడినందుకు అయినా కాస్త భాష విషయంలో కాకపోయినా భావం విషయంలోనైనా కాస్త సంస్కారం చూపించాల్సింది. అమ్మలను టార్గెట్ చేస్తూ ఈ వయసులో,ఈ మేధావి వేసిన ట్వీట్ ఛీ అనిపించుకునేలా వుంది తప్ప శభాష్ అనిపించుకునేలా కాదు.

ఈ ట్వీట్ చూసి అక్కౌంట్ హ్యాక్ అయిందేమో అనుకున్నారు చాలా మంది. కానీ హ్యాక్ కాలేదని, తాను కూడా ఇలాంటి భాష వాడగలనని చెప్పడానికి ఇలాంటి ట్వీట్ వేసానని పరకాల ప్రభాకర్ సమర్థించుకున్నారు. పైగా మీరు వాడిన భాషే తాను వాడితే ఎలా వుంటుందో మీకు అర్థం అవుతుందన్నారు. అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా వెక్కిరింపులు వేసారు…’’రెండిట్లో రెండూ ఓడిన మీ పిత్తపరిగి నాయకుడికి చెప్పుకోండి’ అంటూ ఎద్దేవా చేసారు.

జనసైనికులు నిజానికి పరకాల ట్వీట్ కు ముందు బూతులు వాడిన దాఖలా కనిపించలేదు. ప్రజారాజ్యం కు పరకాల వెన్నుపోటు పొడిచారన్నదే వారి అభియోగం. దానికే ఇరిటేట్ అయిపోయి బూతులు లంకించుకున్నారు. గమ్మత్తేమిటంటే ఇంత దారుణమైన భాష పరకాల వాడడం ఇదే మొదటి సారి కాదని గతంలో వేసిన ట్వీట్ లు బయటకు తీస్తున్నారు.

మొత్తానికి జనసైనికులకు..పరకాలకు మధ్య యుద్దం ముదిరింది. అంతా బాగానే వుంది..పరకాల వేసిన ట్వీట్ లు ట్రాన్స్ లేట్ చేసి చూస్తే నిర్మల సీతారామన్ లాంటి పెద్దలు ఎలా ఫీలవుతారో?