మృత్యువుతో పోరాటంలో భారత వాయుసేన (ఏఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ ఓడిపోయారు. శత్రువులను చీల్చి చెండాడిన కెప్టెన్ వరుణ్‌సింగ్ …మృత్యువుతో 8 రోజుల పాటు పోరాటం చేశారు. చివరికి ఆయన అలసిపోయారు. పోరాటాన్ని విరమించి ఆకాశమార్గాన తన బాస్ బిపిన్ రావత్ దగ్గరికి చేరుకున్నారు.
ఈ నెల 8న తమిళనాడులోని కూనూరు వద్ద ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 13 మంది దుర్మరణం పాలు కాగా, ఒకే ఒక్కడు కెప్టెన్ వరుణ్‌సింగ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 80 శాతం గాయాలపాలైన ఆయనకు మెరుగైన చికిత్స అందించి రక్షించు కోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. 8 రోజులుగా ఆయన బెంగళూరులో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు.
తన కుమారుడు ఎలాగైనా కోలుకుని తిరిగి వస్తాడని ఇటీవలే కెప్టెన్ వరుణ్ సింగ్ తండ్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే అందరినీ నిరాశ పరుస్తూ కెప్టెన్ వరుణ్ సింగ్ అందనంత దూరాలకు వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోయి యావత్ దేశాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తారు.
వరుణ్ సింగ్ మరణంతో ఆ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 14కి పెరిగింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.