‘జై భీం’ చూసి పవన్ కి మొట్టికాయలు

రాజుని చూస్తే మొగుడ్ని మొత్తబుద్ధయ్యిందని సామెత. అదేంటొ గానీ సూర్య నిర్మించి నటించిన “జై భీం” చూసాక పవన్ కళ్యాణ్ ని మొత్తబుద్ధేస్తుంది.  Advertisement సూర్య తమిళంలో పెద్ద స్టార్. తన స్టార్ ఇమేజ్…

రాజుని చూస్తే మొగుడ్ని మొత్తబుద్ధయ్యిందని సామెత. అదేంటొ గానీ సూర్య నిర్మించి నటించిన “జై భీం” చూసాక పవన్ కళ్యాణ్ ని మొత్తబుద్ధేస్తుంది. 

సూర్య తమిళంలో పెద్ద స్టార్. తన స్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా పక్కన హీరోయినుండాలని కానీ, నాలుగు ఫైట్స్ చేసి తెర మీద నలుగుర్ని తన్నకపోతే ఫ్యాన్స్ సినిమాని ఎడం కాలితో తంతారని కానీ… క్రీస్తుపూర్వం నాటి లెక్కలేసుకోకుండా చక్కగా “జై భీం” తీసేసాడు.

ఇప్పుడా సినిమా గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారు. కొన్ని చోట్ల చర్చలు జరుగుతున్నాయి. సినిమాలో ఉన్న సున్నితమైన అంశాన్ని వేలెత్తి చూపలేని ఒక వర్గం ఉత్తరభారతీయులు ఇందులో ఒక సన్నివేశంలో హిందీభాషని అవమానించారంటూ పక్కదారి పట్టించి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంతలా కుదుపుతున్న సినిమా ఇది. 

ఎందరి హృదయాల్నో కదిలించిన ఈ సినిమా గురించి పలువురు నటీనటులు కూడా ట్వీట్స్ పెడుతున్నారు. ఏ గ్రాఫిక్స్ లేకుండా, ఏ హై బడ్జెట్ హడావిడి లేకుండా, ఊకదంపుడు ప్రచారం లేకుండా సైలెంటుగా తమిళ సినిమా గౌరవాన్ని పెంచిన కంటెంట్ రిచ్ సినిమా ఇది. 

నిర్మాత కాబట్టి సూర్య పారితోషకం పక్కనపెడితే అంతా కలిపి ఐదు నుంచి పది కోట్లు లోపు ఖర్చే కనపడింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ల పారితోషకాలు.. న్యాయస్థానం సెట్, పాకలు లాంటి ఆర్ట్ వర్క్..ఇవే ప్రధాన ఖర్చులు. 

అమెజాన్లో నేరుగా ఒకేసారి పలుభాషల్లో విడుదలైన ఈ సినిమా దేశమంతా “జైభీం” నినాదం చేస్తోంది. 

ఇంతా చేసి సూర్య రాజకీయాల్లో లేడు. కేవలం స్టార్ నటుడంతే. రాజకీయంగా చర్చకు కారణమయ్యే ఒక సినిమాని అద్భుతంగా తీయగలిగాడు జ్ఞానవేల్ దర్శకత్వంలో. 

ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయానికొద్దాం. 

“జై భీం” లో సూర్య పోషించిన వకీల్ పాత్రే తాను పోషించాడు. పైగా అది ఒరిజినల్ కథ కాదు. అమితాబ్ నటించిన “పింక్” కి రీమేక్. అయినా పర్లేదు. ఉన్నదున్నట్టు చేయకూడదని పాత్ర వయసు తగ్గించేసుకుని, శ్రుతి హాసన్ పాత్రని తగిలించుకుని, మందు కొట్టకపోతే మనుషుల్ని కొడతాడని ఒక అసహ్యమైన క్యారెక్టరైజేషన్ పెట్టుకుని, ఫైటింగులు చేసి, పంచు డయలాగులు కొట్టి…నానా మాస్ హడావిడి చేసి పావలా చాలంటే రూపాయన్నర చేసాడు. ఇంతా చేసి ఫలితమేంటి? ఘనంగా డబ్బులొచ్చాయి. తన ఫ్యాన్సునైతే సంతోషపరిచాడు.  కానీ, “పింక్” చూసిన తక్కిన జనం చేత మాత్రం ఛీ కొట్టించుకున్నాడు. 

ఈ సినిమా ఎక్కడా చర్చలకు దారితీయలేదు. పక్క రాష్ట్రంలో కూడా ఎవ్వడూ పట్టించుకోలేదు. తెలుగు సినిమా గౌరవం పావలా కూడా పెరగలేదు. 

అన్నేసి పుస్తకాలు చదివిన మేథావినని చెప్పుకుంటూ, వేదికెక్కితే గుంటూరు శేషేంద్ర శర్మ కవితల్ని కోట్ చేసే చదువరినని చాటుకుంటూ, రాజకీయ పార్టీ పెట్టి బడుగుజనుల ఆశాజ్యోతినని స్పీచుల్లో దంచుకుంటూ… చేసే సినిమాలు మాత్రం హీరో వర్షిప్పులు, హీరోయిన్స్ తో స్టెప్పులూనా? 

ఇప్పుడు భీమలా నాయక్ వస్తోంది. అది కూడా ఒరిజినల్ కాదు…మలయాళ రీమేక్. దానికి కూడా మసాలా పూసి పావలాని అర్థరూపాయి చేసే ప్రయత్నమే జరుగుతోంది. కానీ తెలుగుపరిశ్రమ గౌరవానికి పది పైసల ప్రయోజనం కూడా ఉండదు. 

ఓటీటీ ప్రేక్షకులకి హత్తుకుపోయే కథలు చూపిస్తే చాలు. “జై భీం” ఎందరి కళ్లకో నీళ్లు తెప్పించింది. సూర్య ఒక్క ఫైట్ చెయ్యలేదు. ఒక్క పంచ్ డయలాగ్ కొట్టలేదు. దర్శకుడు జ్ఞానవేల్ పేరులోనే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని సినిమా తీయడంలో చూపించాడు. ఎక్కడా “అతి”కి పోలేదు. 

పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికీ తక్కువ సంఖ్యలో ఉన్న తన ఫ్యాన్స్ కోసమే అని కాకుండా అధిక సంఖ్యలో ఉన్న ఇతర ప్రజానీకాన్ని పట్టించుకుని వారిని మెప్పించే డొక్కశుద్ధి ఉన్న సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. 

దాని వల్ల ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవడంతో పాటు రేపు జనసేనకి నలుగురు ఓటర్లు కూడా పెరుగుతారు. 

అల్లంశెట్టి సాయినాథ్