టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాష్ కు బెయిల్ దక్కింది. ఈరోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు రవిప్రకాష్. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు బెయిల్ లభించింది. అయితే రవిప్రకాష్ కు ఇది పూర్తి ఊరటనిచ్చే అంశం కాదు. ఫేక్ ఐడీ క్రియేట్ చేశారనే చిన్న అభియోగం మీద మాత్రమే ఆయనకు బెయిల్ మంజూరైంది. అసలు కేసులు అలానే ఉన్నాయి. వాటి విచారణ కొనసాగుతోంది.
టీవీ9 నిధుల గోల్ మాల్ కు సంబంధించి రవిప్రకాష్ పై ఓ కేసు నడుస్తోంది. దీంతోపాటు టీవీ9 ఫండ్ ను అనధికారికంగా మరో సంస్థకు బదలాయించారనే కేసు కూడా ఉంది. వీటికి అదనంగా తాజాగా ఫేక్ ఐడీకి సంబంధించి రవిప్రకాష్ ను అరెస్ట్ చేశారు. ఐల్యాబ్స్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరిట రవిప్రకాష్ నకిలీ ఐడీ తయారుచేశారనే ఆరోపణపై ఆయన్ను నిర్బంధంలోకి తీసుకున్నారు.
హైకోర్టు ఆదేశాలతో నిన్న బెయిల్ మంజూరు కాగా.. 15వేల రూపాయల పూచీకత్తు సమర్పించడంతో ఈరోజు ఉదయం రవిప్రకాష్ ను జైలు నుంచి రిలీజ్ చేశారు. ఫేక్ ఐడీ సృష్టికి సంబంధించి బెయిల్ వచ్చినప్పటికీ రవిప్రకాష్ ను ఏ క్షణానైనా మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.
హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కేవలం ఫేక్ ఐడీ కేసుకు సంబంధించినది మాత్రమేనని, అలంద మీడియా ఇచ్చిన ఇతర ఫిర్యాదులకు సంబంధించి విచారణ నడుస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 40 గంటల పాటు రవిప్రకాష్ ను విచారించిన అధికారులు.. వాటి ఆధారంగా తిరిగి మరోసారి రవిప్రకాష్ ను అరెస్ట్ చేయొచ్చని పలువురు భావిస్తున్నారు.