సమీక్ష: సైరా నరసింహారెడ్డి
రేటింగ్: 3.25/5
బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
తారాగణం: చిరంజీవి, నయనతార, తమన్నా, అమితాబ్‌బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, నిహారిక, బ్రహ్మాజీ, రఘుబాబు, మాథ్యూ స్టిర్లింగ్ తదితరులు
కథ: పరుచూరి బ్రదర్స్
స్వరకల్పన: అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం: జూలియస్ ప్యాకియం
కూర్పు: ఏ. శ్రీకర్ ప్రసాద్
ఛాయాగ్రహణం: ఆర్. రత్నవేలు
నిర్మాత: రామ్ చరణ్
కథనం, దర్శకత్వం: సురేందర్ రెడ్డి
విడుదల తేదీ: అక్టోబర్ 2, 2019
కల్పిత పాత్రలని సృష్టించి వాటిని లార్జర్ దేన్ లైఫ్‌గా మలచి 'కమర్షియల్ హీరో'కి నిర్వచనంలా నిలిచేలా చేయడం తెలుగు సినిమా దర్శకులు, రచయితల స్పెషాలిటీ. అలాంటిది ఒక రియల్ హీరోని, చరిత్ర మరచిపోయిన ఒక వీరుడిని, పరాయి దేశపు పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తొలి యోధులలో ఒకడైన వాడిని, అందులోను తెలుగువాడిని ఇంకెంతటి 'హీరో'లా చూపిస్తారు, మరెంతగా గ్లోరిఫై చేస్తారు!
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథలో కావాల్సినంత హీరోయిజం వుంది, పట్టరానంత కమర్షియాలిటీ వుంది, అయినా ఇన్నేళ్లుగా ఆ కథ సినిమాగా తెరకెక్కకపోవడమే ఆశ్చర్యమనిపిస్తుంది. కొన్ని కథలు కొంత మంది నటుల కోసమే పుడతాయి, అవి ఎన్నాళ్లయినా వాళ్లనే వెతుక్కుంటూ వెళతాయన్నట్టుగా… 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథ చిరంజీవి కోసమే వేచి చూసింది. ఒక పదేళ్లు ఆలస్యంగా తెరకెక్కిందేమో కానీ సరయిన సమయంలోనే తెరమీదకి వచ్చింది. ఎందుకంటే… బాహుబలికి ముందే తీసినట్టయితే ఈ చిత్రానికి ఇంత స్కేల్ వుండేది కాదు. తెలుగు సినిమా స్థాయి, హోదా, పెట్టుబడి పెరిగిన తర్వాత, బాలీవుడ్ కూడా 'ఈ స్థాయి' సినిమాలు తెలుగువాళ్లే చేయాలని ఫిక్స్ అయిన పిమ్మట… 'బాహుబలి' వేసిన బాటలో నడిచాడు 'సైరా నరసింహారెడ్డి'.
ఇంత స్కేల్ సినిమా సురేందర్ తీయగలడా అనే అనుమానాలని పటాపంచలు చేస్తూ… మేకర్‌గా ఎప్పుడో మార్కులు వేయించుకున్న సురేందర్ 'సైరా'తో తన లెవల్ని ఎన్నో లెవల్స్ పెంచుకున్నాడు. ఇంత పెద్ద సినిమా తీసిన అనుభవం లేకపోయినా ఎక్కడా ఆ తొట్రుపాటు తెరపై కనిపించలేదు. పెట్టిన ఖర్చు తెరపై కనబడేలా, స్కేల్ పరంగా బాహుబలి సినిమాలకి ధీటుగా 'సైరా'ని తీర్చిదిద్దాడు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్ర పోషించాలని చాలా కాలంగా ఎదురు చూస్తోన్న చిరంజీవి ఈ వయసులో కూడా ఆ పాత్రకి తన నటనాపటిమతో జీవం పోసారు. అరవయ్యేళ్లు దాటిన చిరంజీవిని ముప్పయ్యేళ్ల యువకుడిలా చూపించడం, ఒప్పించడం ఈ తరం ప్రేక్షకుల విషయంలో పెద్ద సవాలే కానీ చిన్నపాటి సమస్యలు ఎదురయినా అది సమస్య కాకుండా చూసుకోగలిగారు.
ప్రేమలో పడ్డ నరసింహారెడ్డి సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెట్టినా కానీ యోధుడిగా అవతరించిన తర్వాత మాత్రం చిరంజీవి అస్సలు తగ్గలేదు. 'ఎందుకు కట్టాలిరా శిస్తు' అంటూ హూంకరించిన క్షణం నుంచి… 'స్వాతంత్య్రం' అంటూ గర్జించే తరుణం వరకు చిరంజీవి 'నరసింహా'వతారం ఎత్తేసారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో చిరంజీవి ఒంట్లో పెల్లుబికిన ఆవేశం, కంట్లో తొణికిసలాడిన గర్వం… ఉయ్యాలవాడకే రూపముంటే ఇలా వుండేవారా అన్నట్టు అనిపించింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలా వుంటారనేది తెలియదు కానీ ఇకపై ఆ పేరు తలచుకుంటే చిరంజీవి రూపం కళ్లముందుకొస్తుంది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కథలు, కథలుగా చెప్పుకుంటూ వుంటారు, ఆయన గురించిన విషయాలని వివిధ రకాలుగా రాసుకున్నారు కానీ ఒక సినిమా కాదగ్గ మెటీరియల్ అయితే అందుబాటులో లేదు. బహుశా అందుకేనేమో ఈ చిత్రం ఇంతవరకు తెరకెక్కలేదు. శాతకర్ణి మాదిరిగానే తక్కువ ఇన్ఫర్మేషన్ వుండడంతో, 'సైరా నరసింహారెడ్డి'లో ఆయన పాత్రకి బాగా కాల్పనికత జోడించారు. వాస్తవ ఘట్టాలు ఈ చిత్రంలోని సన్నివేశాలకి సంబంధం వుండకపోవచ్చు కానీ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి సజీవత్వాన్ని తీసుకొచ్చారు. ముందు తరాలు ఆయన కథ ఇదేనని నమ్మే రీతిన కల్పనని, వాస్తవాన్ని మిళితం చేసారు.
కాకపోతే పాలెగాళ్లని రాజులుగా చిత్రీకరించడం, నలభై మంది సరిగా తర్ఫీదు లేని గిరిజనులతో మూడు వందల మంది సైన్యాన్ని మట్టుబెట్టడం లాంటి సన్నివేశాలు వాస్తవాతీతం అనిపించకుండా చేయలేకపోయారు. హీరో ఎలివేషన్స్, మాస్‌కి నచ్చే మూమెంట్స్ వల్ల కొన్నిసార్లు ఇలాంటివి ఓవర్‌లుక్ చేయగలిగినా కానీ కొన్ని సందర్భాలలో మరీ ఓవర్ అనిపించ పోలేదు. నరసింహారెడ్డి ఆఖరు పోరాటాన్ని రెండు రాజ్యాల మధ్య యుద్ధంలా చిత్రీకరించిన తీరు సినిమాటిక్ లిబర్టీ లిమిట్స్‌ని పుష్ చేసినట్టనిపిస్తుంది. కానీ ఆ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించిన విధం మాత్రం శభాష్ అనేట్టుంది. చిరంజీవితో పాటు మిగిలిన ముఖ్యులంతా అసెంబుల్ అయిన విధానం 'అవెంజర్స్'ని తలపిస్తుంది. ఇదంతా ప్యూర్‌గా కమర్షియల్ అప్పీల్ కోసం చేసినదని తెలిసిపోతున్నా కానీ 'బాహుబలి' తర్వాత ఒక యుద్ధ సన్నివేశాన్ని అంత అథెంటిక్‌గా చూపించిన సన్నివేశమిదే.
మెలోడ్రామా కోసమని బ్రిటిష్ దురాగతాలని చూపించే చాలా స్టాక్ సన్నివేశాలున్నాయి. అయితే రొటీన్ అయినా కానీ ఆ సన్నివేశాలకి పేఆఫ్స్ మాత్రం ఫెంటాస్టిక్‌గా పండాయి. పిల్లాడిని నిప్పుల్లో విసిరేసి సృష్టించిన బీభత్సం తర్వాత నరసింహారెడ్డి నరసింహావతారంతో (సినిమాలో కూడా ఈ సన్నివేశాన్ని ఇదే ఉదాహరణతో వర్ణించారు) ఇంటర్వెల్ బ్లాక్ స్క్రీన్‌ప్లే గ్రాఫ్‌ని పీక్స్‌కి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ఇలా నరసింహారెడ్డినే కాకుండా ఇతర పాత్రలని ఎలివేట్ చేసే సన్నివేశాలు సినిమా అంతటా క్రమం తప్పకుండా వచ్చేలా తీసుకున్న జాగ్రత్తలతో మాసప్పీల్ మెండుగా కుదిరింది. కథని ఆరంభించిన విధానంలోనే రచయితల చతురత కనిపిస్తుంది. మనకి తెలిసిన 'ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్' లాంటి వాటికి సదరు పోరాట యోధులలో స్ఫూర్తిని రగిలించడానికి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' లాంటి మరచిపోయిన వీరుల కథని చెప్పడం ఫైన్ స్క్రీన్‌ప్లే టెక్నిక్. అలాగే సినిమా ముగిసిన తర్వాత దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహనీయుల చిత్రపటాలు చూపిస్తూ దేశభక్తి నిండిన హృదయాలతో బయటకి పంపించడం కూడా నైస్ టచ్.
అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి వాళ్లని ఆయా భాషలలో అప్పీల్ కోసమే పెట్టుకున్నారు తప్ప వాళ్లు పోషించిన పాత్రలు వేసే ఇంపాక్ట్ ఏమీ లేదు. ఆ స్థాయి నటులని పెట్టుకున్నందుకు అయినా వారు స్టాండ్ అవుట్ అనిపించే మొమెంట్స్ క్రియేట్ చేసి వుండాల్సింది. తమన్నా, జగపతిబాబుకి అలాంటి సందర్భాలు కుదిరాయి. నయనతార పాత్ర కూడా తేలిపోయింది. సైరా టైటిల్ ట్రాక్ మినహాయిస్తే సంగీత పరంగా సైరా నిరాశపరుస్తుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతంతో రావాల్సిన 'హై' టోటల్‌గా మిస్ అయింది.
కొన్ని కీలక సన్నివేశాలలో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్లాట్ అవడం మణిశర్మ, కీరవాణిలాంటి వారు తెరవెనుక లేని లోటు తెలియజేస్తుంది. సాయి మాధవ్ బుర్రా మాటలు మాత్రం చైతన్యాన్ని రగిలించేలా, నరసింహారెడ్డి ఘన కీర్తిని తెలియజేసేలా వున్నాయి. రత్నవేలు ఛాయాగ్రహణం మాత్రం అత్యద్భుతంగా వుంది. అదే విధంగా కళా దర్శకత్వం ఆ కాలపు వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. గ్రాఫిక్స్ కూడా ఇండియన్ స్టాండర్డ్స్‌కి మెచ్చుకోతగ్గ స్థాయిలోనే అనిపించాయి. నిర్మాతగా చరణ్ ఈ చిత్రానికి సిసలైన సూత్రధారిగా మారి 'సైరా' ఈ స్థాయిలో రూపొందడానికి, తెలుగు సినిమా ఖ్యాతి మరో మెట్టు పెంచడానికి చేసిన ధైర్యం ఎన్నదగింది.
'సైరా నరసింహారెడ్డి' ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించకపోయినా, అడపాదడపా గ్రాఫ్ పడుతూ లేస్తూ సాగినా కానీ ప్రేక్షకులని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడంలో, నరసింహారెడ్డిని చిరస్మరణీయం చేయడంలో, ప్రేక్షకులని భావోద్వేగానికి లోను చేయడంలో, అన్నిటికీ మించి దేశభక్తిని ప్రబోధించి మరోమారు ఆ మహనీయులందరినీ స్మరించుకునేట్టు చేయడంలో విజయం సాధించింది. వెండితెరపై వీక్షిస్తే తప్ప ఆ మజా పూర్తిగా ఆస్వాదించలేని రీతిన బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్కి తగ్గట్టుగా మలచడంలో ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడి కృషి మెప్పిస్తుంది. మరణాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునేలా చివరి సన్నివేశాన్ని విజువలైజ్ చేసి, పేపర్‌పై 'టూమచ్' అనిపించే దానిని తెర మీదకి అంత ఎఫెక్టివ్‌గా తీసుకొచ్చిన విధానం మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టిస్తుంది.
బాటమ్ లైన్: ఔరా నరసింహారెడ్డి!
-గణేష్ రావూరి